బీజేపీ-జనసేన దోస్తీ.. మరి టీడీపీ?

pawankalyan-amithsha.jpg

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BREAKING న్యూస్‌. బీజేపీ-జనసేన కలిసి పోటీచేయబోతున్నాయి. బీజేపీ అగ్రనేత అమిత్‌షా కాషాయజెండా ఊపేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ని కూర్చోబెట్టి మాట్లాడి కలిసి పనిచేయాలని చెప్పారు. మరి ఇదే అవగాహన ఏపీలో కూడా ఉంటుందా అంటే.. దానికింకా ఐదారునెలల సమయం ఉంది. అప్పటికి రాజెవరో? రెడ్డెవరో? ప్రస్తుతానికైతే తెలంగాణలో రెండుపార్టీలు కలిసిపోటీచేయబోతున్నాయి. టీడీపీ ఎలాగూ తెలంగాణలో పోటీచేసే ఆలోచనలో లేదు కాబట్టి ప్రస్తుతానికి ఏ గొడవా లేనట్లే!

జనసేన పార్టీ పెట్టాక ఇది మూడో ఎలక్షన్‌. ఇంకా తెరవెనుకే ఉంటే తెరమరుగైపోతామని జనసేనకు అక్కడున్న ఒకటీ అరానేతలు చెప్పారు. జనసైనికుల మనోధైర్యం దెబ్బతింటుందని భావించారు. దీంతో ముందే ఇదిగో ఈ 32 సీట్లకీ పోటీచేయబోతున్నామని జనసేననుంచి ఓ అఫీషియల్‌ స్టేట్మెంట్‌ వచ్చేసింది. అసలే కాంగ్రెస్‌ దూకుడు మీదుంటే ఈ టైంలో పవన్‌కల్యాణ్‌ విడిగా పోటీచేస్తే కొంపలు మునిగిపోవూ! వెంటనే బీజేపీ నేతలు రంగంలోకి దిగి పవన్‌కల్యాణ్‌తో చర్చలు జరిపారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. అదెలా కుదురుతుందీ ఈసారి మేం కూడా పోటీచేస్తామని పవర్‌స్టార్‌ చెప్పేశారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు ప్రయత్నాలు చివరికి ఇదిగో ఇలా అమిత్‌షా డైరెక్షన్‌ ఇచ్చేదాకా వచ్చాయి.

గ్రేటర్‌ సిటీలో సీమాంధ్రప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉండే సీట్లతో పాటు సరిహద్దుల్లోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌లాంటి జిల్లాల్లో పోటీకి జనసేన ఆసక్తిచూపుతోంది. అయితే ఆ పార్టీ 32 సీట్లు ముందస్తుగానే ప్రకటిస్తే.. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అందులోని పది సీట్లున్నాయి. ఆ పది సీట్లజోలికెళ్లే పరిస్థితి లేనట్లే. సరే.. జరిగిందేదో జరిగిపోయింది ఆ ఫిగర్‌కి ఇంకోటి కలిపి ఓ 33 సీట్లు మాకిచ్చేయండంటోంది పవన్‌ పార్టీ. ఆశదోశ అప్పడం వడ. అడగ్గానే దాదాపు మూడోవంతు సీట్లు ఇచ్చేస్తారా ఏంటీ! తెలంగాణలో సింగిల్‌గా ముందుకెళ్లడం కష్టమని కమలం పార్టీకి అర్ధమైంది. తెలంగాణలో ఎలక్షన్‌ వార్‌ బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారిపోయింది. అందుకే జనసేకి ఏ పదో పదిహేనో ఇచ్చి కలిసిపోటీచేస్తేనే గుడ్డిలో మెల్లగానైనా ఉంటుందన్న ఆలోచనతో బీజేపీ నాయకత్వం ఉన్నట్లుంది.

అమిత్‌షాతో పవన్‌కల్యాణ్‌ భేటీ సందర్భంగా ఏపీగురించి ఏం మాట్లాడారన్న ఆసక్తి అందరికీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఏపీలో టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని పవన్‌కల్యాణ్‌ ఫిక్స్‌ అయ్యారు. చంద్రబాబుతో ములాఖత్‌లు, లోకేష్‌తో జాయింట్‌ మీటింగ్‌లు జరిగిపోతున్నాయి. మరి అక్కడకూడా బీజేపీతో పొత్తు ఉంటుందా అంటే అదిప్పుడే చెప్పలేం. అందుకే అమిత్‌షాతో మీటింగ్‌ కేవలం తెలంగాణ ఎన్నికలకే పరిమితమైంది. మరి తెలంగాణలో టీడీపీ మనసు మార్చుకుని పోటీకి సిద్ధమైతే ఆ పార్టీకూడా ఈ కాంబోతో కలిసొస్తుందా అంటే డౌటే. కిషన్‌రెడ్డిని అదే మాట అడిగితే జనసేన ఒక్కటే ఎన్డీయే భాగస్వామి అని, తమ చర్చలు అంతవరకే ఉంటాయని చెప్పేశారు.

తెలంగాణలో అసలే వెంటిలేటర్‌మీదున్న టీడీపీకి ఇది సంకటస్థితి. రేవంత్‌రెడ్డి సారధ్యంలోని టీకాంగ్రెస్‌ని గెలిపించేందుకు టీటీడీపీ ఎన్నికలకు దూరంగా ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎన్నికల్లో పోటీకి అధినాయకత్వం వెనక్కితగ్గితే కాసాని జ్ఞానేశ్వర్‌(టీటీడీపీ అధ్యక్షుడు) పార్టీ వీడతారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ-జనసేన మధ్య అవగాహన కుదిరాక తెలంగాణలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంటే అదో కొత్త సమస్య. పోటీకి దిగితే ఓట్ల చీలిక తప్పదు. ఎందుకొచ్చిన గోలని ఎన్నికలకు దూరంగా ఉంటే తెలంగాణలో పార్టీ ఉనికే పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం. అధినేత జైలుగోడలమధ్య మగ్గిపోతున్న సమయంలో పాపం టీడీపీకి ఇన్ని అగ్నిపరీక్షలేంటో!

Share this post

submit to reddit
scroll to top