పెన్షన్ల ఎఫెక్ట్.. టీడీపీకి బూమరాంగ్‌!

ap-pensions.jpg

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఏపీలో చంద్రబాబు తాడుని పట్టుకున్నా పామై కాటేసేలా ఉంది. వాలంటీర్ల వ్యవస్థపై ఇన్నాళ్లుగా దుమ్మెత్తిపోసిన చంద్రబాబు అండ్‌కో ఇప్పుడు తాము వ్యతిరేకం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ల నిలిపివేతతో తీవ్ర వ్యతిరేకత రావటంతో నష్ట నివారన చర్యల్లో ఉంది ఏపీ విపక్ష కూటమి. ఏపీలో ప్రస్తుతం రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలకు బ్రేక్‌ వేయడం రాజకీయ రంగు పులుముకుంది. కూటమి పార్టీల కారణంగానే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయని వైసీపీ అడ్వాంటేజ్‌ తీసుకుంది. నిధులే లేనప్పుడు పెన్షన్ ఎలా ఇస్తారని విపక్షాలు రివర్స్ ఎటాక్ చేస్తున్నాయి.

పెన్షన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఒకప్పుడు వాలంటీర్ల వ్యవస్థను విచ్చిన్నం చేయాలనుకున్న పార్టీలు ఇప్పుడు ప్రశంసిస్తూ మాట్లాడటం సిగ్గుచేటంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు వలంటీర్లు రాజీనామాలు కొనసాగుతున్నాయి. వాలంటీర్లను ఈసీ తప్పించడం వల్లే పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతుందని.. టీడీపీ, జనసేనతోనే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వాలంటీర్లను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం వల్లే ఈసీ వేటు వేసిందని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి.

వాలంటీర్ల పెన్షన్‌ పంపిణీపై ఈసీ ఆంక్షలతో లబ్ధిదారులే స్వయంగా గ్రామ సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. టీడీపీ రాజకీయంతో లక్షలాదిమంది పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో తమ ప్రమేయమేమీ లేదని టీడీపీ నేతలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. పెన్షన్ల పంపిణీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నా… ఈ వ్యవహారం విపక్షపార్టీలకు మైనస్‌ అయ్యేలా ఉంది. ఐదేళ్లలో ఇంటింటికీ చేరువైన వాలంటీర్లతో రాజకీయంగా తమకు ఇబ్బందనుకున్నాయి విపక్షాలు. అందుకే నోటిఫికేషన్‌ రాగానే ఆ వ్యవస్థపై ఫిర్యాదులు చేశాయి. ఇప్పుడు పెన్షన్ల వ్యవహారంతో బూమరాంగ్‌ కావటంతో డ్యామేజ్‌ కంట్రోల్‌కోసం నాలుక మడతేస్తున్నారు విపక్షపార్టీల నేతలు.

వాలంటీర్ల వ్యవస్థని రద్దుచేస్తామంటారు ఒకరు. అబ్బే.. మేం వచ్చినా వ్యవస్థని కొనసాగిస్తామంటారు మరొకరు. ఆ వ్యవస్థమీద కూటమి నేతలకే ఓ క్లారిటీ లేదు. గడపగడపకీ వెళ్లి ప్రతీ ఇంటి కుటుంబసభ్యుడిలా కలిసిపోయిన వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారన్న ఆందోళన ఓ వైపు. అనవసరంగా వారిని దూరం చేసుకుంటే అసలుకే మోసమొస్తుందన్న ఆందోళన మరోవైపు. వాలంటీర్లలో కొందరు వైసీపీ కండువాల్లేని కార్యకర్తల్లా వ్యవహరిస్తుండొచ్చేమో. కానీ ఆ వ్యవస్థపెట్టాక పారదర్శకత పెరిగింది. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం తప్పింది. ఓ రాజకీయపార్టీగా టీడీపీ ఆ విషయాన్ని విస్మరించకూడదు. ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది.

పెన్షన్లు ఆగిపోవడానికి మేం కారణం కాదని టీడీపీ బుకాయిస్తోంది. కానీ వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగమవుతోందని పదేపదే ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లిన మాట వాస్తవంకాదా.. ఇప్పుడు వైసీపీ విమర్శలతో పెన్షనర్లనుంచి వ్యతిరేకత వస్తుందని టీడీపీ కలవరపడుతోంది. అబ్బే మాకేం తెలీదు మీ మీదొట్టు అంటోంది. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల అంశం రచ్చ రంబోలాగా మారుతోంది. పెన్షన్ల విషయంలో వాలంటీర్లను నియంత్రిస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా అగ్గిరాజేశాయి. పేదలపై కూటమి కుట్ర అంటూ పాలకపక్షం అంటుంటే, ప్రతీదీ రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది.

ఈసీ ఆదేశాలతో మాకేం సంబంధమని టీడీపీ అంటున్నా ఆరోపణలు ఆగడంలేదు. వాలంటీర్లను రాజకీయ అవసరాలకు వాడుకోవద్దని మాత్రమే ఈసీ చెప్పిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు టీడీపీ నేతలు. కావాలనే పెన్షన్ల పంపిణీ ఆపి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని ఉడుక్కుంటున్నారు.

 

Share this post

submit to reddit
scroll to top