రైతుబంధుకే బ్రేక్‌.. రాజకీయానికి నో బ్రేక్‌!

rythunadhu.jpg

రైతు బంధు సాయానికి ఈసీ బ్రేక్‌. కాంగ్రెస్‌ ఆగాలని కోరుకుందా?

బీఆర్‌ఎస్‌ భలే ఛాన్సులే అనుకుంటోందా?

బీఆర్‌ఎస్‌ కోరుకుందే ఎన్నికలసంఘం చేసిందా?

ఒక నిర్ణయం వెనుక ఎన్నో అనుమానాలు. ఎన్నో విశ్లేషణలు. అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి ఎందుకు రద్దుచేయాల్సి వచ్చిందో ఎలక్షన్‌ కమిషన్‌ చెప్పింది. ప్రభుత్వ పథకమైన రైతుబంధుని ప్రచారంలో వాడుకున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అనుమతి ఇచ్చినప్పుడే కండిషన్స్‌ అప్లై అని ఈసీ స్పష్టంగా చెప్పింది. ఈ పథకాన్ని ఎక్కడా ప్రచారానికి వాడుకోవద్దని ఆంక్షలు విధించింది. కానీ రైతుబంధు ప్రస్తావన లేకుండా బీఆర్‌ఎస్‌ ప్రచారమే లేదు. రైతుబంధు సాయం అందకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని మొన్నటిదాకా బీఆర్ఎస్‌ ఆరోపించింది.

రెండ్రోజులక్రితం రైతుబంధు సాయానికి ఈసీ అనుమతించగానే దాన్ని కూడా ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మంత్రి హరీష్‌రావు స్వయంగా ప్రచారంలోనే దీన్ని ప్రస్తావించారు. రెండ్రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు పడబోతోందని చెప్పారు. నియమాలు ఉల్లఘించారంటూ హరీష్‌ ప్రసంగాన్నే ప్రస్తావిస్తూ ఎన్నికలు పూర్తయ్యేదాకా రైతుబంధు సాయానికి ఈసీ బ్రేకేసింది. ఇంకేముందీ ప్రచారం ముగియడానికి 48గంటల ముందు తెలంగాణలో అధికారపార్టీ బీఆర్‌ఎస్‌కి బ్రహ్మాస్త్రం దొరికింది. చూశారా చూశారా మీ నోటికాడి ముద్దని కాంగ్రెస్‌ లాగేసిందంటూ విరుచుకుపడుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. కాంగ్రెస్‌ ఫిర్యాదుతోనే వచ్చేసాయం ఆగిపోయిందని బీఆర్‌ఎస్‌ దుమ్మెత్తిపోస్తోంది.

సాయమేమీ రద్దు కాలేదు. నాలుగురోజులు పెండింగ్‌లో పడిందంతే. కానీ కాంగ్రెస్‌ వల్లే సాయం ఆగిందన్న పాయింట్‌నే బలంగా ప్రచారం చేస్తోంది బీఆర్‌ఎస్‌. హరీష్‌రావు ప్రచారంలో వాడుకోవడం వల్లే ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని కాంగ్రెస్‌ వాదిస్తోంది. నిజంగా రైతులకు సాయం చేయాలని ఉంటే నోటిఫికేషన్‌కి ముందే కేసీఆర్‌ సర్కారు రైతుబంధు సాయం ఎందుకివ్వలేదన్నది విపక్షపార్టీ ప్రశ్న. పాయింటే.. కానీ ముందే ఇచ్చేస్తే ఎలా. ఎన్నికలకు నాలుగైదురోజులముందో, కొన్ని గంటలముందో ఖాతాల్లో సొమ్ముపడితే. .అది మరికాస్త ప్లస్‌ అవుతుంది. ఖాతాల్లో డబ్బుపడితే పడే ఓట్లకంటే.. కాంగ్రెస్‌ ఆపేసిందన్న ప్రచారంతోనే మరింత మేలు జరుగుతుందన్న ఆలోచనతో బీఆర్‌ఎస్‌ ఉన్నట్లుంది. బీఆర్‌ఎస్‌కి ఏదోలా మేలు చేయాలన్న బీజేపీ దూరాలోచనతోనే ఈసీ ఆ నిర్ణయం తీసుకున్నట్లుంది. తెలంగాణ రాజకీయపక్షాలు ఇప్పుడు ప్రతీదీ ఇలాంటి అనుమానంతోనే చూస్తున్నాయి.

రైతుబంధుసాయానికి ఎలాంటి ఆటంకాలు కలగొద్దనుకుంటే బీఆర్‌ఎస్‌ దాని గురించి ప్రస్తావించకుండా ఉండాల్సింది. కానీ కర్నాటక కాంగ్రెస్‌నే బ్రహ్మాస్త్రంలా వాడేస్తున్న బీఆర్‌ఎస్‌.. రైతుబంధుని ప్రస్తావించకుండా ఎందుకుంటుంది? ఓపక్క సర్వేలు, అంచనాలు గాలి మారుతోందంటున్నాయి. పైకి ఎంత బింకంగా ఉన్నా పదేళ్ల అధికారం చేజారుతుందన్న భయం బీఆర్‌ఎస్‌లో ఉంది. అందుకే చివరిక్షణందాకా చేతికి చిక్కిన ఏ అవకాశాన్నీ వదులుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా లేదు. అయినా పుల్వామా ఘటననీ, సరిహద్దుల్లో జవాన్ల త్యాగాలను కూడా ఎన్నికల ప్రచారాల్లో వాడుకున్న మహానుభావులున్న ఈ దేశంలో కేసీఆర్‌నో, రేవంత్‌రెడ్డినో తప్పుపట్టడానికేం లేదు. రైతులు బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని నమ్ముతారా, కాంగ్రెస్‌ వివరణను విశ్వసిస్తారా అన్నది వేరే విషయం. మానం మర్యాద వదిలేస్తేనే రాజకీయాల్లో రాణించగలమన్న నేతలమధ్య బతుకుతున్నాం మనం. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎందుకు ఏరుకోవడం?!

Share this post

submit to reddit
scroll to top