ఎన్నాళ్లకెన్నాళ్లకు. నువ్వానేనా అన్నట్లు అసెంబ్లీలో ఉభయపక్షాలు తలపడిన దృశ్యం మళ్లీ ఇన్నాళ్లకు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను కూడా గతంలో లాగేసుకుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి అప్పుడప్పుడూ ఒకటి రెండు గొంతులు ఉన్నామంటే ఉన్నామన్నట్లు వినిపించాయి మొన్నటిదాకా. కానీ మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆవిష్కృతమైంది అసలు సిసలు సభాసమరం. ఆరురోజుల అసెంబ్లీ సెషన్‌లో వార్ వన్ సైడ్ కాదు.. రెండు సైడ్లూ వాదోపవాదాలు అదిరిపోయాయి. బండ్లు ఓడలు ఓడలు బండ్లయ్యాయి. దాదాపు పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన గులాబీపార్టీ అపోజిషన్‌లో కూర్చుంది. విపక్షంగా కూడా ఈ పదేళ్లు గట్టిగా గొంతెత్తే అవకాశం రాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ప్రొటెం స్పీకర్ ఎన్నిక దగ్గరే తెలంగాణ అసెంబ్లీపై జనంలో చర్చ మొదలైంది. అక్బరుద్దీన్ ఆ కుర్చీలో ఉంటే అసెంబ్లీకి రాము అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మొరాయించడంతో కొత్త అసెంబ్లీ ఓపెనింగ్ సీనే అదిరిపోయింది. మొదటిరోజు మొదటిగంట నుంచి సభ ముగిసేదాకా అటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం ఎక్కడా తగ్గలేదు. పాయింట్ టు పాయింట్.. సబ్జెక్టు మీద ఫైటింగ్. రెండు శ్వేతపత్రాలతో గత పాలకపక్షంపై కాంగ్రెస్ కత్తులు దూసింది. అధికారపక్షంలో శ్రీధర్‌బాబు సబ్జెక్ట్‌తో కొడితే .. కొండా సురేఖ, కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి పవర్‌ఫుల్ డైలాగులు పేలాయి. విపక్షనుంచి హరీష్‌రావు హైలెట్ అయితే ఎంఐఎంనుంచి అక్బరుద్దీన్ బాగా ప్రిపైరై వచ్చినట్లు కనిపించింది.
వాకౌట్లు లేవ్.. సస్పెన్షన్లు లేవు. అంతా రావాల్సిందే.. వచ్చినవాళ్లంతా కూర్చోవాల్సిందే. చెప్పింది వినాల్సిందే అన్నట్లు నడిచాయి అసెంబ్లీ సమావేశాలు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అసెంబ్లీ సమావేశాలంటే ముంత మసాలాలా స్పైసీగా ఉండేవి. సీట్లు అటూఇటూ మారినా అదే వాడి అదే వేడి. పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అసెంబ్లీలో అలాంటి సీన్. ఆరుగురు మంత్రులు ప్రతిపక్షాలకు దీటైన జవాబులిస్తే.. అటు గులాబీ శిబిరం కూడా గట్టిగానే నిలబడింది. 2014లో బీఆర్‌ఎస్ తొలిసారి అధికారంలోకొచ్చినప్పుడు… 2018లో రెండోసారి గెలిచినప్పుడు కేసీఆర్ వన్ మ్యాన్ షోగా అసెంబ్లీ నడిచింది. చర్చ ఏదైనా రచ్చ వన్ సైడే. కట్ చేస్తే.. ఇప్పుడు సీన్ మారిపోయింది. కేసీఆర్ సభలో లేరన్నదొక్కటే లోటు. మిగతాదంతా సేమ్‌టు సేమ్. ఇది జస్ట్ టీజరే.. అసలు సినిమా ముందుంది.