అయ్యో.. ఏవైంది ఇజ్రాయిలూ!

israel-under-attack.jpg

ఇజ్రాయిల్‌పై భీకరదాడికి హమాస్‌ మాస్టర్‌ప్లాన్‌ ఒక్క రోజులోనో నెలరోజుల్లోనో జరిగింది కాదు. శత్రువుని కోలుకోలేని దెబ్బకొట్టేందుకు హమాస్‌ ఉగ్రవాదసంస్థ పదేళ్లుగా ప్లాన్‌ చేస్తోంది. చివరికి ఇజ్రాయిల్‌ ఆదమరిచి ఉన్న సమయంలో తన ప్లాన్‌ అమలుచేసింది. మెరుపువేగంతో ఉగ్రవాదులు దాడిచేసి సామాన్యులను ఊచకోత కోయటంతో ఇజ్రాయిల్‌ ఇంకా షాక్‌నుంచి కోలుకోలేకపోతోంది. ప్రతీకారంతో రగిలిపోతూ గాజాపై విరుచుకుపడుతోంది.

అన్ని మార్గాలనుంచీ హమాస్‌ ఇలా ముప్పేట దాడికి తెగబడుతుందని ఇజ్రాయిల్‌ ఏమాత్రం ఊహించలేదు. ఉగ్రవాదులు దేశంలోకి జొరబడి అనేక మంది పౌరులను, సైనికులను బందీలుగా చేసుకోవడంతో ఇంటలిజెన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఇజ్రాయిల్‌ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఇజ్రాయిల్‌ తేరుకుని ప్రతిఘటించేలోపే భారీనష్టం జరిగిపోయింది. పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోయారు. ఇజ్రాయిల్‌ చరిత్రలోనే ఊహించనంత భీకర దాడి చేశారు హమాస్‌ ఉగ్రవాదులు.

ఆపరేషన్‌ ఆల్‌ అఖ్సా స్టార్మ్‌ పేరిట జరిపిన ఈ మెరుపుదాడికి పదేళ్లుగా నిశ్శబ్దంగా ఏర్పాట్లు జరిగిపోయాయి. వాస్తవానికి హమాస్‌ ఓ భారీ దాడికి పాల్పడే అవకాశం ఉందని 2014లోనే దీనిపై హెచ్చరికలు వచ్చినా ఇజ్రాయిల్‌ తేలిగ్గా తీసుకుంది. మెరుపుదాడికోసం ఉగ్రవాదులను విదేశాలకు పంపి హమాస్‌ శిక్షణ ఇప్పించింది. దీనికి తోడు విదేశీ టెక్నాలజీని కూడా సంపాదించింది. హమాస్‌ ఉగ్రవాదులు మోటారైజ్డ్‌ పారాగ్లైడర్లు వాడతారని, అంత పెద్ద సరిహద్దుగోడని అలవోకగా దూకి దేశంలోకి జొరబడతారని ఇజ్రాయిల్‌ కల్లో కూడా అనుకోలేదు.

మరోవైపు మధ్యదరా సముద్రం నుంచి చిన్నచిన్న పడవల్లో గాజా మీదుగా ఇజ్రాయిల్‌లోకి అడుగుపెట్టారు హమాస్‌ ఉగ్రవాదులు. అటు కంచెను బుల్‌ డోజర్లతో పడగొట్టి భూ మార్గం గుండా అనేక వాహనాల్లో ఇజ్రాయిల్‌లోకి దూసుకొచ్చారు. ఏకకాలంలో మూడు మార్గాల్లోనూ ఇంత సమన్వయంతో హమాస్‌ దాడి చేస్తుందని ఇజ్రాయిల్‌ సైనిక బలగాలు ఊహించలేదు. పారా గ్లైడర్లతో దాడిచేసి ఇజ్రాయిల్‌ పౌరులను అపహరించేందుకు హమాస్‌ కుట్ర పన్నుతోందని 2014లోనే నిఘావర్గాలకు సమాచారం అందింది. పదేళ్ల క్రితమే ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దీనిపై కథనం కూడా ప్రచురితమైంది. అయితే హమాస్‌ పారాగ్లైడర్లను ఎప్పుడూ దాడులకు వాడకపోవడంతో ఇజ్రాయిల్‌ బలగాలు దాన్ని తేలిగ్గా తీసుకొన్నాయి. ఆళ్లకంత సీన్లేదని తీసిపారేస్తే ఇప్పుడు ఇజ్రాయిల్‌పై దాడితో హమాస్‌ పెద్దసవాలే విసిరింది.

Share this post

submit to reddit
scroll to top