తెలంగాణలో ప్ర‌క‌ట‌న‌ల‌ ప్ర‌కంప‌న‌లు!

telangana-congress-adds.jpg

గొంగ‌ట్లో తింటూ వెంట్రుక‌లు వేరుకోవ‌డమంటే ఇదే. తెలంగాణ‌లో రాజ‌కీయ‌పార్టీలు ఇప్పుడు అదే ప‌ని చేస్తున్నాయి. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా, నియ‌మాల‌ను పాటిస్తూ పైగుండీ పెట్టుకున్నంత బుద్ధిగా ఏ పార్టీ కూడా ప్ర‌చారం చేయ‌డం లేదు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు లేకుండా ఎవ‌రి ప్ర‌సంగాలూ సాగ‌డంలేదు. తాము చెప్పేదే నిజం, ఎదుటివారి ప్ర‌తి మాటా అబ‌ద్ధ‌మ‌ని చెప్పేందుకే పార్టీలు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నాయి. క‌ల్వ‌కుంట్ల కుటంబం ల‌క్ష‌కోట్లు దోచుకుంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మూడుగంటల కరెంట్ చాలంటోంద‌నీ, అధికారంలోకొస్తే రైతుబంధులాంటి ప‌థ‌కాలు ర‌ద్దుచేస్తానంటోంద‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వీటి మ‌ధ్య‌లో బీజేపీ త‌నంత సుద్ద‌పూస మ‌రోటి లేద‌న్న‌ట్లు మాట్లాడుతోంది.

తెలంగాణ తెచ్చిన పార్టీగా ప్రాంతీయ సెంటిమెంట్ క‌లిసిరావ‌టంతో 2014లో బీఆర్ఎస్ విజ‌యం సాధించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ని ఓడించి అధికార‌ప‌గ్గాలు చేప‌ట్టింది. సంక్షేమ ప‌థ‌కాల‌కు సెంటిమెంట్‌ని జోడించి మ‌రోసారి 2018లో గ‌తంకంటే ఎక్కువ సీట్ల‌తో గెలిచింది. ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించి తెలంగాణ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాన్ని పూర్తిగా బ‌ల‌హీన‌ప‌రిచింది. కానీ ఈసారి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ నుంచి అంత పోటీ ఉంటుంద‌ని, ప్ర‌తిప‌క్ష‌పార్టీ ఈ త‌ర‌హా ప్ర‌చారానికి దిగుతుంద‌ని బీఆర్ఎస్ ఊహించ‌లేక‌పోయింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు తోడు పార్టీకి వేవ్ క‌నిపిస్తుండ‌టంతో ప్ర‌చారాస్త్రాల‌కు కాంగ్రెస్ ప‌దునుపెట్టింది. బీఆర్ఎస్ వైఫ‌ల్యాల్ని, ఆ పార్టీమీద ఉన్న వ్య‌తిరేక‌త‌ని జ‌నంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌లు.

రెండుప‌ర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ యాడ్స్ విష‌యంలో రాజీప‌డ‌క‌పోయినా విప‌క్ష‌పార్టీ ప్ర‌క‌ట‌న‌లు సామాన్య జ‌నంలోకి బాగా వెళ్తున్నాయి. కారు (బీఆర్ఎస్ సింబ‌ల్‌) బుర‌ద‌ను జ‌నంపై చిమ్ముతూ అడ్డ‌దిడ్డంగా వెళ్తుంటుంది. దారిలో చిన్నాచిత‌కా వ్యాపారాలను ధ్వంసం చేస్తూ వ‌చ్చిన కారుకి జ‌నం గాలి తీస్తారు. కేసీఆర్‌ని పోలిన క్యారెక్ట‌ర్ అక్క‌డ క‌నిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ యాడ్స్ బీఆర్ఎస్‌ని బాగా చికాకు పెట్టిన‌ట్లున్నాయి. టీవీ చానళ్లలో బీఆర్‌ఎస్‌తోపాటు సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ప్రకటనలను నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. మీడియా సర్టిఫికేషన్‌ మోడల్‌ కోడ్‌ (MCMC) అనుమతి తీసుకోకుండా అభ్యంతరకరమైన రీతిలో ఈ యాడ్స్ రూపొందించారన్న‌ది బీఆర్‌ఎస్ కంప్ల‌యింట్‌.

ఎన్నికల నియామావళికి విరుద్ధంగా ఆ ప్ర‌క‌ట‌నలు ఉన్నాయ‌న్న బీఆర్ఎస్ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తూ సీఈవో ఆదేశాలిచ్చారు. అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా వేదిక‌ల‌కు తెలంగాణ చీఫ్ ఎల‌క్టోరల్ ఆఫీసర్ లేఖలు రాశారు. అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈవో అభిప్రాయ‌ప‌డ్డారు. అనుమతి పొందిన తర్వాత మార్పులు చేర్పులు చేసి ప్రసారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తున్నందుకు ఆ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ర‌ద్దుచేసిన 15 యాడ్‌లలో కాంగ్రెస్ పార్టీవే తొమ్మిది ఉన్నాయి. బీజేపీకి చెందిన ఐదు ప్ర‌క‌ట‌న‌లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ప్ర‌క‌ట‌న కూడా ర‌ద్ద‌యిన‌వాటిలో ఉన్నాయి. బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే త‌మ ప్ర‌క‌ట‌న‌ల‌పై ఈసీకి ఫిర్యాదుచేసింద‌ని కాంగ్రెస్ అంటోంది. పదేళ్ల వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రకటనలు ప్రగతిభవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని ప్ర‌తిప‌క్ష‌పార్టీ చెబుతోంది. బీఆర్ఎస్ ఒత్తిడితో ఈసీ త‌మ యాడ్స్‌పై ఆంక్ష‌లు విధించింద‌ని కాంగ్రెస్ త‌ప్పుప‌డుతోంది. ప్రకటనలు ఆపగలరేమో కానీ ప్రజాతీర్పును ఆపలేరంటోంది కాంగ్రెస్. ఇది మాత్రం నిజం. ప్ర‌జ‌లే అంతిమ న్యాయ‌నిర్ణేత‌లు. ప్ర‌లోభాల‌కో, యాడ్స్‌కో వారు ప్ర‌భావితం అవుతార‌నుకోవ‌డం పొర‌పాటు. ఎన్నిక‌ల ప్ర‌చారాల్లో ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌లు, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, నిందారోప‌ణ‌లు చేయొద్ద‌ని కూడా ఈసీ చెబితే బావుంటుంది. నియ‌మాల‌నే తుంగ‌లో తొక్కేస్తుంటే ఇక ఉల్లంఘ‌న‌లెక్క‌డ‌? అంతా ఒకే తాను ముక్క‌లే!

 

Share this post

submit to reddit
scroll to top