అప్పుచేసి పప్పుకూడు తినిపిస్తాం!

parties-telangana.jpg

ఇది ఎన్నికల సీజన్‌. సాధ్యమా అసాధ్యమా అన్నదాంతో సంబంధం లేదు. పైగా ప్రజలను సోమరిపోతులుగా మార్చేందుకు పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటాయి. గురివింద గింజకు తనకింది నలుపు తెలియదన్నట్లు ఎదుటి పార్టీ హామీల్ని ఎత్తిపొడిచేవారు తామేం చేస్తున్నామో చూసుకోరు. ఆరు గ్యారెంటీలపై తమ స్ట్రాటజీ వర్కవుట్‌ అవుతోందని కాంగ్రెస్‌ సంబరపడుతోంది. హస్తంపార్టీ వ్యూహాన్ని దెబ్బతీసేలా ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఆరు గ్యారెంటీలపై విమర్శలు గుప్పిస్తోంది. ఆరు గ్యారెంటీలు, ఆరు నెలలకో ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్‌ హామీని కామెడీ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఆరు నెలలు కర్ఫ్యూ, పరిశ్రమలకు ఆరు నెలల హాలిడే, రైతులకు ఆరు గంటల కరెంట్‌ అంటూ సెటైర్లేస్తున్నారు.

బీఆర్ఎస్‌ అమలుచేస్తున్న పథకాలు ప్రజలను ఆర్థికంగా నిలబెట్టేవిగా ఉంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలను బానిసలుగా మార్చేవిగా ఉన్నాయంటూ బీఆర్‌ఎస్‌ దుమ్మెత్తిపోస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలుచేసేందుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ సరిపోదని బీఆర్ఎస్ లెక్కలు చెబుతోంది. ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ 2.77 లక్షల కోట్లు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలకు కావాల్సింది 2.90 లక్షల కోట్లని లెక్కలేసి మరీ చెబుతున్నారు. మరి ఆ ఆరు హామీలకే బడ్జెట్‌ సరిపోకపోతే జీతాలెక్కడినుంచి ఇస్తారు, మిగతా సంక్షేమం సంగతేంటని అధికారపార్టీ ప్రశ్నిస్తోంది.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిందని బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ కూడా చెబుతోంది. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇచ్చిన హామీలకు కట్టుబడి వంద రోజుల్లో అమలుచేసి చూపిస్తామని కాంగ్రెస్‌ పార్టీ నొక్కి వక్కాణిస్తోంది. కర్నాటకలో పథకాలు అమలవుతున్నాయో లేదో తమవెంట వస్తే తీసుకెళ్లి చూపిస్తామని కాంగ్రెస్‌ నేతలు సవాల్‌ చేస్తున్నారు. పైగా ఆరు గ్యారెంటీలను రాష్ట్ర బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకునే ఇచ్చామని గట్టిగా చెబుతున్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణకు ప్రజలకోసం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం పెద్ద కష్టమేం కాదని కాంగ్రెస్‌ వాదిస్తోంది.

ఒకప్పుడు పిండికొద్దీ రొట్టె అన్నట్లు పాలకులు జాగ్రత్తపడేవారు. అందుకే అసాధ్యమైన హామీల జోలికి వెళ్లేవారు కాదు. తలకుమించిన పనులు నెత్తికెత్తుకునేందుకు సాహసించేవారు కారు. కానీ ఇప్పుడు రాజకీయపార్టీలు, పాలకులు మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వెళ్లిపోతున్నారు. అప్పుచేసయినా పప్పుకూడు తినిపించాలని ఆరాటపడుతున్నారు. అప్పు చేస్తే తప్పేముందన్న ఆలోచనతోనే టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో హామీలిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ కూడా దీన్నే ఫాలో అవుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి కూడా అధికారం కోసం రెండుసార్లు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్‌ ఈసారి చావోరేవో తేల్చుకోవాలనుకుంటోంది. ఆరు గ్యారెంటీలు అందులో భాగమే. దీంతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్‌ పార్టీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఉన్న పథకాలనే మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. కొత్త హామీలకు పదునుపెట్టే ప్రయత్నాల్లో ఉంది.

Share this post

submit to reddit
scroll to top