వడ్డించేవాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా విస్తట్లోకి (ఈకాలంలో ప్లేట్లలోకి) అన్నీ వచ్చి పడతాయి. ఆందోళన పడాల్సిన పన్లేదు. అగ్రనాయకత్వం చుట్టూ తిరగాల్సిన పన్లేదు. ఎందుకంటే వాళ్లెప్పుడో టిక్ పెట్టేసుకుని ఉంటారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌లో ఓ పేరు ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పన్లేదు. ఎందుకంటే మేడమ్ మేడమే. ఆమెకివ్వకపోతే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి కూడా టికెట్ డౌటేనన్నంత ప్రచారం జరిగింది. అనుమానాలేమీ లేకుండా ఫస్ట్ లిస్టులోనే మేడమ్ పేరొచ్చేసింది.
తెలంగాణమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ డాక్టర్ కోట నీలిమకి దక్కింది. కొన్నాళ్లుగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ కీలక కార్యక్రమం ఉన్నా ఆమె కనిపిస్తున్నారు. గట్టిగా గొంతు వినిపిస్తున్నారు. ఆమె ఎవరయ్యా అంటే రచయిత్రి, పరిశోధకురాలు, వ్యాఖ్యాత, కళాకారిణి. అన్నిటికీ మించి నాయకురాలు. క్షేత్రస్థాయిలో సమస్యల్ని, సామాజిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విద్యావంతురాలైన మహిళ. లాబీయింగ్ పాలిటిక్స్ నడిచే కాంగ్రెస్‌లో ఆమెకు సీటెలా వచ్చిందని ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు. ఆమె భర్త పవన్‌ఖేరా కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో కీలక నేత. పార్టీ గొంతు వినిపించే స్పోక్స్‌పర్సన్. ఇది చాలదా కోరుకున్న సీటు దక్కేందుకు!
డాక్టర్ కోట నీలిమ ఇప్పటిదాకా అధ్యయనాలు చేసుండొచ్చు. వివరణాత్మక ప్రసంగాలు చేసుండొచ్చు. కానీ ఎన్నికల బరిలో ఆమె తలపడుతోంది మోండా మార్కెట్ శీనన్నగా పేరున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో. ఆయన ఫుల్ మాస్. మరి మేడమ్ క్లాస్ పాలిటిక్స్ సనత్‌నగర్‌లో ఎంతవరకు ఓట్లు రాబడతాయో చెప్పలేం. సేమ్ టైమ్ తండ్రి శశిధర్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లినా కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్న మర్రి ఆదిత్యరెడ్డి ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. ఆయనెవరో కాదు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు. అందుకే టికెట్ రాగానే సంబడం కాదు.. కోట నీలిమకి అసలు అగ్నిపరీక్ష ముందుంది.