ఇక అంతా జనంలోనే.. జనంతోనే!

Jagan-Ycp-Lokesh-Tdp.jpg

జనంలోకి వెళ్లాలి. జనంతోనే ఉండాలి. సంక్షేమపథకాలు ఎన్ని అమలుచేసినా, రేపొచ్చాక చందమామను తుంచి చేతికిస్తామన్నా కళ్లముందు కనిపిస్తేనే గుర్తు గుద్దేదాకా గుర్తుండిపోతాం. అందుకే ఏపీలో రాజకీయపక్షాలు యాత్రలకు సిద్ధమవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల సమయం ఉండగానే జనంలోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు యాత్రలకు సిద్ధమవుతున్నాయి. సామాజిక బస్సు యాత్రకు వైసీపీ రెడీ అవుతోంది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి, భవిష్యత్తుకు గ్యారంటీతో నారా లోకేష్‌ యాత్రలకు సన్నద్ధమవుతున్నారు.

వై నాట్‌ 175 అంటున్న వైసీపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు తామేం చేశామో చెప్పేందుకు సిద్ధమవుతోంది. రాబోయే రెండు నెలల పాటు వైసీపీ శ్రేణులు ప్రజల్లో ఉండేలా సామాజిక న్యాయ బస్సు యాత్రకు వైసీపీ సన్నద్ధమైంది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రోజుకో నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర కొనసాగించబోతోంది. అక్టోబరు 26 నుంచి 9వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో 13రోజులపాటు బస్సు యాత్ర కొనసాగుతుంది. రాయలసీమలోని శింగనమల నియోజకవర్గం నుంచి అదే రోజు బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దక్షిణ కోస్తాలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి అదే ముహూర్తానికి వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.

చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత డీలాపడ్డ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు టీడీపీ ప్రజల్లోకి వెళ్లాలనుకుంటోంది. నారా లోకేష్‌, నారా భువనేశ్వరి ఇక నుంచి ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టుని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించబోతున్నారు. నిజం గెలవాలి పేరుతో చేపట్టే ఈ యాత్రలో భాగంగా ప్రతీ వారం రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారు. చంద్రబాబు అరెస్టుతో అప్పటిదాకా జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రతో పాటు లోకేష్ యువగళం పాదయాత్ర కూడా నిలిచిపోయింది. దీంతో కొన్నాళ్లు యువగళం యాత్రను పక్కన పెట్టి భవిష్యత్తుకు గ్యారంటీ యాత్రను కొనసాగించాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.

Share this post

submit to reddit
scroll to top