కడిగిన ముత్యం. న్యాయం ముందు కుట్రలూ కుతంత్రాలు ఓడిపోయాయి. తండ్రికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని తెలియగానే నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ స్పందన ఇది. బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యం అయిపోరనేది ఫస్ట్ పాయింట్. ఇచ్చింది బెయిలేకానీ కేసులో నిర్దోషిగా తీర్పేమీ రాలేదు. కాబట్టి అభియోగాలను కుట్రలూ కుతంత్రాలని కొట్టిపారేయడానికి లేదు. మళ్లీ చంద్రబాబు నవంబరు 28న రాజమండ్రి జైల్లో లొంగిపోవాల్సి వస్తుందేమోనని ఆందోళనపడ్డ టీడీపీ శ్రేణులకు ఈ బెయిల్ వార్త పెద్ద ఊరటే.
ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. ఈ సమయంలో అభ్యర్థులపై కసరత్తు చేయాలి. జనసేనతో సీట్ల పొత్తుపై చర్చించాలి. అసమ్మతులు, కుమ్ములాటలు ఉన్న చోట పార్టీకి రిపేర్లు చేయాలి. తండ్రి జైల్లో ఉన్నా కొడుకు అన్నీ భుజాలకెత్తుకుంటాడన్న నమ్మకం నాయకులెవరికీ లేదు. నెలన్నర రోజుల్లోనే వారసుడి సమర్ధత అందరికీ తెలిసొచ్చింది. పాపం చంద్రబాబు సతీమణి సానుభూతికి ప్రయత్నించినా తండ్రి నాయకత్వపటిమ, భర్త రాజకీయ కౌటిల్యం ఆమెకు ఏమాత్రం ఒంటబట్టలేదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందుకే ఈ సమయంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ దొరకడంతో టీడీపీకి పోయినప్రాణం లేచొచ్చింది.
మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈనెల 28వరకే వర్తిస్తాయి. హైకోర్టే చెప్పింది ఈ విషయం. దీంతో 29నుంచి మళ్లీ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగాలను విని తరించే భాగ్యం ఏపీ ప్రజలకు దక్కబోతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిలొస్తే ఏంటి.. ఇంకా ఫైబర్‌నెట్, లిక్కర్‌పాలసీలాంటి కేసులున్నాయి కదా. ఏదో ఒక కేసులో మళ్లీ ఆయన్ని అరెస్ట్‌చేస్తారేమో! చంద్రబాబు బెయిల్ వార్తరాగానే ఇదే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు. నిప్పునని చెప్పుకునే నాయకుడు 55రోజులు రిమాండ్‌లో ఉండటమే ఓ సంచలనం. చట్టానికి చంద్రబాబు అతీతుడేం కాదన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడాయన్ని ఆగమేఘాలమీద మరో కేసులో అరెస్ట్‌చేయాల్సిన అవసరం ఉండదేమో!