చిదంబరం అందించిన సెంటిమెంట్‌ అస్త్రం!

chidambaram-with-revanthreddy.jpg

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిపోయింది. పార్టీ పేరులోని తెలంగాణ పదమే మాయమైంది. వరుసగా రెండు ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా ఉన్న సెంటిమెంట్‌ ఈసారి పనిచేయదని కేసీఆర్‌ అండ్‌ కోకి అర్ధమైంది. చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. కర్నాటక ఫెయిల్యూర్‌నుంచి 11సార్లు అధికారంలో ఏం చేశారన్న ఎత్తిపొడుపు దాకా అన్ని అస్త్రాలూ వాడేస్తోంది బీఆర్‌ఎస్‌. కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి సెంట్‌మెంట్ రాజుకుంది. బీఆర్‌ఎస్‌ రాజేసే ప్రయత్నాల్లో ఉంది.

తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలని బీఆర్‌ఎస్‌ తప్పుపడుతోంది. హంతకుడే క్షమాపణ చెప్పినట్లు ఉందని ఆ పార్టీ మండిపడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబరం సెంటిమెంట్‌లో కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజాఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని చెప్పారు. అయితే ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం యువకుల బలిదానాలు దురదృష్టకరమంటూ దానికి క్షమాపణ కోరారు. కాంగ్రెస్ సీనియర్‌ నేత వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌కి కొత్త ఆయుధాన్నిఅందించాయి.

కాంగ్రెస్‌ వల్లే తెలంగాణయువత ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందంటోంది బీఆర్‌ఎస్‌. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా చిదంబరం క్షమాపణలు కోరారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. చిదంబరం తీరు హంతకుడే సంతాపం తెలిపిన‌ట్లు ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటనని చిదంబరం వెనక్కి తీసుకోవడం వల్లే యువకుల బలిదానాలు జరిగాయన్నారు. యువత ప్రాణాలు బలితీసుకున్న నరహంతక పార్టీని ఎందుకు క్షమించాలని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పడానికి గాంధీలకు నోరు రాక బంట్రోతులను పంపిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

1969లో 365 మంది అమాయక విద్యార్థులను కాల్చిచంపిన చరిత్రతో పాటు, మలిదశ ఉద్యమంలో వందల మంది బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని బీజేపీ నిందిస్తోంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని.. సకలజనులు ప్రాణాలకు తెగించి కొట్లాడి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించారంటున్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. తెలంగాణతో తమది రక్తసంబంధమని రాహుల్‌గాంధీ అంటే.. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసిన దుర్మార్గం కాంగ్రెస్‌ పార్టీదన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చామని కాంగ్రెస్‌ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే.. బలిదానాలకు కారణం కాంగ్రెస్సేనని ప్రత్యర్థిపార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికలకు రెండువారాల ముందు మొదలైన సరికొత్త సెంటిమెంట్‌ని తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారో!?

Share this post

submit to reddit
scroll to top