ఫోన్‌ ట్యాపింగ్‌.. తెరవెనుక పెద్దలెవరు?

phone-tapping-police.jpg

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతోంది. తొలిసారి ఓ పోలీస్‌ అధికారిపై టెలిగ్రాఫ్ యాక్ట్‌ కింద కేసు నమోదయింది. సస్పెండెడ్‌ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పొలిటికల్‌ లింకుల డొంక కదులుతోంది. మొన్నటిదాకా డీఎస్పీ హోదాలో ఉన్న అధికారి చంచలగూడ జైల్లో నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక టూల్‌తో ప్రతిపక్ష నేతలు సహా పలువురి ఫోన్లను ట్యాప్‌ చేశారనే అభియోగంతో కేసు నమోదైంది. ప్రణీత్‌రావు పాటు మరికొందరు కలిసి ఎస్ఐబి ఆఫీసులో డేటాని ధ్వంసం చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలువురు ప్రముఖుల ప్రొఫైల్స్‌ని రహస్యంగా మానిటర్ చేశారు. డేటాని తన పర్సనల్ డ్రైవ్‌లో కాపీ చేసుకున్నారు. పనైపోయాక కంప్యూటర్‌లతో పాటు ఎస్‌ఐబిలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారు.

కొందరు ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌ కోసం ప్రణీత్‌ టీమ్‌ ప్రత్యేక టూల్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కొందరి ఆదేశాలతో రికార్డులు ధ్వంసం చేశారని, కాల్‌డేటాను సాఫ్ట్‌ కాపీలో సేవ్‌ చేసి గత ప్రభుత్వ పెద్దలకు రికార్డులు ఇచ్చారని అనుమానిస్తున్నారు. పోలీసు అధికారి ప్రణీత్‌రావు హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో తేల్చేపనిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రణీత్ కీలక పాత్ర పోషించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పార్టీలకు ఫండింగ్ ఇచ్చిన రియల్టర్ల కాల్స్‌ని కూడా ప్రణీత్‌రావు ట్యాప్‌ చేసినట్టు తేలింది. పొలిటికల్‌ లీడర్లు, రియల్టర్లు సహా పోలీస్‌ ఉన్నతాధికారుల కాల్స్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు భావిస్తున్నారు.

ప్రణీత్‌రావు వెనుక ఉండి కథ నడిపించిన అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎప్పుడూలేని విధంగా మొదటిసారిగా డీఎస్పీ స్థాయి అధికారిపై టెలిగ్రాఫ్ యాక్ట్‌ కేసు ఫైల్‌ చేశారు. ప్రణీత్ రావు అరెస్టుతో కొందరు మాజీ అధికారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. అయితే ప్రణీత్‌రావు టీం లో ఉన్న 30 మంది సభ్యులను ఇప్పటికే ప్రత్యేక బృందం గుర్తించింది.

Share this post

submit to reddit
scroll to top