డిసెంబరు 9 విజయోత్సవం.. ఏమిటా ధీమా?

Revanth-Reddy.jpg

ఆలూలేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.. అని వెనకటికో సామెతుంది. ఏ మనిషికైనా కాన్ఫిడెన్స్‌ ఉండాలి. కానీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అయితే తట్టుకోవడం కష్టమే. బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు బుడ్డర్‌ఖాన్‌ అని ముద్దుగా పిలుచుకునే తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ మాటల్లో అతిశయం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనంటూ ఓ మౌత్‌ టాక్‌నైతే ఆ పార్టీ క్రియేట్‌ చేయగలిగింది. ఆర్నెల్లలోనే తెలంగాణలో సీన్‌ మారిపోయింది. అంతకుముందు ఫుల్‌ జోష్‌లో ఉన్న బీజేపీ వెనుకబడితే (మౌత్‌టాక్‌లోనే సుమా..) కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ స్పీడ్‌ పెరిగిందన్న చర్చ బలంగా ఉంది. దానికితగ్గట్లే ఎప్పుడూ కీచులాటలతో కాలంగడిపే కాంగ్రెస్‌లో నలుగురు నేతలూ కలిసి కనిపిస్తున్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఎలా ఉంటారోగానీ ఇప్పుడైతే కాస్త సమన్వయంతోనే ముందుకెళ్తున్నారు.

ఎన్నో దశాబ్దాల తెలంగాణ కల నెరవేర్చినప్పుడే అధికారపీఠాన్ని అందుకోలేకపోయింది కాంగ్రెస్‌పార్టీ. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీకి ఛాన్స్‌ ఉందా అంటే.. ఏమో గుర్రం ఎగురావచ్చు. రెండుపర్యాయాలు అధికారంలోకొచ్చిన కేసీఆర్‌ పార్టీపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. కేసీఆర్‌ నాయకత్వం మీద నమ్మకం ఉన్నా చాలాచోట్ల ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయి అసంతృప్తి అయితే ఉంది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా కేసీఆర్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌తో హ్యాట్రిక్‌ ఖాయమని బీఆర్‌ఎస్‌ పార్టీలో ధీమా ఉంది. బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తామన్న అత్యాశ లేకపోయినా.. ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితుల్లో పవర్‌గేమ్‌ నడపగలనన్న నమ్మకంతో ఉంది. కాంగ్రెస్‌ మాత్రం సెంట్‌పర్సెంట్‌ అధికారంలోకి వస్తానంటోంది. వచ్చాక మీ సంగతి చూస్తానని అప్పుడే అధికారులకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వార్నింగ్‌లు కూడా ఇచ్చేస్తున్నారంటే కొంపదీసి గెలుస్తారా అన్న డౌట్‌ అందరికీ వస్తోంది.

డిపాజిట్లు రాని పార్టీ కూడా గెలుపు తనదేనంటోంది. రాజకీయాల్లో ఇది సహజం. పడ్డా మనదే పైచేయి అనగలిగితేనే రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్‌కి కాస్త వేవ్‌ కనిపించేసరికి రేవంత్‌రెడ్డి ఉత్సాహం కాస్త శృతిమించుతోంది. ఇప్పటికే అధికారులకు హెచ్చరికలతో మైండ్‌గేమ్‌ ఆడుతున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ప్రమాణస్వీకార వేదిక ఏదో కూడా చెప్పేస్తున్నారు. డిసెంబరు9న హైదరాబాద్‌ లాల్‌బహదూర్‌ స్టేడియంలో కాంగ్రెస్‌ విజయోత్సవ సభ ఉంటుందట. ఇంకా నయం స్టేడియాన్ని బుక్‌ చేసుకుని అడ్వాన్స్‌ గట్రా ఇంకా ఇచ్చినట్లు లేదు. అంటే ఏంటి.. కాంగ్రెస్ గెలవాదా? గెలిచాక ప్రమాణస్వీకారం చేయదా అని ఎవరైనా ఆవేశపడొచ్చు. ఆ అవకాశమే లేదని ఎవరూ అనలేరు. ఎందుకంటే జనం ఎవరినైనా అందలమెక్కిస్తారు. ఎవరినైనా కుర్చీలోంచి లాగేస్తారు. కానీ వాళ్లు తీర్పు చెప్పేదాకయినా ఓపికలేకపోతే ఎలా. అది సరేగానీ.. విజయోత్సవ సభ దగ్గరే ఆగుతారా? మంత్రివర్గాన్ని కూడా ముందే ప్రకటించేస్తారా? అన్నట్లు తెలంగాణ ఏర్పడ్డాక టీపీసీసీ ప్రెసిడెంట్‌ అయిన పొన్నాల లక్ష్మయ్య ఈ టైంలో పార్టీకి రాజీనామా చేయడం పిల్లి ఎదురొచ్చినట్లు లేదూ.. ముందా సంగతి చూసుకోండి!

Share this post

submit to reddit
scroll to top