వన్‌మ్యాన్‌ షోకి ఇక నో ఛాన్స్‌!

cabinet.jpg

వన్‌ మ్యాన్‌ షో ఉండదు. రేవంత్‌రెడ్డిని సీఎల్పీగా ప్రకటిస్తున్నప్పుడే కుండబద్దలు కొట్టింది కాంగ్రెస్‌ అధిష్ఠానం. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో నాలుగోవంతుమంది సీఎం అభ్యర్థులే. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సీఎం పదవి కోసం చివరిదాకా గట్టిగానే ఫైట్‌ చేశారు. వీరితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తమకు కూడా సీఎం అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే తమను పక్కనపెడతారన్న భయం కొందరు సీనియర్లలో ఉంది. కానీ కేబినెట్‌ కూర్పుని చూస్తే సీనియర్లకు సమన్యాయం జరిగినట్లే కనిపిస్తోంది. అంటే వన్‌ మ్యాన్‌ షో ఉండదు అన్న హైకమాండ్‌ స్టేట్‌మెంట్‌ అమల్లోకి వచ్చినట్లే.

సీఎం రేవంత్‌ రెడ్డి ముందు సవాళ్లెన్నో ఉన్నాయి. ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై భారీ ఆశలు, అంచనాలు ఉన్నాయి. గతం కంటే భిన్నంగా ఏం చేస్తారనే ఆసక్తి అందరిలో ఉంది. అధికారంలోకి వస్తే మార్పు చూపిస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ మార్పు ఏంటి, ఎలా ఉండబోతోందనే దానిపై ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయి. ప్రజల అంచనాలకు తగ్గట్లు పనిచేయాలంటే గట్టి టీమ్‌ ఉండాలి. అందుకే అనుభవజ్ఞులను కేబినెట్‌లోకి తీసుకున్నారు. సీనియర్లను, గతంలో మంత్రులుగా అనుభవం ఉన్న వారు రేవంత్‌రెడ్డితో పాటే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

డిప్యూటీ సీఎం పదవితో పాటు మల్లు భట్టి విక్రమార్కకు కీలకమైన రెవెన్యూ శాఖ ఇచ్చారు. హోంశాఖ ఇచ్చి పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పెద్దపీట వేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పురపాలక శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు ఆర్‌అండ్‌బీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇరిగేషన్, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ ఇచ్చారు. సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాల శాఖ, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ, కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, దామోదర రాజనర్సింహకు ఆరోగ్య శాఖను కేటాయించారు.

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కకు మాత్రమే పాలనా అనుభవం లేదు. మిగిలిన వారికి మంత్రులుగా, పాలనా వ్యవహారాల్లో అనుభవం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఇప్పటిదాకా మంత్రి పదవి చేపట్టకపోయినా.. పాలనా వ్యవహారాలపై ఆయనకు అవగాహన ఉంది. వైఎస్ హయాంలో విక్రమార్క కేబినెట్‌ ర్యాంక్‌తో చీఫ్‌ విప్‌గా వ్యవహరించారు. అప్పటి ప్రతిపక్షం టీడీపీని గట్టిగా ఎదుర్కొన్నారు. వైఎస్ మరణాననంతరం రోశయ్య హయాంలో కూడా కీలకంగా వ్యవహరించారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎం అయ్యాక విక్రమార్క డిప్యూటీ స్పీకర్ అయ్యారు. బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ తరపున ప్రతిపక్ష నాయకుడిగా, సీఎల్పీ నేతగా గట్టిగానే కొట్లాడారు. అంత అనుభవజ్ఞుడైన భట్టి డిప్యూటీ సీఎంగా ఉండటం పాలనలో రేవంత్‌రెడ్డికి సహాయకారిగా ఉండబోతోంది.

రేవంత్‌రెడ్డికి అతిపెద్ద బలం కాబోతున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌ మంత్రివర్గాల్లో వివిధశాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. మూడు పార్టీల నుంచి గెలిచి, మూడు ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు సీనియర్ నేత తుమ్మల. అందుకే ఖమ్మం జిల్లా నుంచి భట్టి, పొంగులేటితో పాటు తుమ్మల నాగేశ్వరరావును తీసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. కొల్లాపూర్ నుంచి వరుసగా 5 సార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యేగా జూపల్లి కృష్ణారావుకు రికార్డ్ ఉంది. కాంగ్రెస్‌లో వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. మంత్రిగా పాలనా అనుభవం ఉన్న సీనియర్ లీడర్లలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఒకరు. దామోదర రాజనర్సింహకు కూడా మంత్రిగా అనుభవం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. లనానుభవం లేనిది ఒక్క సీతక్కకే. కాకపోతే, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జననేతగా ఆమెకు పేరుంది. వివిధ శాఖలపై అవగాహన ఉంది.

ప్రాతినిధ్యం, సామాజికవర్గాల పరంగా అందరికీ న్యాయం జరిగేలా చూశారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క, బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ మంత్రులయ్యారు. ఈ ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దళిత సామాజికవర్గానికి చెందిన భట్టి విక్రమార్క, కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావును తీసుకున్నారు. నల్లగొండ జిల్లా నుంచి సీనియర్‌ లీడర్లైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చారు. వెలమ సామాజికవర్గం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఉమ్మడి మెదక్ నుంచి దళితనే దామోదర రాజనర్సింహ, ఉమ్మడి కరీంనగర్ నుంచి బ్రాహ్మణవర్గానికి చెందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ నేత పొన్నం ప్రభాకర్‌ను మంత్రులుగా తీసుకున్నారు. మొత్తంమీద రేవంత్‌రెడ్డి కేబినెట్‌ బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తోంది.

Share this post

submit to reddit
scroll to top