సిగ్గుపడుతున్నాం నళినీ.. నీకు శాల్యూట్‌!

nalina-hunfer-strike.jpg

ఎంత నీతిమాలిన సమాజంలో బతుకుతున్నాం మనం. విలువలు లేని వ్యవస్థలతో సర్దుకుపోతున్నాం మనం. సిన్సియారిటీకి విలువలేదు. మనసులోని మాటను నిజాయితీగా బయటికి చెప్పే స్వేచ్ఛలేదు. కల్పిత ప్రపంచంలో అన్నీ కృతకమే. మనుషుల్లా పుట్టాంకదా. చావొచ్చేదాకా తప్పదు. కుక్కల వలె నక్కలవలె ఎలాగైనా బతికేయాల్సిందే. కానీ కొందరుంటారు. చచ్చినా రాజీపడరు. ఇంతకంటే జరిగేదేముందని దేనికైనా సిద్ధమవుతారు. మనం చెప్పుకోబోతున్న నళిని ఆ కోవలోనిదే.

డిపార్ట్‌మెంట్‌లోనే శాల్యూట్‌లు కొడుతూ రాజీపడి ఉంటే ఈ పదేళ్లలో ఓ రెండు ప్రమోషన్లొచ్చేవేమో. జిల్లా పోలీస్‌బాస్‌గా తను కూడా రాజసంగా బతికేదేమో. కానీ అలాంటి బతుకు తనకొద్దు. వద్దని తను కోరుకుంది. ఏ సమాజం నుంచి తానొచ్చానో ఆ సమాజం గుండెచప్పుడు వినలేని ఉద్యోగాన్నే వద్దనుకుంది. గానుగెద్దు జీవితంనుంచి బయటపడింది. ఇప్పుడు చేతులెత్తి మొక్కేంత విజ్ఞతను ప్రదర్శిస్తోంది. అసహనం లేదు. ఆమెకు కోపం రాదు. ఎందుకంటే తనిప్పుడో తత్వవేత్త. తనొక జ్ఞానం. ఎంతోమందికి తనొక మార్గం.

దోమకొండ నళిని. పదేళ్లక్రితం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీ. సీన్‌ కట్‌ చేస్తే ఆమె ఇప్పుడు వేద ప్రచారక్‌. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పవర్‌ఫుల్‌ జాబ్‌ని పూచికపుల్లలా వదిలేసిన త్యాగమూర్తి ఈ నళిని. ఉద్యమపునాదులతో పదేళ్లు ఆకాశానికి నిచ్చెనలేసిన పాలకులకు తనలాంటి చిన్నవాళ్ల గురించి ఆలోచించే తీరిక దొరకలేదు. కానీ ప్రభుత్వంమారగానే ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించిన ఆ నళిని అందరికీ గుర్తుకొచ్చింది. అంతా ఆమెనే తలుచుకుంటున్నారు. చివరికి తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి కూడా తనగురించి ఆరాతీశారు. చట్టసభలో ప్రస్తావించారు. ఆమెకు మళ్లీ ఉద్యోగం ఇవ్వడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిణామాలపై నళిని స్పందన చూశాక అందరికీ ఆమెపై గౌరవం రెట్టింపవుతోంది.

గౌరవనీయులైన cm గారు..

మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్‌లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్‌గా ‘సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9 న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది.

నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్‌మెంట్‌లో చేరాను. జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో పోస్టింగ్ ఇచ్చి, ఛార్జ్‌మెమోలు ఇచ్చి ఎక్స్ప్లనేషన్స్ రాయమనడం , యాన్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్స్‌లో అడ్వర్స్( చెడు)  రిమార్క్ రాయడం, బ్యాచ్‌లో నా ఒక్క దానికే ప్రమోషన్ ను ఆపేయడం, ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్‌టెండ్‌ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్నీ నన్ను ఆనాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి మొర పెట్టుకొనేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అప్పాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు.

సుష్మా స్వరాజ్‌గారికి, సోనియాగాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్‌లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను. శ్రీకృష్ణ కమిటీతో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్‌మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్‌ని ఆ రోజే హత్య చేశారు.

ఈనాడు 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక cmగా మీరు నా case ను Exhumation ( పూడ్చిన శవాన్ని వెలికితీయడం) చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది.

ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది.కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. solitary confinement అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవచ్ఛవంలా బతికాను.

రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు. ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం.దీని వల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటుపడొచ్చు. కాబట్టి నా పంథా మార్చుకోలేను.

మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యురోక్రసీకి వెచ్చించలేను. శ్రేయోమార్గం విడిచి మళ్ళీ ప్రేయోమార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలోజీ(న్యాయదర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుంచి డీఎన్‌ఏగా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుంచి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు.

కాబట్టి అంతిమంగా నేను cm గా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా పై కరుణ చూపి స్టేటస్ కో (యథాతథ స్థితి)కి అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుంచి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ని నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.

( నేను మిమ్మల్ని కలవాలి.కాని ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీ గా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి.సమయం ఎక్కువగా లేదు.అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్‌బుక్‌లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది.)
ఇట్లు
ఒక సనాతనీ
డి.నళినీ ఆచార్యా,
యజ్ఞ బ్రహ్మా, వేద ప్రచారకురాలు

Share this post

submit to reddit
scroll to top