చంద్రయాన్-3 విజయవంతం తరువాత సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్ -1 లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. వ్యోమనౌక భూమి నుంచి 9లక్షల 20 వేల కిలోమీటర్లు దాటినట్లు ఇస్రో ప్రకటించింది. భూమి గురుత్వాకర్షణ పరిధి నుంచి ఆదిత్య విజయవంతంగా బయటపడింది. ఒక వ్యోమనౌక భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి వెళ్లటం ఇది రెండోసారి.
గతంలో అంగారకుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ మొదటిసారి భూ గురుత్వాకర్షణ ప్రభావం దాటి పయనించింది. మరో 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తే వ్యోమనౌక విజయవంతంగా లాగ్రాంజ్ పాయింట్‌కు చేరినట్లేనని ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలో ప్రత్యేకమైన ప్రదేశాలుగా చెప్పే లాగ్రాంజ్ పాయింట్లలో భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ తిరగడానికి అది అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ ఇంధనం తక్కువ ఖర్చవుతుంది.
ఆదిత్య ఎల్1 సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాలను అధ్యయనం చేయనుంది. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలని పరిశోధిస్తుంది. లాగ్రాంజ్ పాయింట్-1 నుంచి ఈ ఉపగ్రహం సూర్యుడిని ఐదేళ్లపాటు డేగ కళ్లతో అధ్యయనం చేస్తుంది. ఇందులోని మొత్తం ఏడు పేలోడ్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ఐదు పేలోడ్‌లను ఇస్రో, మరో రెంటిని దేశంలోని విద్యా సంస్థల సహకారంతో రూపొందించారు.
ఇప్పటిదాకా అమెరికా, జపాన్, యూరప్, చైనా మాత్రమే సూర్యుడిపై అధ్యయనానికి ఉపగ్రహాన్ని పంపాయి. వాటి తర్వాత ఆ ఘనత సాధించిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. సెప్టెంబరు 2న శ్రీహరికోట సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 125 రోజుల ప్రయాణం తర్వాత 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుతుంది. ప్రయోగం తర్వాత 16 రోజుల పాటు భూకక్ష్యలో ఉన్న ఈ ఉపగ్రహం ఐదు దశల్లో కక్ష్య పెంపు తర్వాత నిర్దేశిత లాగ్రాంజ్ పాయింట్ 1 వైపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది.