గంటల తరబడి విచారణ. దాదాపు 120 ప్రశ్నలు. గంటకో సారి ఐదునిమిషాల బ్రేక్. ఇదీ రెండ్రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణ జరిగిన తీరు. సీఐడీ పక్కా ఆధారాలతో ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదన్నప్పుడల్లా ఫైల్ తీసి చంద్రబాబు ముందు పెట్టింది. విషయం కస్టడీదాకా పోదనుకున్నా చివరికి ఆ ముచ్చటకూడా తీరిపోయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సీఐడీ ఐదురోజుల కస్టడీకోరితే సీబీఐ కోర్టు రెండ్రోజులు అనుమతించింది. దీంతో చంద్రబాబుని రాజమండ్రి జైల్లోనే విచారించారు సీఐడీ అధికారులు.
చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జైల్లోనే విచారించాలని కోర్ట్ ఆదేశించింది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించే అవకాశం కల్పించింది. విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతించారు. 9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది. విచారణ ప్రాంగణంలో ఏడుగురు లాయర్లు ఉండొచ్చని కోర్టు చెప్పటంతో సీఐడీ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కోర్టు ఆదేశాలతో కస్టడీ విచారణను వీడియో తీశారు. విచారణ దృశ్యాలు లీక్ కానివ్వొద్దని కోర్టు చెప్పటంతో దర్యాప్తు విషయంలో పూర్తి గోప్యత పాటించిన సీఐడీ సీల్డ్‌కవర్‌లో కోర్టుకు విచారణ వివరాలు సమర్పిస్తోంది.
వాస్తవానికి చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజే సుమారు 8 గంటలపాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. 20 ప్రశ్నలను చంద్రబాబు ముందు ఉంచారు. అయితే ఆయన సరైన సమాధానాలు చెప్పలేదన్న సీఐడీ కస్టడీలో ఏకంగా 120దాకా ప్రశ్నలను మాజీ ముఖ్యమంత్రి ముందు ఉంచింది. ప్రభుత్వాధినేతగా అధికారుల ప్రొసీడింగ్స్‌ని ఆమోదించడం వరకే తాను చేశానన్నది చంద్రబాబు వాదన. కస్టడీలో ఆయన సహకరించలేదని, మరింత లోతుగా విచారించాల్సి ఉన్నందున కస్టడీ పొడిగించాలని సీఐడీ కోరే అవకాశం ఉంది.
మరోవైపు టీడీపీ అధినేత కేసుపై క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు డిస్మిస్ చేయటంతో చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీంతో క్వాష్ పిటిషన్‌పై, రిమాండ్ కొనసాగింపుపై సోమవారం న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయంపైనే చంద్రబాబు జైలుగోడల నుంచి బయటపడతారో లేదో తేలనుంది. మరోవైపు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. శనివారం, ఆదివారం రెండు రోజులపాటు రిమాండ్ ముగియగానే మరిన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్నాక చంద్రబాబుకు అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది.