రేవంత్‌ సరిగ్గా సరిపోయాడు!

revanthreddy-kcr.jpg

తెలంగాణ కాంగ్రెస్‌ని రేవంత్‌రెడ్డికి ముందూ తర్వాతని చెప్పుకోవాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే ఏపీలో పార్టీమీద ఆశలొదిలేసుకుని మరీ ప్రత్యేకరాష్ట్రాన్ని ప్రకటించింది కాంగ్రెస్‌పార్టీ. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదు. సరే అప్పుడంటే కేసీఆర్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు కాబట్టి అధికారపీఠం దక్కలేదనుకోవచ్చు. 2018 ఎన్నికల్లోనూ పార్టీని లేపలేకపోయింది అప్పుడున్న నాయకత్వం. 2023 ఎన్నికల ముందు సీన్‌ మారింది. అంతా ఒక్కడై కాంగ్రెస్‌ ప్రచారాన్ని నడిపిస్తున్నాడు టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ పటాలమంతా తెరపైకొచ్చినా నేనొక్కడినీ చాలన్నట్లు అధికారపార్టీ విమర్శల్ని తిప్పికొడుతున్నాడు.

రేవంత్‌ని తలుచుకోకుండా కేసీఆర్‌ ప్రచారం సాగడం లేదు. కాంగ్రెస్‌ని నమ్మొద్దని చెప్పేందుకు ఇందిరాగాంధీ నుంచి రాహుల్‌గాంధీదాకా మూడు తరాల గురించి పలవరిస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఎలక్షన్లనాటికి కాంగ్రెస్‌ అడ్రస్‌ ఉండదనుకున్న బీఆర్ఎస్‌కి ఇప్పుడా పార్టీనే భయపెడుతోంది. కాంగ్రెస్‌ వస్తే కరెంటుండదు, ఇప్పుడిస్తున్న స్కీములు ఉండవంటూ కేసీఆర్‌ సహా బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలంతా ప్రచారంలో మైకులు మోగేలా చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి ఓటుకునోటు కేసులో జైలుకు పోయొచ్చిన క్రిమినల్‌ అంటున్నారు. కాంగ్రెస్‌ వస్తే ఆరు గ్యారంటీల సంగతేమోగానీ ఆరుగురు సీఎంలు మారతారని ప్రచారం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లా కాదు మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని తిప్పికొడుతున్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌లా ఒక్కరే కాదు కాంగ్రెస్‌లో సీఎంలు కాగల నేతలు పదిమంది ఉన్నారంటున్నారు. ఈమధ్య కాలంలో కాంగ్రెస్‌ తన పాలిత రాష్ట్రాల్లో సీఎంలను మార్చలేదని చెబుతున్నారు. ఒకవేళ మార్చినా తప్పేంటని గట్టివాదన వినిపిస్తున్నారు. కేసీఆర్‌ ఎవరినీ ప్రలోభపెట్టకుండానే, ఏమీ ఇవ్వకుండానే అంతమంది ఎమ్మెల్యేలు ఆయనపార్టీలోకి ఫిరాయించారా అని ప్రశ్నిస్తూ.. తన ఓటుకునోటు కేసు పెద్ద అంశమే కాదని రేవంత్‌రెడ్డి తేల్చేస్తున్నారు.

కాంగ్రెస్‌లోని మిగిలినముఖ్య నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమైతే రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతున్నారు. తనే పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా మారిపోయాడు. కాంగ్రెస్‌కి 20 సీట్లకు మించి రావంటూ కేసీఆర్‌ కొత్త పల్లవి మొదలుపెట్టారు. దానికి కూడా రేవంత్‌రెడ్డినుంచి గట్టి రియాక్షన్‌ వస్తోంది. 80సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదని రేవంత్‌ తొడగొడుతున్నారు. 80 సీట్లకు తగ్గితే దేనికైనా రెడీ అంటూ బీఆర్‌ఎస్‌ ప్రచారాన్నితిప్పికొడుతున్నారు. బోధన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తమీద పోలీసులు లాఠీచార్జి చేస్తే.. డిసెంబరు 9 తర్వాత నీ సంగతి చూస్తానంటూ రేవంత్‌రెడ్డి ఏసీపీకి వార్నింగ్‌ ఇస్తున్నాడంటేనే అర్ధమైపోవడంలేదూ.. ఆ పార్టీ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో!

Share this post

submit to reddit
scroll to top