తెలంగాణలో జెండా ఎత్తేసిన టీడీపీ!

Gnaneswar-Mudiraj-With-Tdp-Chief-Chnadrababu-File-Pic.jpg

కాసాని జ్ఞానేశ్వర్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఆయనెప్పుడూ ఎక్కడా నిలకడగా లేరుగా అంటారా.. నిజమేకానీ తెలంగాణ టీడీపీకి కొన్నాళ్లుగా ఆయనే పెద్దదిక్కు. నాయకులంతా వేరేపార్టీల్లోకి జారుకున్నాక కష్టకాలంలో నేనున్నానంటూ ఈ ముదిరాజ్‌ నాయకుడే ముందుకొచ్చారు. ఆయనొచ్చాకే టీడీపీకి తెలంగాణలో పోయిన ప్రాణం లేచొచ్చింది. ఈసారి ఎన్నికల్లో కాస్త హడావుడి చేయాలని జ్ఞానేశ్వర్‌ ముచ్చటపడ్డా టీడీపీ పెద్దలు ఆయన ఉత్సాహంమీద నీళ్లు చల్లారు. పోటీకి దూరంగా ఉండాలన్నపార్టీ నిర్ణయంతో కాసాని జ్ఞానేశ్వర్‌ మనస్తాపం చెందారు. మీరొద్దు మీ పార్టీ వద్దని విడాకుల పత్రం ఇచ్చేశారు.

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత తెలంగాణలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీకి సానుభూతి పెల్లుబుకుతోందని టీడీపీ తమ్ముళ్లు చెప్పుకున్నారు. ఐటీ ఉద్యోగుల నిరసనలు, అక్కడక్కడా నిరసన ర్యాలీలతో ఇంకేముందీ టీడీపీ బరిలో నిలిస్తే మినిమం గ్యారంటీ ఉంటుందని లెక్కలేసుకున్నారు. కానీ తీరాచూస్తే తూచ్‌. తెలంగాణ బీజేపీ జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇలాంటి టైంలో విడిగా దిగడం ఎందుకనుకున్నారో, మరో ప్లాన్‌తో ఉన్నారోగానీ ఈసారికి పోటీ చేయొద్దని డిసైడ్‌ అయ్యారు. దాంతో ఈమధ్యే పార్టీలోకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా కాస్త హడావుడి చేస్తున్న జ్ఞానేశ్వర్‌ డీలాపడ్డారు. కడుపుమండి పార్టీకి రాజీనామాచేశారు.

20సార్లు ఫోన్‌చేసినా ఒక్కసారి కూడా నారా లోకేష్‌ లిఫ్ట్‌ చేయలేదట. అధినేత జైల్లో ఉంటే ఇక్కడ నీ పెత్తనమేంటని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అసహనం వ్యక్తంచేశారు. తెలంగాణలో పోటీచేయొద్దన్న మాట ఎవరి నోటినుంచి వచ్చినా నిర్ణయం జైల్లో ఉన్న పెద్దాయనదే.  పోటీకి ఎలాగైనా నచ్చజెబుదామని కాసాని ప్రయత్నించినా పార్టీ ససేమిరా అనేసింది. కాంగ్రెస్‌కి మద్దతివ్వాలని కమ్మ సామాజికవర్గంనుంచి ప్రతిపాదన వచ్చిందన్నది జ్ఞానేశ్వర్‌ నోట వచ్చిన మాట. అనుమానమేముందీ.. అది బహిరంగరహస్యం.

తెలంగాణలో కాంగ్రెస్‌ కాస్త ఊపుమీద ఉందుంది. ఈ వేవ్‌ ఎన్నికలదాకా కొనసాగితే అధికారంలోకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఒకప్పుడు చంద్రబాబుకు నమ్మకస్తుడైన నేత. అధినేత ఆదేశించిన కార్యాన్ని నెరవేర్చబోయి రేవంత్‌రెడ్డి ఓటుకునోటు కేసులో చిక్కుకున్న ఉదంతాన్నిఇంకా ఎవరూ మర్చిపోలేదు. రేపు కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే రేవంత్‌రెడ్డి కీలకం. అందుకే కాంగ్రెస్‌ గెలవాలని తెలంగాణలో టీడీపీని సమర్ధించే వర్గం కోరుకోవడంలో వింతేమీ లేదు. ఎన్నికల్లో పోటీచేసినా ఒకటీ అరా సీట్లయినా వస్తాయన్న గ్యారంటీ లేదు. అవనవసరంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం తప్ప వచ్చేదేం ఉండదు. అందుకే కాసాని ముచ్చటపడ్డా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలనుకుంది.

చంద్రబాబు జైలుపాలయ్యాక పవన్‌కల్యాణ్‌ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఏపీలో టీడీపీ-జనసేన జాయింట్‌ మీటింగ్‌లు జరుగుతున్నాయి. బీజేపీని కూడా ఎలాగయినా పొత్తుకు ఒప్పించే ప్రయత్నాల్లో పవన్‌కల్యాణ్‌ ఉన్నారు. ఇప్పుడాయన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీచేయబోతున్నారు. ఇలాంటి సమయంలో విడిగా పోటీచేయడం కన్నా ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదన్న స్ట్రాటజీతో టీడీపీ ఉంది. అందుకే నాలుగుసార్లు ఉమ్మడిరాష్ట్రాన్ని పాలించిన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి దూరంగా ఉంది. ఈ దెబ్బతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నా.. కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే కాగలకార్యం గంధర్వులు తీర్చినట్లేనని ఆ పార్టీ భావిస్తున్నట్లుంది.

2018లో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమితో ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ అంచనాలు దెబ్బతిన్నాయి. ఆ పార్టీకి కేవలం రెండు సీట్లే వచ్చాయి. తర్వాత 150 డివిజన్లున్న గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీనుంచి ఒక్కరంటే ఒక్క కార్పొరేటరే గెలిచారు. ఇలాంటి సమయంలో ఏ పార్టీ అయినా మిగిలిన కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాలనుకుంటుంది. పార్టీని మళ్లీ పట్టాలెక్కించాలనుకుంటుంది. కానీ తెలంగాణలో ఇప్పుడు టీడీపీ లెక్కలు వేరు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చినా ఆ పార్టీకి మంచిదే. ఐదారునెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణలో పోటీకి దిగి డిపాజిట్లు పోగొట్టుకుంటే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడుతుంది. చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా ఇప్పటిదాకా తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు దూదిపింజల్లా తేలిపోతాయి. బీఆర్‌ఎస్‌ ఓడిపోయి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే తాము గెలిచినట్లేనన్న భావనతో టీడీపీ ఉన్నట్లుంది. అందుకే తెలంగాణలో పార్టీకి స్మారక చిహ్నంగా మిగిలిన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ సాక్షిగా ఎన్నికలకు దూరమైంది.

Share this post

submit to reddit
scroll to top