కేరళ పేలుళ్ల వెనుక ఉన్నదెవరు?

bomb-blastings.jpg

బాంబుపేలుళ్లతో కేరళ వణికిపోయింది. ఎర్నాకుళం జిల్లా కాలామస్సెరిలోని కన్వెన్షన్ హాల్‌లో ఉదయం క్రిస్టియన్ల ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్న సమయంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో 10మందికి 50శాతానికి పైగానే కాలినగాయాలు కావటంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం కావడంతో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు వందల సంఖ్యలో జనం వచ్చారు. కన్వెన్షన్‌ సెంటర్‌ కిక్కిరిసి ఉన్న సమయంలో ఐదు నిమిషాల వ్యవధిలో మూడు పేలుళ్లు జరిగాయి. టిఫిన్‌బాక్స్‌లో పేలుడు పరికరాలు లభించాయి.

ఎర్నాకుళం వరుస పేలుళ్ల ఘటనపై విచారణ బాధ్యతను ఎన్ఐఏ చేపట్టింది. ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందం కూడా కేరళకు చేరుకుంది. ఇదే సమయంలో బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని ఓ వ్యక్తి నాటకీయంగా లొంగిపోయాడు. తానే బాంబులను కన్వెన్షన్ సెంటర్‌లోకి తీసుకెళ్లినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి బాంబును అమర్చినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ పేలుళ్ల వెనుక అతని హస్తం ఉందో లేదో పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.

పేలుళ్లకు కారణం ఉగ్రచర్యేనన్న అనుమానాలు వస్తున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి వ్యతిరేకంగా కేరళ మలప్పురంలో శనివారం నిరసనలు చేపట్టారు. జమాత్ ఈ ఇస్లామీ హింద్ సంస్థ చేపట్టిన ఈ ర్యాలీలో హమాస్ మాజీ చీఫ్ ఖలీద్ మెషాల్ వర్చువల్‌గా పాల్గొనడం కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. పాలస్తీనా అనుకూల ర్యాలీపై వివాదం నడుస్తుండగానే ఎర్నాకుళం పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది.

Share this post

submit to reddit
scroll to top