ఇసుక తినేశారు.. చంద్రబాబుపై మరో కేసు!

chandrabbau-with-pithala-sujatha.jpg

అనారోగ్య కారణాలతో నాలుగువారాల బెయిల్‌మీద బయటికొచ్చిన టీడీపీ అధినేతను కేసులు వెంటాడుతున్నాయి. జైలు నుంచి బయటికిరాగానే విజయయాత్రలా సాగిన ర్యాలీ, ఆయన ప్రసంగాలపై ఇప్పటికే సీఐడీ ఫిర్యాదుచేసింది. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్న తెలంగాణలోనూ టీడీపీ శ్రేణుల హంగామాపై మరో కేసు నమోదైంది. సరే.. ఇలాంటివన్నీ మామూలే అనుకుని లైట్‌ తీసుకున్నా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక దందాపై కొత్త కేసు నమోదైంది. ఆయన జైలునుంచి బయటికొచ్చిన ఒక్కరోజు గ్యాప్‌లోనే ఇసుక అక్రమతవ్వకాలపై సీఐడీ మరో కేసు నమోదుచేసింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలతో ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో చంద్రబాబుతో పాటు మరికొందరిపై ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత ఉంటే చంద్రబాబుని ఏ2గా చేర్చారు. చంద్రబాబు హయాంలో పీతల సుజాత గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇసుక కేసులో ఏ3గా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏ4గా మాజీమంత్రి దేవినేని ఉమ పేర్లను చేర్చారు. ఉచిత ఇసుక ముసుగులో రూ.10వేల కోట్ల దోపిడీతో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారన్నది సీఐడీ మోపిన అభియోగం.

టీడీపీ వెర్షన్‌ ఊహించిందే. బయటికొచ్చిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పలకటంతో ఓర్చుకోలేకే కక్షసాధింపుతో ఆయనపై మరో కేసు పెట్టిందన్నది విపక్షపార్టీ వాదన. అయితే నిప్పులేందే పొగరాదు. అభియోగాలకు తగ్గ ఆధారాలు చూపకపోతే ఏ కేసయినా వీగిపోతుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో నిధుల దుర్వినియోగానికి పక్కా ఆధారాలు ఉండబట్టే 52రోజులదాకా చంద్రబాబుకి బెయిల్‌ దొరకలేదు. చివరికి అనారోగ్య కారణాలతోనే ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. శాండ్‌ స్కామ్‌లోనూ బలమైన ఆధారాలున్నాయంటోంది సీఐడీ. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఇసుకని తోడేయటంతో అప్పట్లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ పాయింట్‌ కూడా సీఐడీ కేసుకి బలమైన ఆధారం కాబోతోంది.

చంద్రబాబు హయాంలో ఇసుక రీచ్‌లను గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకను్నా కొన్నిచోట్ల ప్రమాణాలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా తవ్వేశారు. పొక్లెయినర్లు, డ్రెడ్జర్లతో నీటివనరులను తవ్వుకుంటూ పోయారు. ఎన్జీటీ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీకి దిగువన ఇసుకను తవ్వడంపై అప్పట్లో నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. అప్పట్లో ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న దేవినేని ఉమా ఈ అక్రమాలను నియంత్రించలేకపోయారని, ఇసుక అక్రమ తవ్వకాల్లో భాగంగానే మహిళా తహశీల్దార్‌పై చింతమనేని దాడికి తెగబడ్డారని వారిద్దరిని కూడా ఈకేసులో నిందితులుగా చేర్చారు.

చంద్రబాబు జైలునుంచి బెయిల్‌పై విడుదల కావడానికి ముందే గత ప్రభుత్వంలో లిక్కర్‌ పాలసీలో అక్రమాలపై సీఐడీ మరో కేసు పెట్టింది. టీడీపీ హయాంలో మద్యం బ్రాండ్లకు అక్రమంగా అనుమతి ఇచ్చారంటూ కేసు నమోదైంది. కొన్ని మద్యం కంపెనీలు, సరఫరాదారులకు అనుచిత లబ్ధి చేకూర్చారని బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అప్పటి ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీనివాస శ్రీనరేష్‌, ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై సీఐడీ కేసు నమోదు చేసింది. తవ్వేకొద్దీ ఇంకెన్ని బయటికొస్తాయోనని టీడీపీ టెన్షన్‌పడుతుంటే.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వదలబొమ్మాళీ వదలా అంటూ వెంటపడుతోంది వైసీపీ ప్రభుత్వం.

Share this post

submit to reddit
scroll to top