బీజేపీ కూడా అతీతమేం కాదు!

telangana-bjp-vijayasanthi-Etala-rajender.jpg

కాంగ్రెస్‌ అంటే గ్రూపుల గోల. మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకున్నా ఆ పార్టీలో క్రమశిక్షణారాహిత్యం ఎక్కువే. ఎవరు ఎవరిని ఏమన్నా అనొచ్చు. తమకు నచ్చింది చేయొచ్చు. ఎప్పుడో ఎక్కడో తప్ప పెద్దగా క్రమశిక్షణా చర్యలు ఉండవు. అందుకే ఇష్టమొచ్చినట్లు ఉందామనుకునే నాయకులకు కాంగ్రెస్‌ని మించిన పార్టీ మరోటి దొరకదు. రాద్ధాంతాలు ఉండని సిద్ధాంతాలపార్టీగా బీజేపీకో పేరుంది. అంటే అక్కడ ఎవరూ నోరెత్తరా అంటే గీటుదాటే నేతలు ఆ పార్టీలో తక్కువని ఒప్పుకోకతప్పదు. కానీ అధికారంలోకొస్తామని ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో దృశ్యం దానికి విరుద్ధంగా ఉంది. నాయకత్వాన్ని మార్చినా నేతల మనసులు కలవకపోవడంతో పబ్లిక్‌లో ఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోతోందన్న అభిప్రాయం పెరుగుతోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక బండి సంజయ్‌ స్పీడుకి బ్రేకుల్లేకుండా పోయాయి. సేమ్‌టైమ్‌ స్టేట్‌లో పార్టీకో ఊపువచ్చింది. అదే సమయంలో పాతకొత్త నేతల మధ్య పొరపొచ్చాలు పెరిగాయి. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిన నాయకుడు ఎంపీగా గెలవడమే కొన్నేళ్లక్రితం అందరినీ ఆశ్చర్యపరిస్తే.. ఆయన ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైపోవడం పాతకాపులకు మింగుడుపడలేదు. పాతవాళ్లేకాదు పార్టీలోకి కొత్తగా వచ్చిన ఈటలరాజేందర్‌లాంటి నాయకులు కూడా బండితో విభేదించటంతో పార్టీ పరిస్థితి మొదటికొచ్చింది. మధ్యేమార్గంగా చివరికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణపార్టీ పగ్గాలు అప్పగించి.. బండి సంజయ్‌కి పార్టీలో జాతీయపదవి ఇచ్చారు.

కిషన్‌రెడ్డి అయితే అంతా ఆమోదిస్తారని, పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నాయకుడికి వ్యతిరేకత ఉండదనుకుంది బీజేపీ జాతీయ నాయకత్వం. కానీ పార్టీలో కొందరు నేతల మధ్య మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. నిప్పులేనిదే పొగరాదన్నట్లు ఈటల రాజేందర్‌, విజయశాంతి మధ్య రాజకీయ రగడ మొదలైంది. ప్రత్యక్షంగా పేర్లు ఎత్తకపోయినా పరోక్షంగా వీరిద్దరి కామెంట్లు, కౌంటర్లతో తెరవెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయంతో ఉన్నాయి బీజేపీ శ్రేణులు. సొంత పార్టీ నేతలపైనే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీకి దూరంగా ఉన్నానన్న ప్రచారాన్ని విజయశాంతి ఖండించారు. చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు లేదని పరోక్షంగా ఈటలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీలోని కొందరు నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న రాములమ్మ.. ఆ కొందరు ఎవరన్నది మాత్రం పేరు చెప్పడంలేదు.

కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డిపై విజయశాంతి సంచలన ట్వీట్‌ చేశారు. తెలంగాణవాదాన్ని వ్యతిరేకించిన నేతలతో వేదిక పంచుకోలేనన్నట్లు మాట్లాడారు. ఈమధ్య సోనియాగాంధీని విజయశాంతి ప్రశంసించటంతో ఆమె బీజేపీని వీడతారన్న ప్రచారం ఎక్కువైంది. చిట్‌చాట్‌లు, లంచ్‌ సమావేశాలని విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఈటల రాజేందర్‌ గురించేనంటున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్నా ప్రజాస్వామ్య పంథాలో ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా గౌరవించడం పెద్దలు నేర్పిన సంస్కృతి అంటూ తన వ్యాఖ్యలను విజయశాంతి సమర్ధించుకున్నారు.

బండి సంజయ్‌ని రాష్ట్ర బాధ్యతలనుంచి తప్పించాక ఎన్నికలకమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కి బీజేపీ పెద్దపీట వేసింది. అప్పటిదాకా ప్రాధాన్యం లేదన్న అసంతృప్తితో ఉన్న ఈటల మనసు కుదుటపడ్డా..ఆయనకు అంత ప్రాధాన్యం ఇవ్వడం పార్టీలోనే కొందరికి రుచించడంలేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ప్రచారకమిటీ చైర్మన్‌గా ఉన్న విజయశాంతి బీజేపీలో తనకు గుర్తింపులేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఈటలలాంటి నేతలకు పెత్తనమివ్వడమే కాకుండా.. సిన్సియర్‌గా ఉన్న తనలాంటి నేతలపై బురద చల్లుతున్నారన్న అసహనంతో రాములమ్మ రగిలిపోతున్నారు. అందుకే తిట్లకు తీసిపోని ఈ ట్వీట్లు. ఓ పక్క తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్‌పెంచితే బీజేపీలో సీన్‌ ఇలాగే ఉంటే ఏమవుతుందో పార్టీ పెద్దలకు తెలీదా!

Share this post

submit to reddit
scroll to top