అక్రమసంబంధాలు నాలుగ్గోడలమధ్య దాగవు. చాటుమాటుగా వచ్చిపోయినా, చీకట్లో గోడదూకినా ఎవరో ఒకరు పసిగట్టేస్తారు. పదిమందికీ తెలిశాక ఇంకేముంటుందీ.. బతుకు బస్‌స్టాండే. బీఆర్‌ఎస్-బీజేపీ ఒక్కటేనన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో బలపడింది. పెద్దపెద్దోళ్లందరినీ జైల్లో పడేసినా అంత పెద్ద లిక్కర్‌స్కామ్ కేసీఆర్ బిడ్డని టచ్‌చేయలేకపోయింది. విచారణకు వెళ్లినప్పుడల్లా విజయగర్వంతో బయటికొచ్చారు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో అక్రమాలమీద ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. ఇదే మరో బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలోనో అయ్యుంటే ఈపాటికి కేంద్ర దర్యాప్తుసంస్థలు దిగిపోయేవి. కానీ తెలంగాణ విషయంలో మాటలు తప్ప చేతలు లేవు.
ఎన్నికలముందు బీజేపీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతి వంటి నేతలు పార్టీ తీరును ఛీకొట్టారు. బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య అవగాహన ఉందని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్రం కుమ్మక్కైందని ఆరోపించారు. కవితని జైల్లో వేస్తామని ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన బండి సంజయ్ పోస్ట్ ఊడింది. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డికి బీజేపీ నాయకత్వం రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. కేసీఆర్ సూచనతోనే బండి సంజయ్‌ని తప్పించి కిషన్‌రెడ్డిని పెట్టారన్న విజయశాంతి ఆరోపణలు బీజేపీ పరువు తీశాయి. మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని ప్రత్యక్షంగా చూశాక కూడా కేంద్రానికి నోరుపెగలడం లేదంటే రెండుపార్టీల మధ్య బలమైన బంధం లేదని ఎవరైనా ఎలా అనుకుంటారు.
తెలంగాణలో నిండా మునిగిన బీజేపీకి చలేయడం లేదు. కానీ ఇప్పటిదాకా తన వెంట ఉన్న మైనారిటీలు చేజారిపోతారేమోనని బీఆర్‌ఎస్‌కి భయం పట్టుకుంది. అసలే ఈసారి చావోరేవో అన్నట్లు కాంగ్రెస్ తెగించి కొట్లాడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేనన్నప్రచారం గులాబీపార్టీ గుండెల్లో గునపమై గుచ్చుకుంటోంది. బీఆర్‌ఎస్ ప్రచారాల్లో కాంగ్రెస్సే ప్రధాన టార్గెట్. తప్పదన్నట్లు బీజేపీని ఓ రెండు మాటలన్నా ఆరోపణల తీవ్రత అంతగా ఉండటం లేదు. బీఆర్‌ఎస్‌తో తమకేమీ లేదని చెప్పుకునేందుకు బీజేపీ గొంతు చించుకుంటున్నా విషయం అర్ధమైన జనం పెద్దగా స్పందించడం లేదు. తెలంగాణలో తానెలాగూ గెలవలేనని బీజేపీకి అర్ధమైంది. కాకపోతే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెంటికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే.. తన చేతిలో ఉన్న సీట్లతో చక్రం తిప్పొచ్చనే దింపుడుకళ్లెం ఆశేదో ఆ పార్టీకి ఉన్నట్లుంది.
తెలంగాణలో అధికారంలోకి రాగానే పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ అక్రమాలను బీజేపీ నిగ్గుతేలుస్తుందట. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తుందట. కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కేంద్రంలో తొమ్మిదిన్నరేళ్లనుంచీ ఉన్నది తమ ప్రభుత్వమేనని ఆయన మర్చిపోయినట్లుంది. ఏ రాష్ట్రంలో చిన్నతీగ దొరికినా డొంక కదిపే బీజేపీ… తెలంగాణ విషయంలో మాత్రం అధికారంలోకొస్తేనే ఏదన్నా చేయగలుగుతానని చెబుతోంది. ప్రచారానికి వచ్చిన ఒకరిద్దరు కేంద్రమంత్రులు కూడా లిక్కర్‌స్కామ్‌లో ఎవరికీ మినహాయింపులేదని, కవిత నెంబర్ వస్తుందని చెప్పెళ్లారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల నెంబర్ తేలాకే ఆ నెంబర్ వస్తుందేమో మరి!? మేనిఫెస్టోలో మేడిగడ్డప్రాజెక్టుని పునరుద్ధరిస్తామని చెబుతోందేగానీ, పొరపాటున కూడా అక్రమాల నిగ్గు తేలుస్తామన్న మాట లేదు. ఎంత ఘాటు ప్రేమయో! అర్ధమైపోవడం లేదూ!?