ప్రశ్నల వెనుక ప్రలోభాలు!

mahuba-moitra-tmc-mp.jpg

తనెంత బాగా మాట్లాడుతుంది. ఎంత బలంగా నిలదీస్తుంది. విషయం ఏదయినా ఎంత లోతుల్లోకి వెళ్తుంది. తను నిలబడితే సభలో మిస్సైల్స్‌లాంటి మాటలొస్తాయి. అధికారపార్టీని ఇరకాటంలో పడేస్తాయి. అంత గొప్పగా ఆమె ప్రసంగాల వెనుక ఆక్రోశం ఉండేది. ఆవేశం తాండవించేది. కానీ ఇప్పుడా ప్రశ్నలన్నీ బోనెక్కుతున్నాయి. ఆమె నైతికతను ప్రశ్నిస్తున్నాయి. ఇన్నాళ్లు డైనమిక్‌ మహిళా ఎంపీగా పేరు తెచ్చుకున్న మహువా మోయిత్రా ఇప్పుడు నిందారోపణలకు సమాధానం వెతుక్కునే పరిస్థితిలో పడటం ఎంత దౌర్భాగ్యం?!

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా లోక్‌సభలో తనవైన ప్రశ్నలడిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడంలో ముందుంటుంది. అద్భుత వాగ్దాటి ఉన్న నాయకురాలిగా ఆమెకు పేరుంది. అందుకే ఆమె ప్రతీ ప్రసంగం వైరల్‌ అవుతుంది. అలాంటి ఎంపీ ప్రశ్నకు డబ్బు కేసులో అడ్డంగా దొరికిపోయారు. ప్రధాని మోడీతో పాటు అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా ప్రశ్నలు లేవనెత్తినందుకు భారీగా ప్రయోజనం పొందారని ఎంపీ మహువాపై అభియోగాలొచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కూడా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు. ఎంపీ ఖరీదైన బహుమతులు డిమాండ్ చేశారని ఆరోపించారు.

విదేశాల్లో చదువుకున్న మహువా మోయిత్రా ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్ చేజ్‌లో పనిచేశారు. ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో స్వదేశానికి తిరిగొచ్చాక కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మరుసటి సంవత్సరమే కాంగ్రెస్‌ని వీడి టీఎంసీ పార్టీలో చేరారు. 2016లో ఎమ్మెల్యేగా గెలిచిన మహువా 2019లో కృష్ణానగర్ ఎంపీగా గెలిచారు. మొదటిసారే పార్లమెంట్‌లో అడుగుపెట్టినా తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు. భర్తతో విభేదాలతో ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న మహువా పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు, ఇతర ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలతో ఆత్మరక్షణలో పడ్డారు. అయితే ఆ ఆరోపణలు అవాస్తవమని మహువా కొట్టిపారేస్తున్నారు. హిరానందానీతో తెల్లకాగితంపై సంతకం చేయించుకుని తనపై కుట్ర పన్నారని ఆరోపించారు.

అయితే తమను ఇరుకునపెట్టే మహువాపై అభియోగాలతో నిజాల నిగ్గుతేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ వివాదంలో తెరపైకొచ్చిన సుప్రీంకోర్టు అడ్వకేట్‌ జై అనంత్ దేహాద్రి మహువాకి క్లోజ్‌ఫ్రెండ్‌. ఆరోపణలకు ఆధారాలు చూపిస్తున్న హీరానందాని గ్రూప్‌కి ఆయనే సీఈవో. సుప్రీంకోర్టుకు సాక్షాత్తూ జై అనంత్‌ అఫిడవిట్‌ ఇవ్వటంతో ఆయన దగ్గర ఆధారాలున్నట్లే లెక్క. ఎంపీగా ఉంటూ మహువా మోయిత్రా పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ని, కొన్ని పాలసీ విషయాల్ని హీరా నందానికి ఇచ్చి డబ్బు తీసుకుందన్నది ప్రధాన ఆరోపణ. లగ్జరీ జీవితంకోసం తన ఎంపీ పదవిని అడ్డంపెట్టుకుందని, డబ్బుతో పాటు వజ్రాలు, ఫ్రెంచ్‌ వైన్‌ బాటిల్స్‌. లగ్జరీ కాస్మటిక్స్‌. ఖరీదైన బ్యాగ్స్‌లాంటివి హీరానందాని నుంచి తీసుకుందని తన అఫిడవిట్‌లో జై అనంత్‌ పొందుపరిచాడు.

మహువా ఎంపీగా పార్లమెంట్‌లో ఇప్పటిదాకా 61 ప్రశ్నలు అడిగితే వాటిలో 50 ప్రశ్నలు నేరుగా సభలోనే అడిగింది. మిగిలినవి మాత్రం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అడిగింది. అయితే ఆ ప్రశ్నలను మహువా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో హీరానందాని అడిగాడన్నది ఆమెపై వచ్చిన సంచలన ఆరోపణ. 2018నుంచి ఈ క్విడ్ ప్రోకో జరుగుతోందని బయటపెట్టిన జై అనంత్‌.. ఎంపీ మహువాకి హీరానందని ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బిచ్చాడో కూడా పూసగుచ్చినట్లు చెబుతున్నాడు. మహువా మీద వచ్చిన ఆరోపణలపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి తీర్పు ఇవ్వబోతోంది. తార్కికంగా వాదించే మహువా మాటల వెనుక ఇంత మర్మం ఉందని తెలిసి సమాజం విస్తుపోతోంది.

Share this post

submit to reddit
scroll to top