ఏవయ్యా విశాలూ.. న్యాయంగా ఉందా?

vishal.jpg

కోట్లుకోట్లు పెట్టి సిన్మాలు తీస్తారే. హీరోలకు బ్లాకులో ఇంతా వైట్‌లో ఇంతా అని అడిగినంత ఇస్తారే. కత్తెర్లు చేతిలో పట్టుకుని వేళ్లు నొప్పిపుట్టేలా కత్తిరింపులు చేసే సెన్సారోళ్లు కాస్త చిల్లర అడిగితే ఇంత అల్లరి చేస్తావా? వాళ్ల బతుకు బజారుకీడుస్తావా? చేయిచాచే అవకాశం ఇవ్వకుండా రూల్స్‌ టైట్‌ చేయిస్తావా? ఎంతన్యాయం? ఎంత అధర్మం? సెన్సార్‌బోర్డులో పనిచేసేవారి స్వగతం ఇంచుమించు ఇప్పుడు ఇలాగే ఉంది. ఎందుకు కటింగ్‌లు చేస్తారో తెలీదు. కొన్ని సన్నివేశాలు, డైలాగుల్ని గుడ్డిగా ఎలా ఆమోదిస్తారో తెలీదు. పెత్తనమిచ్చారు. చేతికి కత్తెరలిచ్చారు. ఏదయినా వాళ్లిష్టం అంతే.

సిన్మాకి ఇన్ని కోట్లు పెట్టాక సెన్సారోళ్లకు ఆరేడు లక్షలంటే ఓ టిప్పు ఇచ్చినట్లే. కానీ ఎందుకివ్వాలి? ఎవరి డ్యూటీ వాళ్లు చేయాలి కదా. అందుకే హీరో విశాల్‌ అంత రచ్చ చేశాడు. అరిచి గీ పెట్టాడు. ఏమో ఎవరికిచ్చారో ఏమో చూస్కోండని బుకాయించిన నోళ్లు ఇప్పుడు తడబడుతున్నాయి. ఓ ప్రముఖుడి ఆరోపణతో ముంబై సెన్సార్‌బోర్డు వణికిపోతోంది. తన సిన్మా మార్క్‌ ఆంటోని హిందీ వెర్షన్‌ సెన్సార్‌ సర్టిఫికెట్‌కోసం ఆరున్నర లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్న విశాల్‌ ఆరోపణలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఆరోపణలు చేయడమే కాదు.. పక్కా ఆధారాలు బయటపెట్టాడు తమిళ్‌ హీరో.

సెన్సార్‌బోర్డు అధికారులు ప్రత్యక్షంగా లంచం తీసుకోలేదు. వసూలుచేసింది థర్డ్‌పార్టీ వ్యక్తులే. కానీ సెన్సార్‌బోర్డుతో లోపాయికారీ ఒప్పందంతోనే ఇదంతా జరిగింది. దీంతో ముగ్గురు బయటి వ్యక్తులతో పాటు సెన్సార్‌బోర్డులోని కొందరు అధికారుల మీద కూడా సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితుల ఇళ్లల్లో సోదాలతో మరికొన్ని ఆధారాలు దొరికాయి. సెన్సార్‌ విషయంలో బేరసారాలకు అవకాశం ఇవ్వకుండా ఇకనుంచి ఆన్‌లైన్‌లోనే సినిమాల సెన్సార్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సెంట్రల్‌ సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Share this post

submit to reddit
scroll to top