తెలంగాణలో కమలం, జనసేన పార్టీల మధ్య బంధం కలిసింది. ప్రధాని మోడీతో పవన్‌కల్యాణ్ ప్రచారవేదిక పంచుకున్నారు. ఇచ్చింది ఎనిమిది సీట్లే అయినా రెండుపార్టీల మధ్య బంధం చెడిపోలేదన్న విషయం ఈ పొత్తుతో అర్ధమైంది. అయితే తెలంగాణ పొత్తుల ప్రభావం ఏపీపై ఉంటుందా? జనసేనతో పొత్తు బీజేపీకి బలాన్నిస్తుందా? తెలంగాణలో టీడీపీ మిత్రధర్మం పాటిస్తుందా? లేక లోపాయికారీగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందా? ఇవే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్నలు.
తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తుంటే టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణలో వచ్చిన స్పందనతో ఆ పార్టీ కచ్చితంగా పోటీచేస్తుందనుకున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న వ్యూహంతో ఎన్నికలకు దూరంగా ఉంది టీడీపీ. కానీ ఇదే సమయంలో బీజేపీ-జనసేన కలిసి బరిలోకి దిగుతున్నాయి. దీంతో టీడీపీ మద్దతుదారుల ఓట్లు ఏ పార్టీకి పడతాయనే చర్చ జరుగుతోంది. ఈ మూడు పార్టీల వైఖరి రాబోయే ఏపీ ఎన్నికలపై ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఏపీలో మాత్రం బీజేపీ ఊసు ఎత్తటంలేదు. అయితే తెలంగాణలో బీజేపీ, జనసేన, టీడీపీ ఈక్వేషన్ ఏపీపై కచ్చితంగా ప్రభావం చూపించడమైతే ఖాయం. తెలంగాణలో జనసేనకు నామమాత్రపు సీట్లు ఇచ్చినా బీజేపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ఏపీలో జనసేనకు టీడీపీకి బలమున్న సీట్లు కేటాయిస్తే ఇదే జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ, జనసేనల పొత్తుల ప్రభావం ఏపీలో మాత్రం రివర్స్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. అందుకే ఇల్లకగానే పండగకాదు. ముందుంది ముసళ్ల పండుగ!