డబ్బు బలుపు కసితీరా ఎక్సలేటర్ తొక్కింది. రోడ్డుమీద మనుషులు దోమల్లాగో చీమల్లాగో కనిపించారు వాడికి. నా కారొస్తుంటే తప్పుకోడం తెలీదా అన్నట్లు తొక్కేసి వెళ్లిపోయాడు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ టెక్కీలిద్దరు రక్తపుమడుగులో ప్రాణాలొదిలారు. కారునుంచి జనం బయటికి లాగి నాలుగుపీకాకగానీ వాడి నిషా కాస్త దిగలేదు. నూనూగు మీసాల పిల్లోడు కదా.. మైనర్ అన్న రక్షణ ఉంది. ఏంట్రా బాబూ ఇది తప్పు కదూ అంటూ క్లాసు పీకిన కోర్టు బెయిలిచ్చింది. ఏదో వ్యాసంకూడా రాయమన్నట్లుంది. వాడు బయటికొచ్చి కాలరెగరేశాడు. మనల్ని ఎవడ్రా ఆపేది అనుకుంటూ తన అనుభవంమీద ఓ ర్యాప్ వీడియో కూడా వదిలాడు. అబ్బే మా అబ్బాయి నోట్లో వేలుపెడితే కొరకలేడని, ఆ వీడియో తనదికాదని తల్లి ఖండించిందనుకోండి. ఎంతైనా పేగుబంధం కదా.. వేరేవాళ్లని చంపేసినా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలనే ఉంటుంది పాపం!
అడిగేదెవరన్న బలుపు రోడ్డెక్కితే ఎలా ఉంటుందో పుణె సంఘటన ఓ నిదర్శనం. అయ్య సంపాదించిపెట్టాడని తెగబలిసినవాళ్లంతా ఇలా అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్డుమీద పడితే చేసేదేముంది? 17ఏళ్ల కుర్రాడు ఫ్రెండ్స్‌తో తప్పతాగి తన ఖరీదైన కారులో దూసుకుపోతుంటే ఈ దేశంలో ఎవరి ప్రాణాలకు మాత్రం ఏం గ్యారంటీ ఉంది. జనం తిరగబడ్డాకగానీ చట్టానికి తన బాధ్యత గుర్తుకురాలేదు. కొడుక్కి బండిచ్చిన తండ్రి అరెస్ట్. నేరాన్ని నెత్తినవేసుకోమని డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చిన తాతా అరెస్ట్. మైనరొచ్చి కూర్చోగానే కిక్కెక్కేలా తాపించిన బార్ల ఓనర్ల అరెస్ట్. అక్కడితోనే ఆగలేదు. అబ్బే.. ఆ కుర్రోడి రక్తంలో ఆల్కహాల్ లేదంటూ తప్పుడు ధృవీకరణ ఇచ్చిన ఇద్దరు డాక్టర్లు కూడా అరెస్ట్.
ఈ పుణె బలుపుగాడికి దేశంలో చాలా సంఘటనలు స్ఫూర్తినిచ్చి ఉంటాయేమో. రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల్ని తన వాహనంతో తొక్కుకుంటూ వెళ్లిపోయాడు ఓ కేంద్రమంత్రి కొడుకు. కండలవీరుడు సల్మాన్‌ఖాన్ అప్పుడెప్పుడో ఫుట్‌పాత్‌మీద పడుకున్నవాళ్లమీద కారెక్కించేశాడు. దేశరాజధానిలోనే ఆ మధ్య ఓయువతిని కారుతో గుద్దేసి 13కిలోమీటర్లు విగతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు బలుపుగాళ్లు. అంతకుముందు అదే ఢిల్లీలో రోడ్డుదాటుతున్న ఓ వ్యక్తిని ఒళ్లు తెలీని స్పీడ్‌తో వచ్చి గుద్ది చంపేశాడు మరో డబ్బుగాడు. దేశంలో ఇలాంటి హిట్ అండ్ రన్‌లెన్నో. పుణె ఘటనలో కూడా కారు ఆగిపోయిందికాబట్టి దొరికిపోయాడుగానీ.. లేకపోతే ‘గుర్తుతెలియని’వాహనంగానే యాక్సిడెంట్ కేసు నీరుగారిపోయుండేదేమో! ఈ బలుపుగాళ్లంతా తమ పుత్రరత్నాల కోసం తమ కుటుంబంతప్ప మరొకరు ఉండని ఏ దీవులనో కొనుక్కుని బట్టలిప్పి బజార్న పడ్డా ఎవరికీ అభ్యంతరం ఉండదు.