మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అంటూ ప్రతిపక్షం, మంచోడు కావాలి ముంచేవాడు కాదంటూ అధికారపక్షం. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఎన్నో పాటలూ పేరడీలు, ఆత్మస్తుతులూ పరనిందలూ. అన్నీచూశారు జనం. ప్రచారపర్వం ముగియటంతో అందరి నోళ్లకీ తాళాలు పడ్డాయి. రాజకీయ రణగొణ ధ్వనుల నుంచి జనం కాస్త తేరుకున్నారు. మళ్లీ డిసెంబరు 3న గెలిచినోళ్ల విజయోత్సవ ర్యాలీల తర్వాతే ఏ మైకుల మోతలయినా.
మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తరహా ప్రచారం మునుపెన్నడూ లేదు. ఇక్కడి ప్రజలు చూడలేదు. యాడ్స్‌తో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ఊదరగొట్టేశాయి. పాపం బీజేపీ పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనేనన్నట్లుంది. బీఆర్ఎస్-కాంగ్రెస్ ప్రచార హోరులో కమలంపార్టీ ప్రచారం పెద్దగా ఎవరికీ ఎక్కలేదు. ప్రచారంలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకబడ్డారన్న చర్చను తీసుకుంటే అధికారపార్టీగా బీఆర్ఎస్ ఆ అడ్వాంటేజ్ తీసుకున్నా.. ఆ ప్రచారంలో ఎందుకో దమ్ము కనిపించలేదు.
పదేళ్లు అధికారంలో ఉన్నపార్టీ చేసింది చెప్పుకోవాలి. చెప్పనివి కూడా చేసి ఉండాలి. కానీ కేసీఆర్ పార్టీ ప్రచారమంతా నెగిటివ్ ధోరణిలోనే సాగింది. కాంగ్రెస్‌ని విమర్శించే క్రమంలో ఆ పార్టీ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విపరీతంగా ప్రచారం చేసింది. కర్నాటకలో హామీ నిలబెట్టుకోలేదన్న విమర్శలపైనే గురిపెట్టింది తప్ప… ఆర్నెల్లక్రితం అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ని విమర్శించడం వల్ల తన డొల్లతనం బయటపడుతుందని ఆ పార్టీ ఎందుకో గ్రహించలేకపోయింది.
వరిసాగులో దేశంలోనే నెంబర్‌వన్ అని చెప్పుకున్న బీఆర్ఎస్ ఈ పదేళ్లలో తనకు మైల్‌స్టోన్‌గా నిలిచే ఒక్క ప్రాజెక్టు గురించి కూడా గొప్పగా చెప్పలేకపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటంతో కాళేశ్వరం గురించి ప్రస్తావించే ధైర్యంచేయలేకపోయింది. దశాబ్దాల కిందట కట్టిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఉక్కు కట్టడాల్లా అలాగే ఉన్నాయని కాంగ్రెస్ చాటిచెబుతూ కాళేశ్వరం వైఫల్యాన్ని గట్టిగానే జనంలోకి తీసుకెళ్లగలిగింది. ఇక ఈ ఏడాది కాలంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీలు, వాయిదాపడ్డ ఉద్యోగ నియామకాలు, ప్రవల్లిక ఆత్మహత్యలాంటి సంఘటనలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది.
పాజిటివ్ ఓటుకోసం కాకుండా కాంగ్రెస్‌కి వ్యతిరేకప్రచారంపైనే బీఆర్ఎస్ తన శక్తులన్నీ పెట్టింది. ఓపక్క కాంగ్రెస్ దొరలపాలననీ, కుటుంబపాలననీ ప్రచారంచేస్తుంటే బీఆర్ఎస్ ప్రచారం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుల చుట్టే తిరిగింది. చివరికి కవితమ్మ కూడా వచ్చిచేరింది. ఇందిరమ్మ రాజ్యం లోటుపాట్ల గురించీ, అప్పుడెప్పుడో జరిగిన మతకల్లోలాల గురించి బీఆర్ఎస్ గొంతు చించుకున్నాజనంలోకి ఆ ప్రచారం పెద్దగా వెళ్లలేదు. 11సార్లు అధికారమిస్తే కాంగ్రెస్ ఏం చేసిందని బీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రశ్నించినా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఏంటన్నదానిపైనే ప్రజల దృష్టి ఉంది.
బీఆర్ఎస్ ఆరోపణలను బలంగా తిప్పికొట్టటంలో కాంగ్రెస్ చాలావరకు సఫలమైంది. చివర్లో రైతుబంధు కాంగ్రెస్ వల్లే ఆగిందన్న ప్రచారానికి కూడా విపక్షపార్టీనుంచి గట్టి కౌంటరే పడింది. హరీష్‌రావు అత్యుత్సాహం వల్లే అసలుకే మోసం వచ్చిందని కాంగ్రెస్ ప్రజలకు చెప్పగలిగింది. అన్నిటికీ మించి కేసీఆర్ ప్రసంగాలు మూస ధోరణిలో సాగడం బీఆర్ఎస్ క్యాంపెయిన్‌కి పెద్ద మైనస్. ఒకప్పుడు కేసీఆర్ మైక్ పడితే పంచ్‌లే పంచ్‌లు. చెవులు రెక్కించి రెప్పవాల్చకుండా చూసేవారు. కానీ అధినేత ఎందుకో ఆత్మరక్షణలో పడ్డట్లే కనిపించింది. బీఆర్ఎస్ ప్రకటనల్లో కేసీఆర్ కుటుంబం హైలైట్ అయితే కాంగ్రెస్ యాడ్స్ రేవంత్, భట్టి విక్రమార్కలను బ్యాలెన్స్ చేశాయి.
కేసీఆర్ అవిశ్రాంతంగా 96 బహిరంగసభల్లో పాల్గొన్నారు. అధికారపార్టీ ప్రచారం చివరికి.. అభ్యర్థులను చూసి కాదు కేసీఆర్‌ని చూసి ఓటెయ్యండనే దాకా వెళ్లింది . ఒక్కోరోజు గడిచే కొద్దీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో బీఆర్ఎస్‌కి అర్ధమైంది. కానీ చేయగలిగిందేమీ లేదు. మళ్లీ వస్తే మరింత మెరుగ్గా పాలిస్తామని చెప్పుకోవడం తప్ప మరో ఆప్షన్‌లేకుండా పోయింది. ఇక అగ్రనేతలే నీరసపడేసరికి అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి అయితే విజయయాత్రో, శవయాత్రనో ప్రజలే తేల్చాలని ప్రచారంలోనే చెప్పేశాడు. ప్రజలు గెలిపించకపోతే భార్యాబిడ్డలతో సామూహిక ఆత్మహత్య చేసుకుంటాడట. హతవిధీ.. ఒకప్పుడు ఎట్లుండె బీఆర్ఎస్ (పాత TRS)!