ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారత్ మధ్య చిచ్చు రేపింది. జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంటులోనే మనపై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత అధికారిని కెనడా బహిష్కరించడంపై సీరియస్‌గా స్పందించింది మన దేశం. జస్టిన్ ట్రూడో ఆరోపణల్లో నిజంలేదని ఖండించింది. భారత్‌లోని కెనడా హైకమిషనర్‌ని పిలిపించింది. ఆ దేశ సీనియర్ దౌత్యాధికారిని దేశం నుంచి బహిష్కరించి కెనడాకి భారత్ గట్టి జవాబిచ్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిన కెనడాతో భారత్ బంధం కొన్నాళ్లుగా బలహీనపడుతూ వస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాద సమస్యని కెనడా పరిష్కరించటంలేదన్న అసంతృప్తితో మన దేశం ఉంది. జీ20 సదస్సుకు భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోతో దీనిపై గట్టిగానే మాట్లాడారు ప్రధాని మోడీ. కానీ ఇక్కడినుంచి వెళ్లిన వారంలోపే భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణలు గుప్పించారు. కెనడా ప్రధానిని కూడా నియంత్రిస్తున్న ఖలిస్తాన్ ఉద్యమానికి పెద్ద చరిత్రే ఉంది. స్వాతంత్ర్యానంతరం దేశవిభజన కోసం హింస చెలరేగింది. ముస్లింలు పాకిస్తాన్ దేశాన్ని కోరుకున్నట్లే సిక్కులు కూడా ప్రత్యేక దేశం కావాలని చేపట్టిన ఉద్యమమే ఖలిస్తాన్!
1970లో మొదలైన ఖలిస్తాన్ ఉద్యమం 70, 80 దశకాల్లో ఉగ్రరూపం దాల్చింది. హింసాత్మకంగా మారిన ఉద్యమాన్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. ప్రత్యేక దేశం కోసం హింసాత్మక ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు ఖలిస్తాన్ ఉగ్రవాదులు. కెనడాలో హత్యకు గురైన హర్దీప్‌సింగ్ నిజ్జార్ జలంధర్‌లోని భర్‌సింగ్‌పురా గ్రామానికి చెందినవాడు. 1997లో పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లాడు. అక్కడ ఫ్లంబర్‌గా జీవితాన్ని ప్రారంభించి సిక్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద గ్రూపుకి నాయకత్వం వహించేదాకా ఎదిగాడు. 2007లో పంజాబ్‌లోని లూథియానాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిజ్జార్ మోస్ట్ వాంటెడ్. 2010 పాటియాలా బాంబు బ్లాస్ట్ కేసులోనూ అతను నిందితుడు. 2015లో నిజ్జార్ కోసం ప్రభుత్వం లుకౌట్ నోటీసులు, 2016లో రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది.
నిజ్జార్ ఉగ్రవాదంపై కెనడాని భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంచేస్తూ వచ్చింది. 2018లో అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వాంటెడ్ లిస్టును కెనడా ప్రధాని ట్రూడోకి అందించారు. ఆ జాబితాలో నిజ్జార్ పేరు కూడా ఉంది. 2022లో నిజ్జార్ తలకు 10లక్షల రివార్డు ప్రకటించింది మన జాతీయ దర్యాప్తు సంస్థ. కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో భారత దౌత్య కార్యాలయాలపై దాడుల వెనుక నిజ్జార్ ఉన్నాడన్న అనుమానాలున్నాయి. ఈ ఏడాది జూన్ 18న కెనడాలో నిజ్జార్‌ని దుండగులు కాల్చిచంపటంతో ఖలిస్తానీ వేర్పాటువాదులు మరింత రెచ్చిపోయారు. వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికో, వారినుంచి తన కుర్చీకి ముప్పులేకుండా చూసుకోడానికో ఏకంగా భారత్‌పైనే నిందలు వేయడానికి తెగబడ్డాడు కెనడా ప్రధాని ట్రూడో.