సీట్ల ద‌గ్గ‌రే జంజాటం.. ఇక ప‌వ‌ర్ షేరింగా!?

pawankalyan-with-hariramajogaiag.jpg

స‌పోజ్‌.. ప‌ర్ స‌పోజ్ వైసీపీ ఓడిపోయిందే అనుకుందాం.. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిందే అనుకుందాం. వ‌స్తే ముఖ్య‌మంత్రి అయ్యేదెవ‌రు? ప్ర‌భుత్వాన్నిన‌డిపేదెవ‌రు? ఎవ‌రేంటీ.. ఫార్టీఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ నారా చంద్రబాబునాయుడేనంటారా. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌క్షంలోనే ఆ పెద్దాయ‌న ముద్దుల పుత్రుడు నారా లోకేష్ సెల‌విచ్చింది అదేక‌దా అంటారా.. అంటే చంద్ర‌బాబుని మ‌ళ్లీ సీఎంని చేయ‌డానికే జ‌న‌సేనాని త‌న శ‌క్తియుక్తుల‌న్నీ వినియోగించాలా? ఆయ‌న్ని న‌మ్ముకుని కాపు సామాజిక‌వ‌ర్గం కూట‌మికి మ‌ద్ద‌తిచ్చేది అందుకేనంటారా.. ఎవ‌ర‌న్నా అన‌క‌పోయినా కాపుల కుల‌పెద్ద హరిరామజోగయ్య ఇవే ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు.

ఏపీ రాజ‌కీయాల్ని కాచి వ‌డ‌బోసిన‌ కాపు నేత చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య లేఖ జ‌న‌సైనికుల‌కు ఆనందం క‌లిగిస్తుంటే.. మ‌ధ్య‌లో పాన‌కంలో పుడ‌క‌లా ఈయ‌నేంది అనుకుంటున్నారు చంద్ర‌బాబు అండ్ కో. జోగ‌య్య లేఖ‌తో ఏపీలో పాలన షేరింగ్‌పై తెగ చర్చనడుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా అధికారాన్ని కూడా పంచుకుంటారా.. లేక సీట్లతోనే సరిపెడతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓ టీవీ చ‌ర్చా వేదిక‌లో దీనిపై క్లారిటీ ఇచ్చారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. అదే సమయంలో బీజేపీ నేత విష్ణు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది టీడీపీ. ఓట్లు చీలిపోయేకంటే టీడీపీతో క‌లిసి పోటీచేస్తేనే వైసీపీని గ‌ద్దె దించ‌గ‌ల‌మ‌ని జ‌న‌సేన భావిస్తోంది. అంత‌వ‌ర‌కు బానే ఉంది, అయితే అధికారం వచ్చాక సీఎం పదవిలో చంద్రబాబు ఒక్కరే కూర్చుంటారా.. లేక పవన్‌‌క‌ల్యాణ్‌తో క‌లిసి పవర్ పంచుకుంటారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఎప్పుడూ లేఖలు రాస్తూ పవన్‌కి అడ‌క్కుండానే సలహాలు, సూచనలు చేస్తున్న కాపు నేత హరిరామజోగయ్య రాసిన మ‌రో లేఖపై ఇంటాబ‌య‌టా పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. చంద్ర‌బాబు జైల్లో ఉండ‌గానే టీడీపీతో పొత్తుకి ఫిక్స్ అయింది జ‌న‌సేన‌. కానీ రెండ్నెల్లు గ‌డుస్తున్నా పొత్తు సీట్ల‌పై ఇంకా లెక్క తేల‌డం లేదు.

ఓ మెట్టు దిగి మ‌ద్ద‌తిచ్చినందుకు అలుసైపోయామా అన్న అస‌హ‌నంతో ఉన్నారు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ఆ మ‌ధ్య రెండు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసి.. గ‌బ్బ‌ర్‌తో గేమ్స్ వ‌ద్ద‌ని చెప్పేశారు. జ‌న‌సేన 50దాకా అడుగుతోంద‌ని, టీడీపీ 30లోపే తెగ్గొట్టాల‌ని చూస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పెద్దాయ‌నికి ఇదంతా చికాకు క‌లిగించిన‌ట్లుంది. జనసేన త‌క్కువ‌లో త‌క్కువ 40 నుంచి 50 సీట్ల‌లో పోటీ చేయాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు కాపు నేత చేగొండి. అంతే కాకుండా అధికారాన్ని పంచుకుంటామని ఎన్నికలకు ముందే చెబితేనే ఓట్ల బదిలీ జరుగుతుందనేది జోగ‌య్య లేఖ సారాంశం. కానీ నిజంగా ఇది సాధ్యమేనా.. ఈ అంశంపై ఎన్నిక‌ల‌ముందే క్లారిటీ వ‌స్తుందా అన్న‌దానిపై పొత్తు పార్టీల్లోనే అనుమానాలున్నాయి.

వైసీపీకి అధికారం రాకుండా చేయడమే త‌మ‌ మొదటి లక్ష్యమంటున్నారు జ‌న‌సేన ప్ర‌తినిధులు. కర్నాటకలో మాదిరి పవర్ షేరింగ్ జరగొచ్చు.. లేదంటే సీఎం సీటు షేరింగైనా జ‌ర‌గొచ్చ‌ని చెప్పుకొస్తున్నారు. జ‌న‌సేన ప‌వ‌ర్ విష‌యంలో రాజీప‌డుతుందా.. లేదా ముందే తేల్చాల‌ని పీక‌ల‌పై క‌త్తిపెడుతుందో లేదో వేరే విష‌యం. కానీ ఇదే అంశంపై బీజేపీ శిబిరం నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీతో పవర్ షేర్ చేసుకుంటాయంటూ దింపుడుక‌ళ్లెం ఆశ ప్ర‌ద‌ర్శిస్తోంది ఆ పార్టీ. ఇంకా ఎన్నికలే జరగలేదు. అధికారంలోకి రాలేదు. కానీ అప్పుడే పదవులపై లెక్కలేసుకుంటున్నాయి ఏపీలోని ప్రతిపక్షాలు. మరి ఓట్లు వేయించుకునే వరకే పొత్తు ఉంటుందా.. లేదంటే ఆ తర్వాత కూడా కొనసాగుతుందా అంటే.. ఇలాంటి భేతాళ ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబే స‌మాధానం చెప్పాలి.

Share this post

submit to reddit
scroll to top