ఆ చేదు అనుభవం ఓ పీడకల.. అందుకే!

jagan-strategy.jpg

రాజ్యసభ ఎన్నికల కోసం మాస్టర్ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది వైసీపీ. మూడు రాజ్యసభ స్థానాలలోనూ విజయం సాధించడంతో పాటు టీడీపీకి వేలుపెట్టే అవకాశం కూడా ఇవ్వొద్దన్న ప్లాన్‌తో అధికారపార్టీ ఉంది. ఎన్నికల వేళ పొరపాటున టీడీపీకి ఒక స్థానం వెళ్ళినా ఎన్నికల్లో అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే టీడీపీకి అసలు పోటీ చేసే ఆలోచన కూడా లేకుండా చేయాలన్నదే వైఎస్సార్సీపీ మాస్టర్‌ ప్లాన్.

ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్‌, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 2తో ముగియనుంది. ఈ మూడు రాజ్యసభ సీట్ల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తోంది. దీంతో ఈ మూడు సీట్లనీ చేజిక్కించుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదం తెలపడం ఆ వ్యూహంలో భాగమే. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన నుంచి వైసీపీలోకొచ్చిన రాపాక వరప్రసాద్, వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోనే సమాధానం చెప్పాలని స్పీకర్ కార్యాలయం ఆ ఎమ్మెల్యేలను ఆదేశించింది.

ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. మూడు రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేకపాటి, ఆనం, కోటంరెడ్డి, శ్రీదేవి టీడీపీకి దగ్గరవవ్వటంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 147కు తగ్గింది. అయినా మూడు సీట్లు గెలుచుకోడానికి ఆ ఎమ్మెల్యేలు సరిపోతారు. కానీ అభ్యర్థుల మార్పులు చేర్పులతో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ మళ్లీ అవకాశమివ్వలేదు. మరికొందరికి సీట్లు లేవన్న సంకేతాలున్నాయి. అందుకే ఈ 28మందిలో కొందరు పక్కచూపులు చూస్తే వైసీపీకి ఇబ్బందే. అందుకే మూడు రాజ్యసభ సీట్లు గెలుచుకోవడానికి అవసరమైన 132 మంది తగ్గకుండా వైసీపీ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది.

టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో గంటా రాజీనామాను ఆమోదించారు. పార్టీ వీడిన నలుగురిపై వేటు వేస్తే టీడీపీకి మిగిలే ఎమ్మెల్యేలు 18 మందే. ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తూ టీడీపీ ఒక రాజ్యసభ సీట్ దక్కించుకోవాలనుకున్నా మరో 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ అది అసాధ్యమన్న అంచనాతో వైసీపీ ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది టచ్‌లో ఉన్నారంటున్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి సీనియర్‌. పోటీకి నిలబెట్టమని వైసీపీ ఎమ్మెల్యేలే అడుగుతున్నారంటూ ఆయన బాంబుపేల్చారు. ఆయన చెప్పే మాటే నిజమైతే కనీసం 50మంది టీడీపీకి టచ్‌లో ఉన్నారు. ఇందులో వాస్తవమెంతోగానీ వైసీపీ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీనుంచి మైండ్‌గేమ్‌ అయితే మొదలైనట్లే ఉంది.

Share this post

submit to reddit
scroll to top