పాదధూళికోసం ప్రాణాలు ఫణం!

Hathras.png

ఈ చోటి కర్మ ఈ చోటే..
ఈనాటి కర్మ మరునాడే
అనుభవించి తీరాలంతే..
ఈ సృష్టి నియమం ఇదే!
అవును చేసిన పాపకర్మాలే ఎవరికైనా తోడొస్తాయి. తాయెత్తు మహిమలతోనో, స్వామీజీల పాదధూళితోనో జీవితాలు పునీతమైపోవు. సాధారణ మనుషులు దైవాంశ సంభూతులైపోవడం మనదగ్గర మాత్రమే కనిపించే ప్రపంచ వింత. నమ్మకం.. గుడ్డి నమ్మకం. ఆ నమ్మకమే ఆశ్రమాలకు పునాదులేస్తోంది. ఆ నమ్మకమే నాలుగు మాయమాటలు నేర్చినవారి కాళ్లు మొక్కేలా చేస్తోంది.

సరే ఎవరి నమ్మకం వారిది. ఎవరిష్టం వారిది. ఎవరి నమ్మకాల్ని తప్పుపట్టాల్సిన పనిలేదుగానీ.. ఆ నమ్మకం అమాయకుల పాలిట మృత్యుపాశమైతే ప్రశ్నించాల్సిందే. ఈ దేశంలో బాబాలకు కొదవేలేదు. తొక్కుడు బాబా, తన్నుడు బాబా, తడుముడు బాబా, చెడుగుడు బాబా. యూపీలో నూటపాతికమంది ఉసురుపోసుకున్న బాబాని నీళ్లబాబా అనాలో, ధూళిబాబా అనాలో! ఎందుకంటే ఆ మహానుభావుడు తన చేత్తో నీళ్లిస్తే జన్మ ధన్యమైపోతుందని జనం నమ్మకం. ఆయనగారు పాదం మోపినచోట మట్టిని తాకినా స్వయానా ఆ భగవంతుడే అనుగ్రహించినట్లు! ఆ పాద ధూళి కోసం ఎగబడిన అమాయకులు దురదృష్టవశాత్తూ అదే మట్టిలో కలిసిపోయారు.

యూపీలోని హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌ ప్రాంగణం మరుభూమిగా మారిపోయింది. కానీ ఆ బాబా ఒంటికి మట్టికూడా అంటకుండా అక్కడినుంచి జారుకున్నాడు. ఇంటలిజెన్స్‌ విభాగంలో 18ఏళ్లు పనిచేశానని చెప్పుకునే సూరజ్‌ పాల్‌ తర్వాత వీఆర్‌ఎస్‌ తీసుకుని జనం అమాయకత్వమే పెట్టుబడిగా బాబా అవతారమెత్తాడు. పూర్వాశ్రమంలో మహిళల్ని లైంగికంగా వేధించారన్న గొప్పపేరు కూడా ఉందాయనకి. కొన్నాళ్లు చిప్పకూడు తిని బయటికొచ్చాక ఆయన పేరు ‘సాకార్‌ విశ్వ హరి బాబా’గా మారిపోయింది. ప్రతీ మంగళవారం సత్సంగ్‌లో ఆయన ప్రబోధనలు వినడానికి, ఆయనగారి ఆశీస్సులు పొందడానికి వేలమంది వస్తుంటారు. యూపీతో పాటు ఐదారు రాష్ట్రాల్లో ఆయనకు లక్షలమంది అనుచరులున్నారు.

తెల్లటి సూట్‌ ధరించి నెత్తిన టోపీ, పక్కన సహధర్మచారిణితో దర్శనమిచ్చే ఈ బాబా పేరు కోవిడ్‌ టైంలో కూడా దేశమంతా వినిపించింది. సత్సంగ్‌కి 50మంది వస్తారని అనుమతి తీసుకుంటే.. మహమ్మారిని కూడా లెక్కచేయకుండా 50వేల మంది రావడం అప్పట్లో వివాదాస్పదమైంది. హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీలో సత్సంగ్‌ కార్యక్రమానికి 80వేల మందికి పోలీసులు పర్మిషన్‌ ఇచ్చారు. కానీ దానికి దాదాపు మూడురెట్ల మంది వచ్చిపడ్డారు. గంటన్నరపాటు ప్రవచనాలు చెప్పి బాబా అక్కడినుంచి వెళ్లిపోగానే ఆయన వెళ్లినదారిలోని మట్టికోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పక్కోడి ప్రాణాలు పోతేనేం..మనం పుణ్యం మూటగట్టుకోవాలనే స్వార్థపు ప్రపంచం ఇది. కండబలం ఉన్నోళ్లు తోసుకుంటూనో తొక్కుకుంటూనో బయటపడ్డారు. కానీ నిస్సహాయులైన మహిళలు, పిల్లలు మానవత్వం లేని మనుషుల పాదాలకింద నలిగిపోయారు. ఇది మహావిషాదం. సన్నాసులు, బాబాలను ప్రోత్సహించే పాలకుల పాపం. ఇందులోనూ కుట్రకోణం వెతుకుతున్నాడు యోగీబాబా. ఆయన దృష్టిలో అది ఉగ్రవాదుల దుశ్చర్యేమో! ప్చ్‌.. ఏం చేస్తాం!

 

Share this post

submit to reddit
scroll to top