మీరు నేర్పిన విద్యయే నీరజాక్షా..

danam-ranjith-joins-congress.jpg

వేలి మీద సిరా గుర్తే ఇంకా చెరిగిపోలేదు. ఈలోపే ఫిరాయింపులు షురూ అయ్యాయి. ఓటమి తర్వాత కూడా బీఆర్ఎస్‌లో ఆత్మపరిశీలన కనిపించలేదు. ప్రజలు తప్పుచేశారన్న భావనతోనే ఇప్పటికీ ఉంది గులాబీపార్టీ. ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదంటూ శాపనార్థాలు పెడుతోంది. ఫ్రస్టేషన్‌లోనే ఆ మాటలంటున్నా నిజంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తారని భయపడ్డారో, ముందే జాగ్రత్తపడితే మంచిదనుకున్నారో గానీ ఆకర్ష్‌ ప్రాజెక్టు గేట్లెత్తారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రూపంలో బీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ పడింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి రావడమే తప్ప అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేదు. దానం నాగేందర్‌ ఒక అడుగు ముందుకేసి ఏకంగా కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హులు అవుతారన్న భయం ఈ కాలపు నాయకుల్లో ఏ కోశానా లేదు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌, 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబిత ఇంద్రారెడ్డికి ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. అసెంబ్లీ రికార్డుల్లో వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా ఏకంగా మంత్రి పదవులు చేపట్టారు. ఆనాటి గవర్నర్ కూడా ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పుడు అదే సంప్రదాయం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొనసాగబోతోంది. విచిత్రం ఏంటంటే.. దీన్ని అనైతిక వ్యవహారంగా ఎవరూ భావించడంలేదు. ఆనాడు కేసీఆర్‌ చేసిందే సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారురని మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవరూ పెద్దగా తప్పు పట్టడం లేదు.

నేనా పార్టీ మారడమా.. నోనో అని పలికిన గంటలోనే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ శ్రేణులు వ్యతిరేకించినా గేటు మూయలేదు సీఎం రేవంత్‌ రెడ్డి. మొత్తానికి పవర్‌ ఎక్కడుంటే తానూ అక్కడే ఉంటానని నిరూపించుకున్నారు దానం నాగేందర్. ఆయన పొలిటికల్‌ హిస్టరీ చూస్తే ఇదే విషయం కనిపిస్తుంటుంది. 1999లో ఆసిఫ్‌నగర్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. 2004 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ ఓడిపోవడంతో మళ్లీ రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో వంద రోజుల్లోనే పార్టీ ఫిరాయించి మళ్లీ కాంగ్రెస్‌లోకొచ్చారు.

దానం పార్టీ మారడం బీఆర్ఎస్‌కు ఒక ఆయుధాన్ని ఇచ్చింది. దానంపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. ఆగమేఘాల మీద అనర్హత అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్న బీఆర్‌ఎస్‌ తన పదేళ్ల పాలనలో ఫిరాయింపుల్ని మర్చిపోయింది. ఏకంగా శాసనసభాపక్షాన్నే విలీనం చేసే పరిస్థితులను ప్రజలెవరూ మరిచిపోలేదు. అందుకే బీఆర్ఎస్ నేతల వార్నింగ్‌లకు కాంగ్రెస్ లీడర్ల నుంచి గట్టి కౌంటర్లు పడుతున్నాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని కాంగ్రెస్‌ గుర్తు చేస్తోంది.

ఏదేమైనా ఇది ఆరంభం మాత్రమే. ఎమ్మెల్యే దానం, ఎంపీ రంజిత్‌రెడ్డితోనే ఆగేలా లేదు ఫిరాయింపుల పర్వం. కనీసం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. నైతికమా అనైతికమా అన్న హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. ఫిరాయింపులకు బీఆర్‌ఎస్‌ దారిచూపింది. మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాం అన్నట్లు కాంగ్రెస్‌ ఇప్పుడదే పని మొదలుపెట్టింది.

 

 

Share this post

submit to reddit
scroll to top