ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు, ఘట్టాలకు వేదికైన భారత పార్లమెంటు భవనం ఇప్పుడో చరిత్ర. దశాబ్దాలపాటు సేవలందించిన పార్లమెంట్ పాత భవనం శకం ముగిసింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సంచలన ప్రకటనలతో మొదలయ్యాయి. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ప్రకటనతో కొత్త పార్లమెంట్ తొలిరోజే సంచలనానికి కేంద్రబిందువైంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కొత్త పార్లమెంట్ భవనం కొలువు దీరింది.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పార్లమెంట్ భవనాన్ని కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ ఏడాది మేలో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 384 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చునేలా కొత్త పార్లమెంట్ భవనాన్ని తీర్చిదిద్దారు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలు కూర్చోవచ్చు. ఎంపీలకోసం పెద్ద హాలు, లైబ్రరీ, విశాలమైన గదులు, డైనింగ్ రూమ్‌లు, పార్కింగ్ స్థలాలు కొత్త పార్లమెంట్ భవన ప్రత్యేకత. పేపర్‌లెస్ కార్యకలాపాలు కొనసాగేలా ఎంపీలకు ట్యాబ్‌లిచ్చారు.
కొత్త పార్లమెంట్‌కు తరలివెళ్లే ముందు ఉభయ సభల సభ్యులతో పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వారసత్వంపై ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు ప్రధాని. ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది ఆ సెంట్రల్ హాల్‌లోనే. 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు అక్కడే ప్రసంగించారు. పాత పార్లమెంట్ భవనంలోనే 4 వేలకుపైగా చట్టాలు ఆమోదం పొందాయి. తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్ తలాక్ చట్టాలు ఆ భవనంలోనే ఆమోదం పొందాయి. ఆర్టికల్ 370 నుంచి జమ్ముకశ్మీర్‌కి విముక్తి కూడా పార్లమెంట్ ద్వారానే జరిగిందని ప్రధాని మోడీ తన అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు.