నాయకుల్లో నేరచరితులెవ్వరు?!

leaders-cases.jpg

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితులు ఈసారి కూడా ఎక్కువగానే ఉన్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 56 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. నేర చరిత్ర ఉన్న నేతలు అభ్యర్థులుగా ఉంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పార్టీలు పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. వారిపై ఉన్న కేసుల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.

2018 ఎన్నికలతో పోలిస్తే 2023 నాటికి కాంగ్రెస్, బీజేపీ నాయకులపై కూడా క్రిమినల్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆయా పార్టీల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఒక్కో ప్రతిపక్ష నాయకుడిపై కేసుల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగింది. కొడంగల్‌తో పాటు కామారెడ్డినుంచి పోటీచేస్తున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై 2018లో 42 క్రిమినల్ కేసులుంటే ఇప్పుడవి రెట్టింపయ్యాయి. తనపై 89 కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 2018లో 43 కేసులు ఉంటే ఈ ఎన్నికలనాటికి అవి 89కి పెరిగాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై గత ఎన్నికల్లో 6 కేసులు ఉంటే నాలుగు సంవత్సరాల్లో ఆయనపై కొత్తగా 53 కేసులు నమోదయ్యాయి. గతంలో ఒకే కేసు ఉన్న మరో బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌పై ఆయన ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2018లో ఒక్క కేసు కూడా లేని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై ఈ ఐదేళ్లలో 27 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈటల రాజేందర్‌పై గత ఎన్నికల్లో కేవలం 3 కేసులుంటే ఇప్పుడు వాటి సంఖ్య 40కి చేరింది.

గత ఎన్నికలతో పోలిస్తే ఆశ్చర్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులపై మాత్రం క్రిమినల్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో చాలా కేసులు వీగిపోయాయి. 2018 ఎన్నికల్లో 59 మంది బీఆర్ఎస్ అభ్యర్థులపై కేసులున్నాయి. 2023 నాటికి 56 మందిపై కేసులు ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. సీఎం కేసీఆర్‌పై గతంలో 54 క్రిమినల్‌ కేసులుంటే ఇప్పుడు వాటి సంఖ్య తొమ్మిదికి తగ్గిపోయింది. మంత్రి కేటీఆర్‌పై గతంలో 16 కేసులు పెండింగ్‌లో ఉంటే.. ఇప్పుడు ఏడు కేసులే పెండింగ్‌. మంత్రి హరీష్‌రావుపై గతంలో 39 కేసులున్నాయి. తాజా అఫిడవిట్ ప్రకారం హరీష్‌పై కేవలం మూడు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో గంగుల కమలాకర్‌పై 10, పాడి కౌశిక్ రెడ్డిపై 4, సబితా ఇంద్రారెడ్డి, సైదిరెడ్డిలపై ఐదేసి కేసులు, చల్లా ధర్మారెడ్డిపై 4, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నోములభగత్‌పై మూడేసి కేసులు, పట్నం నరేందర్ రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, దానం నాగేందర్‌పై రెండేసి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

క్రిమినల్ కేసులున్న అభ్యర్థులకు టికెట్లిస్తే ఆయా పార్టీలు అధికారికంగా పత్రికా ప్రకటన ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2018 లోనే అత్యున్నతన్యాయస్థానం దీనిపై ఆదేశాలిచ్చినా గత ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ 56 మంది అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను పత్రికాముఖంగా ప్రకటించింది. సుప్రీం నిబంధనల ప్రకారం మిగతా పార్టీలు కూడా తమ అభ్యర్థుల క్రిమినల్ కేసుల వివరాలు మూడుసార్లకు తగ్గకుండా ప్రకటించాల్సి ఉంటుంది.

 

Share this post

submit to reddit
scroll to top