వైసీపీ మంత్రి వెటకారంగా అనుండొచ్చుగానీ అన్ని సదుపాయాలు కల్పించడానికి జైలేమీ అత్తిల్లు కాదు. చంద్రబాబులాంటి స్పెషల్ కేటగిరీ ఖైదీలకు కొన్నిప్రత్యేక సదుపాయాలు ఉండొచ్చు. ఇంటినుంచి క్యారియర్ రావచ్చు. మిగిలిన ఖైదీలతో ఉండాల్సిన అవసరం రాకుండా ప్రత్యేకంగా ఓ బ్యారక్ ఉండొచ్చు. అంతకుమించి ఆశించడం, అరిచి గోలపెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనమైతే ఉండదు. చంద్రబాబుకు జైల్లో కాస్త నలత చేసింది. ఏడుపదుల వయసులో బీపీలూ షుగర్లూ కీళ్లనొప్పుల్లాంటివి అత్యంత సహజం. ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే చంద్రబాబుకి ఇలాంటి సమస్యలు పెద్దగా లేవని చెప్పొచ్చు. కాకపోతే ఎంత ఆరోగ్యంగా ఉన్నా చిన్నపాటి రుగ్మతలు, శారీరక సమస్యలు లేకుండా ఎలా ఉంటాయ్? బాబుగారికి కూడా ఉక్కపోతతో ఎలర్జీ సమస్య తలెత్తింది. ఈ పాయింట్ సరిపోదా ఏంటి.. నెలరోజుల్నించీ నిరసనలతో అలసిపోయిన పార్టీ తమ్ముళ్లకు కొత్త ఎనర్జీ వచ్చేసింది.
చంద్రబాబు ఆరోగ్యం విషమం అంటూ షరామామూలుగా ఎల్లో మీడియా పూనకమొచ్చినట్లు ఊగిపోయింది. బాగా బరువు తగ్గిపోయారని, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని తనయుడితో పాటు కుటుంబసభ్యులు తీవ్ర ‘మనోవేదన’ చెందారు. సతీమణి భువనేశ్వరి అయితే ఏకంగా ఆయన ఐదు కిలోల బరువు తగ్గారని భావోద్వేగానికి గురయ్యారు. తీరా చూస్తే జైల్లో అడుగుపెట్టిన రోజుతో పోలిస్తే ఒక కిలో బరువు ఎక్కువే ఉన్నారని తెలియటంతో ఆ ఆరోపణలు తేలిపోయాయి. ఆయన ఎలర్జీ సమస్యతో కాస్త ఇబ్బందిపడ్డ మాట వాస్తవం. వైద్య బృందం జైలుకొచ్చి పరీక్షలు జరిపింది. కొన్ని మందులు ఇచ్చారు. ఆయన యాక్టివ్‌గానే ఉన్నారని చెప్పారు. అయినా ఆయన ప్రాణాలకు హాని ఉందంటూ రాద్ధాంతం చేయడం ద్వారా టీడీపీ సాధించేదేంటో?
87ఏళ్ల హర్యానా మాజీ సీఎం చౌతాలాకు జైలుశిక్షపడింది. 75 ఏళ్ల వయసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌యాదవ్ అనారోగ్య సమస్యతో బెయిల్‌పై బయటికొచ్చారు. వీఐపీ ఖైదీలకు తీవ్ర అనారోగ్యం వస్తే, ప్రత్యేక వైద్యచికిత్స అవసరమైతే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. చౌతాలా, లాలూ నేరం రుజువైన దోషులు కావచ్చు. చంద్రబాబుపై ఉన్నవి అభియోగాలే కావచ్చు. కానీ చట్టం అందరికీ సమానమేనన్న విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఈ ఎలర్జీ సమస్యతోనైనా అధినేత జైలుగోడలమధ్యనుంచి బయటికొస్తారని తెలుగుదేశం తమ్ముళ్లు ఆశించి ఉండొచ్చు. ఆయన కుటుంబసభ్యులు అదే కోరుకోవచ్చు. కానీ న్యాయస్థానం ఆయనకు కాస్త ఉపశమనం మాత్రమే కలిగించింది.
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలో వైద్యుల సిఫార్సు, జైలు అధికారుల నివేదికతో విజయవాడ ఏసీబీ కోర్డు కీలక ఆదేశాలిచ్చింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు బ్యారక్‌లో చల్లదనం ఉండేలా టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సాధారణంగా జైలులో ఏసీ పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవు. జైళ్లశాఖ డీఐజీ అదే మాట చెబుతూ వచ్చారు. కోర్టు ఆదేశిస్తే అప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడంతో టవర్ ఏసీ ఏర్పాటవుతోంది. దోమల ఎపిసోడ్ అయిపోయింది. నక్సల్ ఖైదీల భయం బలహీనపడింది. స్టెరాయిడ్స్ ఇస్తారన్న ఆందోళనలు రూల్డ్ అవుట్. ఇప్పుడు ఎలర్జీ సమస్యకూడా టవర్ ఏసీతో చల్లబడబోతోంది. ఇంకెందుకు ఆలస్యం.. నెక్ట్స్ సబ్జెక్ట్‌కి స్క్రిప్ట్ రెడీ చేసుకోవడమే! ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. కంటితుడుపు డబ్బా తెచ్చిపెట్టారని, చల్లదనమే లేదని మళ్లీ గోల చేయకుండా ఏ ఫైవ్ స్టార్ టవరో పెట్టేస్తే జైలు అధికారులు కూడా కాస్త ప్రశాంతంగా పడుకోవచ్చు.