I.N.D.I.A- మమతా ఔట్‌.. ఆప్‌ అదే రూట్!

rahul-mamatha-kejrival.jpg

పాయె..అయిపాయె. పేరుమార్చిన బీజేపీయేతర కూటమిది ఆరంభశూరత్వమేనని తేలిపోతోంది. ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రాహుల్‌ జోడో యాత్ర బెంగాల్‌లోకి ప్రవేశిస్తున్న సమయంలోనే కూటమిలో కుమ్ములాటలు ముదిరాయి. కాంగ్రెస్‌, టీఎంసీ , లెఫ్ట్‌ నేతల మధ్య మాటలతూటాలు పేలాయి. మర్యాదకైనా తనకు రాహుల్‌ పాదయాత్ర గురించి చెప్పలేదంటోంది మమతాబెనర్జీ. బెంగాల్‌లో ఒంటరిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించేశారు దీదీ.

లెఫ్ట్‌ పార్టీల పేరెత్తితే దీదీకి చిర్రెత్తిపోతోంది. బెంగాల్‌ను 34 ఏళ్ల పాటు పాలించిన సీపీఎంతో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు మమతాబెనర్జీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో లెఫ్ట్‌ పార్టీలతో పొత్తుఉండదని స్పష్టం చేశారు. ఇండియా కూటమిని లెఫ్ట్‌ పార్టీలు డామినేట్‌ చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ని కూడా లెఫ్ట్‌ నేతలు ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌కు 2 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేదిలేదని మమతా ముందే చెప్పేశారు. బెంగాల్‌లో తమకు మమత దయాదాక్షిణ్యాలు అవసరం లేదంటూ కాంగ్రెస్‌ నేత అధిర్‌రంజన్‌ చౌదరి దీదీకి గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

సీపీఎంతో ఉన్న వైరం, కాంగ్రెస్‌ తీరుపై ఆగ్రహంతో మీ దారి మీదే మా దారి మాదేనని టీఎంసీ అధినేత్రి చెప్పేశారు. అధిర్‌రంజన్‌చౌదరి లాంటి నేతలు కొంపముంచేలా ఉండటంతో దీదీని కూల్‌ చేసే ప్రయత్నాల్లో రాహుల్‌గాంధీ ఉన్నారు. తనతో దీదీ డైరెక్ట్‌గా టచ్‌లో ఉన్నారంటున్న రాహుల్‌.. బెంగాల్‌లో యాత్ర సాగే టైంలో ఆమెతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అయితే మమతాబెనర్జీ మెత్తబడే రకం కాదు. ఒకవేళ తప్పదనుకున్నా సీపీఎంతో పొత్తుకు మాత్రం ఒప్పుకోరు. కాంగ్రెస్‌కి రెండోమూడో సీట్లు ఇస్తామంటారు. మమతతో దోస్తీకోసం ఒక మెట్టు కాదు బెంగాల్‌లో చాలా మెట్లు దిగాల్సి ఉంటుంది

కాంగ్రెస్‌. బెంగాల్‌లో దీదీ బాంబుపేల్చారో లేదో.. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ కూడా అదే పాట పాడింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని, పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లలో ఒంటరిగానే పోటీచేస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇదే స్ఫూర్తితో ఇంకెన్ని పార్టీలు I.N.D.I.A కూటమికి టాటాబైబై చెప్పేస్తారో తెలీదు. అయోధ్య సెంటిమెంట్‌కి తోడు విపక్షాల అనైక్యతే బీజేపీ-ఎన్డీఏకి మరోసారి బూస్టప్‌ ఇవ్వబోతోంది.

 

Share this post

submit to reddit
scroll to top