మణిపూర్‌.. మరీ అంత రహస్యమా!

manipur-cm-birensingh.jpg

అక్కడేం జరుగుతోందో బయటికి ప్రపంచానికి తెలియడంలేదు. కీలక నిర్ణయాలు కూడా బయటికి పొక్కడంలేదు. సీక్రెట్‌ ఆపరేషన్‌లా చడీచప్పుడు లేకుండా తాను చేయాలనుకుంది చేసుకుంటూ పోతోంది కేంద్రప్రభుత్వం. మణిపూర్‌లో ఆర్టికల్‌ 355 అమల్లోకి వచ్చింది. మీటింగ్‌కొచ్చాక ముఖ్యమంత్రి చెప్పాకే మిగతా పార్టీలకు ఆ విషయం తెలిసింది. జాతుల మధ్య వైరంతో మణిపూర్‌ అట్టుడికింది. రిజర్వేషన్ల విషయంలో రెండువర్గాల మధ్య గొడవతో మణిపూర్‌ మంటల్లో చిక్కుకుంది. కుకీ, మైతేయిల ఘర్షణతో పోయినేడాది మేలో చెలరేగిన హింస ఆరనిమంటలా ఇంకా రగులుతూనే ఉంది.

రెండు తెగల ఘర్షణతో మణిపూర్‌లో జరిగిన మారణహోమం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. అక్కడ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో విపక్షపార్టీలు విరుచుకుపడ్డాయి. కేంద్రం కూడా మణిపూర్‌ విషయంలో ఇరుకునపడాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలనకు విపక్షపార్టీలు డిమాండ్‌ చేసినా పరిస్థితులు అదుపులో ఉన్నాయని కేంద్రం దాటవేసింది. మణిపూర్‌ అల్లర్లలో 175 మంది చనిపోయారనేది అధికారిక లెక్క. గల్లంతైన కొందరి జాడ ఇప్పటికీ లేదు. అక్కడి హింసాత్మక ఘటనలపై 6వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, సిట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న మణిపూర్‌ ఇప్పటికీ భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా అక్కడ ఉద్రిక్తత మాత్రం తగ్గడంలేదు. పోలీసు బలగాలు కూడా అల్లరి మూకలకు లక్ష్యమవుతున్నాయి. గ్రామాలపై మూకదాడులు జరుగుతున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అనివార్యమయ్యేలా ఉంది. ఆర్టికల్‌ 355 అమలులో ఉందని మణిపూర్‌ సీఎం సీఎం బీరేన్ సింగ్ ప్రకటించారు. ఇంఫాల్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ఆర్టికల్‌ అమలుతో రాష్ట్రంలో శాంతిభద్రతలను కేంద్రం తన చేతిలోకి తీసుకుంది.

మణిపూర్‌లో ఆర్టికల్‌ 355 అమల్లో ఉన్న విషయాన్ని సీఎం బీరేన్‌సింగ్‌ ఇంత ఆలస్యంగా చెప్పడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఆర్టికల్‌ 355 అమల్లోకి రావడం అంటే రాష్ట్రపతి పాలనకు ఓ రకంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే. మణిపూర్‌లో భారీగా భద్రత బలగాలను మోహరించడం అందుకు సంకేతమా అనే చర్చ జరుగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయలేకపోయామన్న అపనిందలు రాకుండా సైలెంట్‌గా తన పని చేసుకుపోతోంది కేంద్రం. రాష్ట్రప్రభుత్వం ఓ వర్గం కొమ్ము కాస్తుందన్న అనుమానాలున్నాయి. కనీసం రాష్ట్రపతి పాలన పెడితే శాంతిభద్రతలు కేంద్రబలగాల చేతుల్లోకి వెళ్తాయి. అదేమంచిదనుకుంటున్నారు మణిపూర్‌ వాసులు కూడా.

Share this post

submit to reddit
scroll to top