జ‌స్ట్ శాంపిల్‌.. HMDA క‌థ ముందుంది!

Hmda-Former-Director-Balakrishna.jpg

తీగలాగడం మొదలైంది. ఇక డొంకంతా కదులుతుంది. జస్ట్‌ అలా వల విసరగానే విపరీతంగా తినేసి ఒళ్లుతెలీని మ‌త్తులో ఉన్న పెద్ద తిమింగలమే పెడింది. రెరా, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో దాదాపు రూ.500 కోట్ల అక్రమ సంపాదన బట్టబయలైంద‌ని తెలిసి అంతా గుడ్లు తేలేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల ఆస్తి పత్రాలదాకా దొరికాయంటున్నారు. మొత్తం లెక్కింపు పూర్తయితే ఆయన ఆస్తి ఎందాక వెళ్తుందో తెలీదు. జస్ట్‌ కాస్త ఫైళ్లు కదిపేందుకు, పర్మిషన్లు ఇచ్చేందుకే ఇంత వెనకేశాడంటే.. పదేళ్లలో హైదరాబాద్‌లో భూములు, భవనాల కబ్జాలు, క్రమబద్ధీకరణలతో అధికారపార్టీలో ప్రముఖుల అరాచకాలు ఎన్ని వేల కోట్లు ఉండుంటాయో ఊహించడం కూడా కష్టమే!

హైదరాబాద్‌ని ప్రపంచపటంలో నిలబెట్టానంటుంది బీఆర్‌ఎస్‌. కానీ కాంగ్రెస్‌ సీఎం అనుముల రేవంత్‌రెడ్డి మాటల్లో చెప్పాలంటే హైదరాబాద్ నగరాన్నే బీఆర్‌ఎస్‌ కబ్జా చేసింది. రెరా సెక్రటరీ బాలకృష్ణ అరెస్ట్‌తో ఏదీ ఆగదు. దాచాలన్నా దాగదు. రెరా అనకొండ అవినీతి పుట్టను బద్దలు కొట్టడమే కాదు ఆయన అండతో జరిగిన అన్ని బాగోతాలను బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఏసీబీది. వైఫల్యాలు, కుంభకోణాలు అన్నీ లెక్కేస్తే తెలంగాణ సమాజం పదేళ్లలో ఎన్ని లక్షల కోట్లను కోల్పోయి ఉంటుందో అంచ‌నా వేయ‌లేం. సంపదను సృష్టించామని చంకలు గుద్దుకుంటున్న ప్రబుద్ధులు ప్రజల కళ్లకు గంతలు కట్టి ఎన్ని వేలకోట్లు వెనకేసుకున్నారో వారికే ఎరుక‌!

దగాపడ్డ తెలంగాణను భద్రంగా కాపాడతారనుకుంటే కుక్కలు చింపిన విస్తరిని చేశారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న‌ట్లు స్వలాభం చూసుకున్నారు. నమ్మి గద్దెనెక్కించినందుకు ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. ఇప్పుడు ఎన్ని అక్రమాలు బయటపడ్డా చేసేదేముంది. స్వాతంత్య్ర పోరాట‌యోధుల్లా అవ‌స‌ర‌మైన జైళ్ల‌కైనా వెళ్లి జ‌బ్బ‌లు చ‌రుచుకోగ‌ల‌రు. ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నెలరోజుల్లోనే ఉక్రోషంతో రంకెలేస్తోంది బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకత్వం. పెద్దాయన నోరు విప్పలేదనేగానీ పట్టాభిషేకం జరగకుండానే అధికారం కోల్పోవాల్సి రావటంతో మాజీ యువరాజు అసహనంతో ఊగిపోతున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, అదిగదిగో సింహం వస్తోందంటూ నానా కంగాళీ చేస్తున్నారు.

ఢిల్లీలో తెలంగాణవాదాన్ని కాపాడగలిగేది ఒక్క కేసీఆర్‌ పార్టీనేనట. పార్టీ పేరులోనే తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయాక ఇంకా ఈ మాటల్ని ఎవరు నమ్ముతారని. జాతీయ స్థాయిలో ఒక్క‌రంటే ఒక్కరైనా పాపం కేసీఆర్ పార్టీకి ఎందుకిలా జరిగిందని సానుభూతి చూపిస్తున్నారా? ఇంటిగడప తొక్కినా తలుపు తీసేవాళ్లున్నారా? చేసుకున్నపాపం ఊరికే పోతుందా. అరాచకం పెచ్చుమీరినప్పుడు ప్రకృతి సహజంగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఇకపై అదే జరగబోతోంది.

Share this post

submit to reddit
scroll to top