బీజేపీ స్కెచ్‌ అదిరిందిగా!

kavitha-arrest.jpg

ఠంచనుగా చెప్పిన టైంకి దిగిపోయే ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ల్యాండింగ్‌ కాస్త ఆలస్యం. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితకు ఈడీ అరెస్ట్‌వారంట్‌. యాదృచ్ఛికంలా అనిపిస్తున్నా పక్కా స్కెచ్‌ ఉందన్నదే పొలిటికల్‌ డౌట్‌. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత పేరు ఎప్పట్నించో వినిపిస్తోంది. ఆమెకు వ్యతిరేకంగా కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. సాక్షాత్తూ ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇదే కేసులో జైల్లో ఉన్నారు. కవితని కేంద్రప్రభుత్వం కాపాడుతోందన్న అనుమానం కమలంపార్టీకి రాజకీయంగా నష్టంచేసింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా దాని ప్రభావం పడేలా ఉంది. అందుకే ఇప్పుడు కేసీఆర్‌ బిడ్డ అరెస్ట్‌కి ముహూర్తం సిద్ధమైంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ-ఐటీ సోదాల విషయం తెలియగానే కేసీఆర్‌ ఎడమకన్ను అదిరింది. అధికారంలో ఉంటే కాళ్లూగెడ్డాలు పట్టుకుని ఏదన్నా మేనేజ్‌ చేసుకోవడానికి కాస్త అవకాశమన్నా ఉండేదేమో. ఇప్పుడు దారులన్నీ మూసుకుపోయాయి. పార్టీ నేతల్ని కాపాడుకోవడమే కష్టమన్నట్లుంది. బీఆర్‌ఎస్‌ రాజకీయంగా ఏ విధంగానూ ఉపయోగపడదని బీజేపీకి అర్ధమైంది. అందుకే ఈడీ టైం చూసుకుని ఎంటరైంది. సెర్చ్‌వారెంట్‌తో సోదాలు నిర్వహించింది. ఇక్కడితోనే కథ అయిపోలేదంటూ అరెస్ట్‌ వారంట్‌ ఇచ్చి కవితను అరెస్ట్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియ కాస్త కష్టమయ్యేదేమో. కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఈడీనే వచ్చి పట్టుకెళ్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వైపునుంచి కూడా కావాల్సిన సహకారం సంపూర్ణంగా లభించింది.

నేను ఏ పాపమూ ఎరగనని, రాజకీయవేధింపులేనని కవితతో పాటు కేసీఆర్‌ కుటుంబమంతా గొంతెత్తినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. నిప్పులేందే పొగరాదని అందరికీ అర్ధమైపోయింది. తండ్రి అధికారంలో ఉండగా అన్న ఓ వైపు, చెల్లి మరోవైపు అన్నిట్లో వేలుపెట్టారు. కవిత ఓ అడుగు ముందుకేసి ఢిల్లీ లిక్కర్‌ పాలసీలోనే తలదూర్చారు. సౌత్‌గ్రూప్‌కి కర్త కర్త క్రియ తానే అయ్యారు. ఈడీ విచారణలో దానికితగ్గ ఆధారాలున్నాయి. దర్యాప్తుసంస్థ వాదనతో న్యాయస్థానం ఏకీభవించేందుకు అవసరమైన ఆధారాలు సిద్ధంగా ఉన్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటు అంటే ఇదేనేమో! అసలే రాష్ట్రంలో అధికారం కోల్పోయి నమ్ముకున్న నేతలు ఒక్కొక్కరూ జారిపోతున్నవేళ.. ఎప్పట్నించో వేలాడుతున్న ఈడీ గొడ్డలి మెడపై పడింది.

తనపై చర్యలు తీసుకోకుండా ఆపాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఎలాంటి అరెస్టులు ఉండవన్న నమ్మకంతో ఉన్నారు కేసీఆర్‌ కూతురు. కానీ ఈడీ వ్యూహాత్మకంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేకవిమానంలో లిఫ్ట్‌ చేసింది. కేటీఆర్‌ ట్రాన్సిట్‌ వారంట్‌ లేదని దబాయించినా, కడిగిన ముత్యంలా తిరిగొస్తానని కవిత బుకాయించినా చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఇంటినుంచి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీకి లిక్కర్‌స్కామ్‌లో ఆమెను జైల్లో ఎలా ఉంచాలో తెలీకుండా ఉంటుందా!

 

Share this post

submit to reddit
scroll to top