ఏపీ కాంగ్రెస్‌లో దింపుడుకళ్లెం ఆశలు!

ap-congress.jpg

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్‌ గల్లంతైన కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కీలక నేతలంతా కండువాలు మార్చినా ఆ పార్టీలో దింపుడుకళ్లెం ఆశ మిగిలే ఉన్నట్లుంది. తెలంగాణలో పార్టీ విజయం ఏపీ కాంగ్రెస్‌కి కూడా కిక్కిస్తోంది. మళ్లీ పవర్‌లోకి వచ్చేందుకు వైసీపీ అప్పుడే ప్రక్షాళన చర్యలకు దిగింది. తెలుగుదేశం-జనసేన కలిసి దిగబోతున్నాయి. బీజేపీ కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఉందో లేదో కూడా ఈ తొమ్మిదిన్నరేళ్లూ జనం పట్టించుకోని కాంగ్రెస్‌కూడా కదనరంగానికి సై అంటోంది.

పోగొట్టుకున్నచోటల్లా మళ్లీ వెతుక్కోవడంపై దృష్టిపెడుతున్న కాంగ్రెస్‌ పెద్దలు తెలంగాణ విజయంతో ఇక ఏపీ మీద గురిపెట్టారు. మొన్న కర్నాటక గెల్చుకున్నాం.. నిన్న తెలంగాణలో జెండా ఎగరేశాం. ఇప్పుడు ఏపీ వంతు అంటూ ఆట మొదలుపెట్టేసింది అధిష్ఠానం. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్‌కి బాగా కలిసొచ్చిందీ నినాదం. దీన్నిప్పుడు ఏపీలో మోగిద్దామన్న ప్లాన్‌తో కాంగ్రెస్‌ నాయకత్వం ఉంది. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో ఇప్పుడు ఏపీగురించే గట్టి చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు పార్టీకి ఆయువుపట్టుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏఐసీసీ వార్‌రూమ్‌లో మేథోమధనం మొదలైంది. ఏపీలో పార్టీని చక్కబెట్టడమే ఎజెండాగా ఒక జనరల్ సెక్రటరీని ప్రత్యేకంగా నియమించింది పార్టీ హైకమాండ్. తెలంగాణలో కాంగ్రెస్‌ విక్టరీలో తెరవెనుక వ్యూహరచన చేసిన సునీల్ కనుగోలును మళ్లీ లైన్‌లో పెట్టింది. ఇన్నాళ్లూ ఏపీ రాజకీయాల్లో దాదాపు ప్రేక్షకపాత్రకే పరిమితమైన పీసీసీ గేర్ మార్చేసింది. గతంలో పార్టీలో ఓ వెలుగు వెలిగిన లీడర్లలో ఉత్సాహం నింపేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వేరేపార్టీలనుంచి నేతలు కాంగ్రెస్‌కి జైకొట్టబోతున్నారని పీసీసీ ప్రెసిడెంట్‌ చెబుతున్నారు. ఏమో రాజకీయాల్లో అసాధ్యాలేమీ ఉండవు. అనూహ్యంగా ఏవైనా జరిగిపోతుంటాయంతే!

Share this post

submit to reddit
scroll to top