అది తన భావ స్వేచ్ఛనేమో.. సారీ చెప్పడట!

trisha-mansooralikhan.jpg

సిన్మా ఇండస్ట్రీ అంటేనే హీరోలు హీరోయిన్లనుంచి మొదలుపెడితే విలన్లూ, ఎక్‌ట్రా ఆర్టిస్టులదాకా అది మరో ప్రపంచం. వచ్చేవాళ్లు వస్తుంటారు. పోయేవాళ్లు పోతుంటారు. కొంతమంది అలా నిలబడిపోతుంటారు. హీరోలైతే మనవరాలి వయసున్న కొత్త హీరోయిన్ల పక్కన కూడా స్టెప్పులేసే ఛాన్స్‌ ఉంటుంది. కానీ హీరోయిన్లే పదేళ్లు పాతుకుపోయే అవకాశాలు చాలా తక్కువ. త్రిషలాంటి హీరోయిన్లు కాస్త డిఫరెంట్‌. ఇండస్ట్రీకొచ్చి ఇరవైఏళ్లుదాటినా వయసు 40పైబడినా తనకు ఇప్పటికీ డిమాండ్‌ ఉంది.

ఏం త్రిషేనా.. ఇంకెవరూ లేరా అంటే ఉన్నారు. కానీ త్రిష చుట్టూ ఓ వివాదం నడుస్తుంది కాబట్టే ఆమె పేరు ప్రస్తావించాల్సి వస్తోంది. త్రిష మంచి నటి. అందులో సందేహమే లేదు. ఎప్పుడో 19ఏళ్లక్రితం వచ్చిన వర్షం సిన్మా అయినా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా అయినా, 18ఏళ్లనాటి పౌర్ణమి సిన్మా అయినా.. తన నటనను ఎలా మర్చిపోగలం. వయసు మీదపడిందన్న మాటేగానీ తను ఇప్పటికీ అలాగే ఉంది. అందుకే మన్సూర్‌అలీఖాన్‌లాంటి విలన్‌ (నటనపరంగానే సుమా) కన్ను ఆ హీరోయిన్‌మీద పడింది. త్రిష నటించిన లియో సిన్మాలో తను కూడా ఉన్నాడు. కానీ ఆ సీన్‌ చేసే ఛాన్స్‌ రాలేదంటూ బాధపడ్డాడు. ఎన్నో సిన్మాల్లో తన విలనిజాన్ని ప్రదర్శించిన మన్సూర్‌అలీఖాన్‌.. లియోలో త్రిషతో రేప్‌ సీన్‌ చేసే అవకాశం రాకపోవడం పెద్ద లోటుగా ఉందట! అదే విషయాన్ని బయటికి చెప్పేశాడు. త్రిషే కాదు మొత్తం ఇండస్ట్రీనే ఆ వ్యాఖ్యలతో షాక్‌తింది.

విషయం సీరియస్‌ కావటంతో నడిగర్‌సంఘం తనపై నిషేధం విధించినా అంత తప్పుగా ఏం మాట్లాడానని బుకాయిస్తున్నాడు మన్సూర్‌అలీఖాన్‌. సిన్మాల్లో రేప్‌ చేస్తే నిజంగా చేసినట్లా? తెరపై మర్డర్‌ చేస్తే నేరం చేసినట్లా అని నిలదీస్తున్నాడు. నిషేధం విధించిన నడిగర్‌ సంఘానికే ఉల్టా అల్టిమేటం ఇచ్చి డెడ్‌లైన్‌ పెట్టాడు. త్రిష గురించి తానేం తప్పుగా మాట్లాడలేదని, ఆమెకు సారీచెప్పే ప్రశ్నేలేదంటున్నాడు సినీ విలన్‌. తనకు ఎలాంటి దురుద్దేశంలేదని క్షమాపణలు కోరితే వివాదం సద్దుమణిగేదేమో. కానీ మన్సూర్‌అలీఖాన్‌కి ఆ వ్యాఖ్యల్లో తప్పు కనిపించడం లేదంటే ఏమనాలి?

మన్సూర్‌అలీఖాన్‌పై కేసు నమోదుచేయాలని జాతీయ మహిళా కమిషన్‌ పోలీసులను ఆదేశించింది. డీజీపీ ఆదేశాలతో చెన్నై పోలీసులు కోలీవుడ్‌ విలన్‌ మన్సూర్‌పై ఐపీసీ 354A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మన్సూర్‌అలీఖాన్‌ వ్యాఖ్యలను తప్పుపడుతూనే చిన్మయి ఓ ప్రశ్న అడిగింది. నయనతారపై ఇంతకంటే దారుణంగ మాట్లాడిన రాధారవిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని. తప్పు ఎవరిదైనా తప్పే. ఇండస్ట్రీ మానమర్యాదలు కాపాడే విషయంలో నియమాలు అందరికీ వర్తిస్తే బావుంటుంది. స్టాలిన్‌ కొడుకుతో నయనతార సహజీవనం చేస్తోందన్న రాధారవికి అప్పట్లోనే చీవాట్లుపెట్టుంటే.. మన్సూర్‌అలీఖాన్‌లాంటి వాడి నోరు కాస్త నియంత్రణలో ఉండేదేమో!

Share this post

submit to reddit
scroll to top