క‌వ్వించే ఆ శ‌రీరాన్ని క్యాన్సర్ కాటేసింది!

poonam2.jpg

సంచ‌ల‌న న‌టి, మోడ‌ల్ పూనమ్‌ పాండే కన్నుమూసింది. 32ఏళ్ల వ‌య‌సుకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. పోర్న్‌స్టార్ కాక‌పోయినా ఆ త‌ర‌హా జోన‌ర్‌ని ఆస్వాదించే వారికి త‌నో డ్రీమ్‌గాళ్‌. తెగించింద‌ని కొంద‌రు అనుకోవ‌చ్చేమోగానీ దేవుడిచ్చిన దేహాన్ని త‌న‌లా అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. చావులాంటి విషాదంలో అవ‌న్నీ అప్ర‌స్తుత‌మేఅయినా ప్ర‌పంచానికి త‌న ప‌రిచ‌య‌మే ఆ తెగింపు. చ‌లాకీగా ఉండే పూనం పాండే చ‌నిపోవ‌డ‌మేంట‌ని అంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఆమెను ద్వేషించిన‌వారు, విమ‌ర్శించిన‌వారుకూడా అయ్యోపాపం అంటున్నారు.

సర్వైకల్ కేన్సర్‌ ఆమెను మింగేసింది. కొంతకాలంగా సర్వైకల్‌ కేన్సర్‌తో పోరాడుతున్న పూనమ్‌ పాండే, కొన్నాళ్లుగా ఎక్క‌డా త‌న మెరుపులులేవు. ఎందుకంటే త‌ను చావుబ‌తుకుల పోరాటంలో ఉంద‌న్న విష‌యం కొంద‌రికే తెలుసు. నా జీవితం నా ఇష్టం అంటూ ధిక్కారంగా బ‌తికిన ఆమె మృత్యువుతో పోరాటంలో నిస్స‌హాయంగా ఓట‌మిని అంగీక‌రించింది. చావుబతుకుల పోరాటంలో పూనం తుదిశ్వాస విడిచింది. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట రోజు కూడా ఎంతో యాక్టివ్‌గా కనిపించిన ఆమెను మ‌హ‌మ్మారి కేన్సర్‌ కబళించింది.

1991లో కాన్పూర్‌లో జన్మించిన పూనమ్ నషా సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. 2018లో నటించిన ‘ది జర్నీ ఆఫ్‌ కర్మ’ ఆమెకు చివరి సినిమా. 2022లో లాక్‌అప్‌ షోలో పూనమ్‌ కంటెస్టంట్‌గా కనిపించారు. 2011లో ఇండియా వరల్డ్ కప్‌ గెలిస్తే నగ్నంగా డాన్స్‌ చేస్తానంటూ బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చి సంచలనం సృష్టించింది ఈ పూన‌మే. సినిమా అయినా, సోషల్‌ మీడియా అయినా త‌న కెరీర్ ఓ సంచ‌ల‌నం. యాదృచ్ఛిక‌మో ఏమో గానీ.. పూనమ్‌ పాండే చనిపోవడానికి ఒక్క రోజు ముందే, గర్భాశయ కేన్సర్‌ను నివారించడానికి యువతులకు ఇచ్చే టీకాల సంఖ్యను పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు.

సంప్ర‌దాయాల మాటున త‌మ ల‌క్ష్యాల‌ను చంపుకోవాల్సి నేటిత‌రం యువ‌తులెంద‌రికో క‌చ్చితంగా పూనం పాండే ఓ రోల్ మోడ‌ల్‌. నీలిచిత్రాల న‌టి స‌న్నీడియోల్ బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయిన‌ప్పుడు త‌న అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న పెద్ద విష‌య‌మే కాదు. ర‌క్తమాంసాల దేహాన్ని కుళ్లేదాకా త‌ను దాచుకోద‌ల్చుకోలేదు. అందులో త‌ప్పుప‌ట్టడానికేం లేదు. మూడు ప‌దుల వ‌య‌సులోపే స్టార్ స్టేట‌స్‌తో త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డ ఓ సంచ‌ల‌న కెర‌టం విధి ముందు ఇలా అర్ధంత‌రంగా త‌ల‌వంచాల్సి రావ‌డ‌మే విషాదం. త‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకోవ‌డ‌మే మ‌నం ఇప్పుడు చేయ‌గ‌లిగేది!

అంద‌రూ ఇలాగే బాధ‌ప‌డ్డారా.. పాపం ఎవ‌రి రెక్క‌ల క‌ష్టంమీద ఆధార‌ప‌డ‌కుండా ఈ పిల్ల అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌తో బ‌తికేసేది అని సంతాపం కూడా తెలియ‌జేశారా.. ఒక‌ప్పుడు బ‌తికేద‌ని బాధ‌ప‌డాల్సిన ప‌న్లేకుండా త‌ను బ‌తికే ఉంద‌ట‌! అవును.. జనాన్ని ఫూల్స్‌ని చేసింది పూనంపాండే. కానీ త‌న‌లా అనుకోవ‌డంలేదు. త‌న భాష‌లో చెప్పాలంటే క‌ల్పిత‌చావుతో త‌ను జ‌నాన్నిచైత‌న్య‌వంతుల‌ను చేసింది. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌మీద మ‌హిళాలోకానికి గొప్ప చావు సందేశాన్నిచ్చింది. మా త‌ల్లే..

 

 

Share this post

submit to reddit
scroll to top