ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలుసు. కానీ బీజేపీ తగ్గనే తగ్గదు. ఐదురాష్ట్రాల ఎన్నికల వేళ ఈడీ దాడులతో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు బెట్టింగ్ యాప్ సెగ తగులుతోంది. పేపర్ లీక్, మనీలాండరింగ్ కేసులో రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కుమారుడి పేరు బయటికొచ్చింది. ఇక లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంని జైల్లో వేసిన ఈడీ కేజ్రీవాల్‌కు నోటీసులిచ్చి అరెస్ట్‌పై సంకేతాలిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతోన్న సమయంలో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. బెట్టింగ్ యాప్ స్కామ్ ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సర్కార్‌ని కుదిపేసింది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్‌కు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి 508 కోట్ల రూపాయల ముడుపులు అందాయని ఈడీ అనుమానిస్తోంది. ఆసిమ్‌దాస్ అనే వ్యక్తి దాదాపు 6కోట్లు తరలిస్తూ ఈడీ అధికారులకు పట్టుపట్టాడు. ఎన్నికల్లో ఖర్చుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకులు సీఎం భూపేష్‌కి రూ.508 కోట్లు చెల్లించారని ఆ కొరియర్ చెప్పాడంటోంది ఈడీ. కూపీలాగితే మహదేవ్ బెట్టింగ్ నెట్‌వర్క్ డేటా బయటికొచ్చింది. ఆ కొరియర్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించిన భారీ మొత్తంలో ఈడీ బృందాలు నగదు స్వాధీనం చేసుకున్నాయి.
అయితే ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ సీఎం బఘేల్ ఈ మొత్తం వ్యవహారాన్ని పిల్లల ఆటగా కొట్టిపారేశారు. ఎవడో దొరకడం ఏంటి.. అతను చెప్పాడని తనపై నింద మోపడమేంటి అని ఛత్తీస్‌గఢ్ సీఎం ప్రశ్నిస్తున్నారు. బట్టకాల్చి మీదేయడం సులభమేనంటున్నారాయన. ఎవరో కోన్ కిస్కా వచ్చి ప్రధానిపై ఆరోపణలు చేస్తే ఈడీ దర్యాప్తు చేస్తుందా అని ప్రశ్నించారు బగేల్. శుభమ్ సోని అనేవాడెవడో తనకు తెలీనే తెలీదని బఘేల్ ఖండించగానే లైవ్‌లో ప్రత్యక్షమయ్యాడు ఆ వ్యక్తి. బెట్టింగ్ యాప్ యాక్టివిటీ కోసం సీఎం భూపేష్ తనను ప్రోత్సహించారని బాంబుపేల్చాడు. భిలాయ్‌లో తమ గ్యాంగ్‌ను అరెస్ట్ చేయటంతో విదేశాలకు పారిపోవాలని సలహా ఇచ్చింది ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రేనంటున్నాడు శుభమ్ సోని. తనను కాపాడాలని అభ్యర్థిస్తూ ఓ వీడియో చేశాడు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముడుపుల వ్యవహారాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. అయితే ఇదంతా కుట్ర ప్రకారం జరుగుతోందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. తమపై బురద చల్లేందుకు కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని ఛత్తీస్‌గఢ్ సీఎం విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో ఈడీ డబ్బు బట్వాడా ఏజెన్సీగా మారిందని రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత తనను అరెస్ట్ చేసేందుకు ఈడీ రెడీగా వుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనుమానపడుతున్నారు.