బీహారీబాబూ.. ఇదా తమరి డాబు!

someshkumar-ex-cs.jpg

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారి అంటే ఎందుకో ప్రభుత్వ పెద్దలకు వల్లమాలిన ప్రేమ. ఆంధ్రా కేడర్‌కి బదిలీ అయినా తెలంగాణలో పాతుకుపోయారు ఐఏఎస్‌ సోమేశ్‌కుమార్‌. ఆయన నమ్ముకున్న ప్రభుత్వం గద్దెదిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. దాంతో అయ్యగారి భాగోతం ఒక్కోటీ బయటికి వస్తోంది. ఐఏఎస్ అయినా ఆయనకు డీవోపీటీ నిబంధనలను పట్టవు. ఆయన అక్రమాస్తుల చిట్టా బయటికొస్తుంటే అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని రెండు సర్వేనెంబర్లలో ఇటీవల మాజీ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్ కుమార్ 25 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని ఆయన తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడ ఎకరా మార్కెట్ విలువ రూ.3 కోట్లకు పైగా ఉన్న ఆ ప్రాంతంలో ఏకంగా 25 ఎకరాలు కొనేశారు ఘనత వహించిన ఆ ఐఏఎస్‌. అక్కడ ఫార్మాసిటీ వస్తుందన్న సమాచారంతో ఆయన ముందే అక్కడ భూములు కొనేశారు. సేల్ డీడ్ ద్వారా కాకుండా సాదాబైనామా ద్వారా ఈ భూమి కొనుగోలు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్‌లో ఈసీని పరిశీలిస్తే భూమి కొనుగోలు చేసిన ఆధారాలు కనిపించడం లేదు. ధరణి పోర్టల్‌లో కూడా ఆయనకు అనుకూలంగా ఎంట్రీ జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమానిస్తోంది.

వాస్తవానికి ఐఎఎస్ స్థాయి అధికారులు భూములు కొనుగోలు చేసినా, ఆస్తులు కొనుగోలు చేసినా ముందస్తుగా కేంద్రంలోని డీవోపీటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సోమేశ్ కుమార్ తన భార్య పేరు మీద భూములు కొన్నా ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శిగా చక్రం తిప్పారు సోమేశ్‌కుమార్‌. అన్ని ప్రభుత్వ శాఖకు ఆయనే సుప్రీం. రూల్స్‌ రెగ్యులేషన్స్‌ అన్నీ ఆయనకు తెలుసు. అయినా డీవోపీటీ అనుమ‌తులు లేకుండా 25 ఎక‌రాల భూమి కొనుగోలు చేశారంటే ఆయన చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఈ 25 ఎక‌రాల భూమి కొనుగోలు ఆయన చక్కబెట్టిన అనేకానేక వ్యవహారాల్లో ఓ చిన్న భాగమేనంటున్నారు. లెక్కకుమించి స్థిర చరాస్తులను ఆయన కూటబెట్టినట్లు అనుమానిస్తున్నారు.

భూముల వ్యవహారం బయటపడ్డాక అంతా చట్టబద్ధమేనని సోమేశ్‌కుమార్‌ బుకాయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించే 2018 సంవత్సరం మొదట్లోనే 25 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు మాజీ సీఎస్‌ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న ఇంటిని విక్రయించి, ఆరేళ్ల కిందటే ఈ వ్యవసాయ భూమి కొనుగోలు చేశానని అంటున్నారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నానని స్పష్టం చేశారు. ఏపీ సర్వీస్‌కి వెళ్లకుండా గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్‌కి ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు ఈ సీనియర్‌ ఐఏఎస్‌. అంతా రూల్స్‌ ప్రకారమే జరిగిందని సోమేశ్‌కుమార్‌ చెబుతున్నా.. ఈ భూముల కొనుగోలు వ్యవహారంపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.

🡆 పట్టాదారు పేరిట ఖాతా నెంబర్‌ 5237 ద్వారా సర్వే నెం.249/ఆ1 లో 8 ఎకరాలు, 249/ఆ2 లో 10 ఎకరాలు, 260/అ/1/1 లో 7.19 ఎకరాల వంతున మొత్తం 25.19 ఎకరాలు ఉన్నట్లు తేలింది.

🡆 సర్వే నెం.249 లో ధరణి పోర్టల్ రాకముందు ఈసీని పరిశీలిస్తే కేవలం ఐదు లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అందులో సోమేశ్‌ కుమార్ కుటుంబ సభ్యుల పేర్ల ప్రస్తావన లేదు.

🡆 సర్వే నెం.260 కి సంబంధించిన లావాదేవీలను పరిశీలించినా నాలుగే ఉన్నాయి. అందులోనూ సోమేశ్‌కుమార్‌కి సంబంధించిన లావాదేవీలు కనిపించలేదు.

🡆 ధరణి పోర్టల్‌లో ఈ భూమికి సంబంధించిన ఖాతా నెం.5237గా ఉంది. నిజానికి భూ రికార్డుల ప్రక్షాళనకు ముందు భూ ఖాతాదారులు లేరు 3 వేలకు మించి లేరు. మరి ఈ ఖాతా నెంబరు ఎలా కేటాయించారు?

🡆 సేల్ డీడ్ ద్వారా కాకుండా సాదాబైనామా ద్వారా కొనుగోలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్‌ ఈసీలో కొనుగోలుకు ఆధారాలు ఎందుకు లేవు?

Share this post

submit to reddit
scroll to top