వరల్డ్‌కప్‌లో పసికూన సంచలనం

afghnistha-sensational-victory-on-pakisthan.jpg

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్‌ దిగిందా లేదా అని ఓ సిన్మా డైలాగ్ ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆప్ఘనిస్తాన్‌ అదే చేస్తోంది. ప్రపంచకప్‌లో ఈ పసికూన సంచలనాలు నమోదుచేసి తానేమీ తక్కువకాదని చాటుకుంటోంది. పాకిస్తాన్‌పై ఆప్ఘనిస్తాన్‌ జట్టు సంచలన విజయం సాధించింది. తనను తక్కువ అంచనావేయొద్దని హాట్‌ ఫేవరేట్‌ జట్లకు ఛాలెంజ్‌ చేసింది.

భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్-2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ని ఓడించిన ఆప్ఘనిస్తాన్‌ జట్టు ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్‌ని 8 వికెట్ల తేడాతో చిత్తచిత్తుగా ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు. చెన్నై చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 282 పరుగులతో ఆప్ఘనిస్తాన్‌ ముందు భారీ టార్గెట్‌ పెట్టింది.

ఆప్ఘనిస్తాన్‌ జట్టు 200 పరుగులు చేస్తేనే గొప్పనుకున్నారు. కానీ అందరి అంచనాలను ఆ పసికూన తలకిందులుచేసింది. ఆప్ఘనిస్తాన్‌ ఓపెనర్‌ గురుబాజ్ 53 బాల్స్‌లో 65 రన్స్‌చేశాడు. మరో ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులు చేయడంతో ఆప్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌కి గట్టి పునాది పడింది. వారిద్దరూ ఔటయ్యాక రహమత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది అద్భుతంగా ఆడి జట్టుని విజయతీరాలకు చేర్చారు. రహమత్ 77 పరుగులు, హష్మతుల్లా 48 పరుగులతో జట్టుకు చరిత్రాత్మక గెలుపుని అందించారు.

ఈ సంచలన విజయంతో పాయింట్ల పట్టికలో ఆప్ఘనిస్తాన్ ఆరో స్థానానికి చేరింది. అటు పసికూన చేతిలో చిత్తయిన పాకిస్థాన్ ఐదో స్థానానికి పడిపోయింది. పోయినేడాది ఇదే రోజు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై ఓటమి పాలైన పాకిస్థాన్‌ ఈ ఏడాది ఆప్ఘనిస్తాన్‌ చేతిలో ఓటమితో అక్టోబరు 23 కలకాలం పీడకలలా గుర్తుండిపోతుంది.

Share this post

submit to reddit
scroll to top