ఇష్టంలేకపోయినా ఇన్నాళ్లూ కారు డోర్ పట్టుకుని వేలాడుతున్న మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చివరికి పార్టీకి విడాకుల పత్రం ఇచ్చేశారు. సీటివ్వలేదని పార్టీ వీడారా అంటే అదేం లేదు. సీట్లు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉన్నారు. అయినా అధికారపార్టీని ఎందుకు వద్దనుకున్నారంటే కేవలం కొడుకుకోసం. కొడుకు డాక్టర్ అయినా ఆయనకు అనందంలేదు. ఆ కొడుకుని అసెంబ్లీకి పంపాలి. అదృష్టంకలిసొస్తే తనకంటే ఇంకా ఎదగాలన్నదే మైనంపల్లి ఆరాటం. ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. కొత్తగా పార్టీలోకొచ్చే తండ్రీకొడుకులు ఇద్దరికీ కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందా అన్నదే ప్రశ్న.
ఒకప్పుడు తాను గెలిచిన మెదక్ సీటుపై మైనంపల్లి ఎప్పటినుంచో కన్నేశారు. ఆయనకోసం తన కొడుకుకోసం. తాను మల్కాజ్‌గిరి నుంచి పోటీచేస్తూనే కొడుకుకి మెదక్ సీటు కోరుకున్నారు. ఆయనే కాదు ఆయనలాగే చాలామంది సీనియర్లు కొడుకులకు లిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా కుదరలేదు. ఒక్క కోరుట్లలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఆయన కొడుక్కి కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. పార్టీ టికెట్లు ప్రకటించగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన మైనంపల్లి నేరుగా అధినేత కుటుంబాన్నే టార్గెట్ చేసుకున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరికి నలుగురు రాజకీయాల్లో లేరా అని ప్రశ్నించారు. మెదక్ సీటుకి అడ్డంపడ్డారన్న అనుమానాలతో మంత్రి హరీష్‌రావుపై తీవ్ర విమర్శలకు దిగారు.
హరీష్‌రావుని అన్ని మాటలన్నా, టికెట్ల విషయంలో రచ్చచేసినా బీఆర్‌ఎస్ పెద్దలు తప్పుపట్టారే తప్ప మైనంపల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ పిలిచి మాట్లాడలేదు. కొడుకు భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో రాజెవరో రెడ్డెవరో తెలీదు. అందుకే మరో ఐదేళ్లు ఎదురుచూసే ఓపిక మైనంపల్లికి లేదు. అందుకే బీఆర్‌ఎస్‌కి రాజీనామా ప్రకటించారు. పార్టీ టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారడం ఎవరికీ ఇష్టంలేదని బాంబుపేల్చారు. మల్కాజ్‌గిరినుంచే పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. మైనంపల్లి రాజీనామాతో ఆయన స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది.
బీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసిన మైనంపల్లి కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి టికెట్లపై స్క్రీనింగ్ జరుగుతుండటంతో ఢిల్లీలోనే టికెట్లపై హామీ పొందాలనుకుంటున్నారు. మెదక్ సీటు నుంచి కొడుకు రోహిత్‌రావు, మల్కాజ్‌గిరినుంచి తాను పోటీచేయాలనుకుంటున్నారు. మల్కాజ్‌గిరి సీటువరకు మైనంపల్లికి ఎలాంటి ఇబ్బందీ లేదు. అయితే మెదక్ సీటుకోసం ఇప్పటికే ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల్లో కాంగ్రెస్‌కి గట్టి అభ్యర్థుల అవసరం ఉందికానీ జిల్లాల్లో ఆపార్టీల్లో టికెట్ల పోటీ ఎక్కువగానే ఉంది. మరి మైనంపల్లికి పార్టీ మార్పుతో పుత్రోత్సాహం కలుగుతుందో లేదో చూద్దాం.