దాచడానికేం లేదు.. అది తెల్లటికాగితం!

whitepaper-in-telangana-assembly.jpg

ఆర్థిక క్రమశిక్షణలేని కుటుంబమే కాదు అడ్డగోలు అప్పులు చేసే ప్రభుత్వాలైనా దివాలాతీయాల్సిందే. కానీ అధికారంకోసం అప్పుచేసి పప్పుకూడు తినిపించడం ఈ కాలపు పాలకులకు అలవాటైపోయింది. మిగులురాష్ట్రాన్ని అప్పులపాలుచేసిన కేసీఆర్‌ ఏలుబడిలోని గత ప్రభుత్వానిది తప్పా? అలవిమాలిన హామీలిచ్చి ఖాళీ ఖజానా చూసి గుండెలు బాదుకుంటున్న కాంగ్రెస్‌ కొత్తసర్కారుది తొందరపాటా? కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చిన రెండువారాల్లోనే బీఆర్‌ఎస్‌ అసహనం ప్రదర్శిస్తోంది. ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడని ప్రశ్నిస్తోంది. మాట తప్పం మడమ తిప్పం అంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గత పాలకులకు బట్టలిప్పి బజారులో నిలబెట్టే ప్రయత్నాల్లో ఉంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదలచేసిన శ్వేతపత్రాలపై తెలంగాణ అసెంబ్లీలో రగడ జరుగుతోంది. పదేళ్లలో మేం సాధించిన ప్రగతి ఇదిగో అంటూ బీఆర్‌ఎస్‌ ముందే డాక్యుమెంటరీని రిలీజ్‌ చేసింది. పదేళ్లు మీరు చేసిన నిర్వాకాలు ఇవిగో అంటూ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసింది. అయితే ఆ వైట్‌పేపర్‌ తప్పులతడకగా ఉందటోంది బీఆర్‌ఎస్‌. దాని చిరకాల నేస్తం ఎంఐఎం కూడా అదే మాటంటోంది. 42 పేజీలతో రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు పెట్టడమే ఈ శ్వేతపత్రం ఉద్దేశమంటోంది.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని.. విద్య, వైద్య రంగాల్లో గతప్రభుత్వ బడ్జెట్‌ దేశంలోనే అట్టడుగున ఉందంటోంది కాంగ్రెస్‌ సర్కారు. ప్రభుత్వ శాఖల దగ్గరున్న సమాచారంతో పాటు, బడ్జెట్‌, కాగ్‌, ఆర్బీఐ నివేదికల ఆధారంగా శ్వేతపత్రం విడుదల చేశామని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. అయితే ఆ శ్వేతపత్రం కక్ష సాధింపులా ఉందన్నది బీఆర్‌ఎస్‌ ఆరోపణ. తెలంగాణ ప్రతిష్ట దిగజారేలా శ్వేతపత్రం ఉందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తప్పుబట్టారు. మొత్తానికి వైట్‌ పేపర్‌ పై అధికార, విపక్షాల మధ్య వార్‌ పీక్‌లోకి చేరింది. ఇంతకీ తెలంగాణ గడిచిన పదేళ్లలో అభివృద్ది పథంలో నడించిందా? లేక అప్పుల కుప్పగా మారిందా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి.

Share this post

submit to reddit
scroll to top