తెలంగాణలో ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే పనులకు శ్రీకారంచుట్టారు కాంగ్రెస్ కొత్త సీఎం. సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ప్రగతిభవన్ శత్రుదుర్భేద్య కట్టడంలా ఉండేది. రోడ్డుమీదినుంచే ఇనుపకంచె మొదలయ్యాయి. కేసీఆర్ అధికారిక నివాసంలోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. ప్రజాప్రతినిధులు, మీడియాకే అనేక ఆంక్షలు అమలయ్యేవి. ఇక సామాన్యులైతే గేటుదాకా వెళ్లే అవకాశమే ఉండేది కాదు. ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రగతి భవన్‌ను కాంగ్రెస్ అధికారంలోకొస్తే ప్రజాభవన్‌గా మారుస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాటను ప్రమాణస్వీకారానికి ముందే నిలబెట్టుకున్నారు.
తెలంగాణ ప్రజల కోసం ప్రజాభవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని.. వారి సమస్యలను వినేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాణస్వీకారం జరిగిన రెండో రోజే ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టారు. ప్రగతిభవన్ ముందు ఉన్న కంచెలను తొలగించాలని కొత్త ప్రభుత్వం ఆదేశించటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెలు, బారికేడ్ల తొలగింపు మొదలైంది. అధికారం శాశ్వతం అన్నట్లు కాంక్రీటేసి దాదాపు 20 అడుగుల ఎత్తున కట్టిన బారికేడ్లను గ్యాస్ కట్టర్లు, జేసీపీలతో తీసేస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసుని కేసీఆర్ కొత్తగా నిర్మించి ప్రగతి భవన్‌గా నామకరణం చేశారు. బారికేడ్లు, భారీ కంచెలతో ప్రగతిభవన్ సామాన్యులకు అందనంత ఎత్తులో ఉండేది. ప్రజల నిరసనలను అడ్డుకునేందుకే కంచె ఏర్పాటు చేశారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించినా కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్ పేరును డా.బీఆర్. అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుతున్నట్టు ప్రకటించారు. ప్రజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా ప్రగతి భవన్‌కు రావొచ్చని.. తమ సమస్యలు చెప్పుకోవచ్చని స్పష్టం చేశారు.
ఓ పక్క ప్రమాణస్వీకారం జరుగుతుండగానే ప్రగతిభవన్ ముందు ఉన్న కంచెను తొలగించారు పోలీసులు. బారికేడ్ల లోపలి నుంచి వాహనాలకు అనుమతించారు. ఎన్నో ఏళ్లుగా ఆమార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డ సామాన్య జనం స్వాతంత్ర్యం వచ్చిన అనుభూతి పొందారు. అధికారంలోకి రాగానే ప్రజల ఆకాంక్షలు మరిచిపోతే ఏంజరుగుతుందో బీఆర్‌ఎస్‌కి తెలిసొచ్చింది. కంచెల తొలగింపుతోనే ఈ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుందన్న నమ్మకం సామాన్యుల్లో కలుగుతోంది. ప్రజా ప్రభుత్వ హామీ సాకారమయ్యేదాకే ఎంత నమ్మకమైనా!