ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ys-Sharmila-Vijayamma.jpg

జగనన్న బాణం తెలంగాణలో రాజకీయపార్టీల్ని గుచ్చుకుంటోంది. మొన్నటిదాకా వైఎస్‌ షర్మిలను సీరియస్‌గా తీసుకోని నేతలు కూడా ఇప్పుడామె నిర్ణయంతో ఉలిక్కిపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక ఎవరి కొంప ముంచుతుందోనని లెక్కలేసుకుంటున్నారు. తెలంగాణ కేంద్రంగా రాజకీయపార్టీ స్థాపించిన షర్మిల ఈమధ్య పునరాలోచనలో పడ్డారు. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. కర్నాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మధ్యవర్తిత్వంలో షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దల్ని కలుసుకున్నారు. ఆమెను ఏపీలో కాంగ్రెస్‌ బాధ్యతలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కోరింది. అయితే అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేంగా రాజకీయం చేసేందుకు వైఎస్‌ షర్మిల ఇష్టపడలేదు. షర్మిలకు కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ హామీ ఇచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే పాలేరునుంచి పోటీచేస్తానని ఎప్పుడో ప్రకటించిన వైఎస్‌ షర్మిల ఆ మాటమీదే నిలబడ్డారు. కాంగ్రెస్‌ ప్రతిపాదనలను నిర్ద్వందంగా తిరస్కరించారు.

కాంగ్రెస్‌తో సయోధ్య కుదరకపోవటంతో పొత్తు ప్రయత్నాలను విరమించుకున్నారు షర్మిల. వైఎస్సార్టీపీ నేతలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదల కావటంతో ఇక ఆలస్యం చేయకూడదన్న నిర్ణయానికొచ్చారు. మొదట చెప్పినట్లు పాలేరునుంచి పోటీకి సిద్ధమయ్యారు. పాలేరుతో పాటు మరోసీటునుంచి కూడా పోటీచేస్తానని ప్రకటించారు. అన్నిస్థానాల్లో పోటీచేస్తామన్న వైఎస్‌ షర్మిల టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆశావహుల్ని ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి, షర్మిల తల్లి వైఎస్‌ విజయమ్మ కూడా తెలంగాణనుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాత పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014లో విశాఖ ఎంపీగా పోటీచేసినా విపక్షకూటమి చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. అప్పట్నించీ రాజకీయాలకు దూరంగా ఉన్న విజయమ్మ తెలంగాణలో కూతురికి అండగా నిలబడ్డారు.

తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు తరువాత వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. కూతురు షర్మిలతో కలిసి కొన్ని సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచే అవకాశం లేకపోవటంతో తెలంగాణలో వైఎస్సార్‌టీపీ ఒంటరిపోటీకే సిద్ధమైంది. షర్మిల పాలేరుతో పాటు మిర్యాలగూడపై దృష్టిపెట్టటంతో ఆ రెండు సీట్లనుంచీ తనే పోటీచేస్తారా లేదంట అందులో ఓ సీటునుంచి తల్లిని నిలబెడతారో ఇంకా క్లారిటీ లేదు. తల్లీకూతుళ్లే కాదు షర్మిల భర్త అనిల్‌ కూడా పోసే అవకాశాలున్నాయి. అవసరమైతే అనిల్‌కుమార్‌ కూడా పోటీచేస్తారని షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్‌తో నాలుగు నెలలు చర్చలు జరిపినా పురోగతి లేకపోవటంతో చివరికి ఒంటరిపోరుకే షర్మిల నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పాదయాత్రతో తెలంగాణని చుట్టేసిన షర్మిల ప్రభావంపై పార్టీల్లో చర్చ మొదలైంది. వైఎస్సార్‌ని అభిమానించేవారిలో కొన్ని ఓట్లు షర్మిల వైపు మళ్లితే అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్సే. అలా జరగకూడదనే కాంగ్రెస్‌తో చర్చలకు చొరవచూపానంటున్నారు షర్మిల. రైతు నాగలి గుర్తుకోసం వైఎస్సార్టీపీ దరఖాస్తు చేసుకోవటంతో ఎన్నికలముందు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

Share this post

submit to reddit
scroll to top